
సుందర్ నర్సరీలో వాల్టర్‌తో మోదీ
న్యూఢిల్లీ: జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్‌తో భారత ప్రధాని మోదీ విస్తృత చర్చలు జరిపారు. ఐదు రోజుల భారత పర్యటనలో ఉన్న వాల్టర్‌ను ఢిల్లీలోని సుందర్ నర్సరీలో మోదీ కలిశారు. ‘సుందర్ నర్సరీకి జర్మనీ అధ్యక్షుణ్ని తీసుకెళ్లే గౌరవం నాకు దక్కింది. అనేక అంశాలపై మేం విస్తృత చర్చలు జరిపాం’ అని తర్వాత మోదీ ట్వీట్ చేశారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ఉన్న మార్గాలపై మోదీ, వాల్టర్‌లు చర్చించారు.
అంతకు ముందు వాల్టర్ ఉప రాష్ట్రపతి వెంకయ్య, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలిశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, సమస్యలపై భారత్, జర్మనీల వైఖరి ఒకేలా ఉందని వెంకయ్య అన్నారు. వెంకయ్యను కలవడానికి ముందు రాష్ట్రపతి భవన్‌లో వాల్టర్‌కు ఘన స్వాగతం లభించింది. గురువారం భారత పర్యటనను ప్రారంభించిన వాల్టర్ ఆదివారం చెన్నైలోని మద్రాస్ ఐఐటీలో వాణిజ్య వేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సోమవారం మహాబలిపురం ఆలయాన్ని సందర్శిస్తారు.