ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలి: పార్టీ శ్రేణులకు జగన్ ఉద్బోధ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి సమావేశం సోమవారం ప్రారంభం అయ్యింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమ నిర్బంధం నుంచి బయటకు వచ్చిన తరువాత జరుగుతున్న తొలి విస్తృతస్థాయి సమావేశం ఇదే కనుక అనేక ప్రధానమైన అంశాలు ఇందులో చర్చకు వచ్చాయి. రానున్న రోజుల్లో సమైక్య ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో.. ప్రత్యేకంగా దానిపై చర్చించారు. పార్టీ శ్రేణులకు ఈ విషయంపై అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఓటర్ల నమోదు చాలా కీలకం అయినందున ఆ అంశంపై దృష్టిపెట్టాలని తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు చూడాలన్నారు. అలాగే గడప గడపకూ పార్టీ వెళ్లాలని, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పథకాలను అమలు చేస్తామన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
ఇక ఇన్నాళ్లూ పార్టీని ముందుండి నడిపించిన గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఇంతకాలం జిల్లాల పర్యటనలు, నాయకులతో భేటీలు, పోరాటాలు, ఆందోళనలతో పార్టీని నడిపించడంతో పాటు జిల్లాల పరిస్థితులు బాగా తెలియడంతో విజయమ్మ సైతం వివిధ జిల్లాల నాయకులకు తన సూచనలు, సలహాలు అందిస్తున్నారు.