extension of the deadline
-
పాన్–ఆధార్ అనుసంధానానికి గడువు పెంపు
న్యూఢిల్లీ: పాన్, ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు నిర్దేశించిన గడువును ప్రభుత్వం మరో మూడు నెలల పాటు జూన్ 30 వరకూ పొడిగించింది. వాస్తవానికి ఇది మార్చి 31తో ముగియాల్సి ఉంది. అయితే, ఆధార్‌తో పాన్‌ను అనుసంధానం చేసుకునేందుకు ప్రజలకు మరింత సమయం ఇవ్వాలంటూ రాజకీయ పార్టీలు సహా పలు వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్యాక్స్‌పేయర్లకు మరికాస్త సమయం ఇచ్చే క్రమంలో పాన్, ఆధార్‌ను లింక్ చేసుకునేందుకు గడువు తేదీని 2023 జూన్ 30 వరకు పెంచినట్లు ఆర్థిక శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. నిర్దేశిత గడువులోగా వీటిని లింకు చేసుకోని వారి పాన్ నంబర్లు జూలై 1 నుంచి పనిచేయవు. దీని వల్ల ట్యాక్స్‌పేయర్లు ట్యాక్స్ రీఫండ్లను గానీ వాటిపై వడ్డీలను గానీ క్లెయిమ్ చేసుకోవడానికి వీలుండదు. అలాగే వారికి టీడీఎస్, టీసీఎస్ భారం కూడా ఎక్కువగా ఉంటుంది. పాన్, ఆధార్ అనుసంధానానికి ప్రభుత్వం డెడ్‌లైన్‌ను పలు దఫాలు పొడిగిస్తూ వస్తోంది. వాస్తవానికి గతేడాది (2022) మార్చి ఆఖరు నాటికే పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవాలని తొలుత గడువు విధించారు. అది దాటాకా 2022 ఏప్రిల్ 1 నుంచి రూ. 500 జరిమానా ప్రతిపాదించారు. దాన్ని గతేడాది జూలై 1 నుంచి రూ. 1,000కి పెంచారు. ప్రస్తుతం ఇదే పెనాల్టీ అమలవుతోంది. ఇప్పటివరకు 51 కోట్ల పాన్లు (పర్మనెంట్ అకౌంటు నంబర్) ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. -
వివాదాలన్నీ సుప్రీం ఉత్తర్వుల పరిధిలోకి రావు!
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు విషయంలో సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులపై పరోక్ష పన్నులు, సుంకాల కేంద్ర బోర్డు (సీబీఐసీ) బుధవారం వివరణ ఇచ్చింది. అరెస్ట్, సెర్చ్, సమన్ల వంటివి సుప్రీంకోర్టు లిమిటేషన్ పొడిగింపు ఉత్తర్వుల పరిధిలోనికి రావని స్పష్టం చేసింది. కేవలం పిటిషన్లు, అప్లికేషన్లు, సూట్స్, అప్పీళ్లు వంటి ప్రొసీడింగ్స్‌కు మాత్రమే సుప్రీం ఉత్తర్వుల పరిధిలోనికి వస్తాయని తెలిపింది. పెండింగ్ కేసులను పన్నుల అధికారులు వేగవంతంగా పరిష్కరించడానికి తాజా సీబీఐసీ వివరణ దోహదపడుతుందని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజిత్ మోహన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రిఫండ్, రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ లేదా రద్దు అప్లికేషన్లపై అధికారులు నిర్ణయాలు తీసుకోవడంసహా డిమాండ్ నోటీసుల ప్రొసీడింగ్స్ నిర్వహణ, ఇప్పటికే దాఖలైన అప్పీళ్ల విచారణ వంటివి కొనసాగించడానికి అధికారులకు వీలు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. -
కేంద్ర ప్రభుత్వ పెన్షన్ దారులకు శుభవార్త
న్యూఢిల్లీ : కోవిడ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పెన్షన్ దారులకు శుభవార్త. నవంబర్ చివరిలోగా సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికెట్ గడువును ఈ ఏడాది చివరి వరకూ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా 80 ఏళ్లు దాటినవారు అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31లోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చని తెలిపారు. అప్పటి వరకూ వారి పెన్షన్ పంపిణీకి ఎలాంటి ఢోకా ఉండబోదని పేర్కొన్నారు. వృద్ధులకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న కారణంగా లైఫ్ సర్టిఫికెట్ గడువును పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. ఆయా బ్యాంకులు వీడియో ఆధారిత గుర్తింపు కాల్ (వీ సిప్) ద్వారా వారిని గుర్తించి పెన్షన్ ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించారు. చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన భారత్ బయోటెక్ -
హెచ్1బీ వీసాదారులకు ఊరట
వాషింగ్టన్: అమెరికాలో భారత్ సహా వివిధ దేశాల నుంచి వచ్చిన వలసదారులకు భారీ ఊరట లభించింది. వివిధ కారణాలతో నోటీసులు అందుకున్న హెచ్1బీ వీసాదారులు, గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు స్పందించడానికి, అవసరమైన పత్రాలను సమర్పించడానికి ట్రంప్ సర్కార్ మరో రెండు నెలలు గడువు పొడిగిస్తూ అనుమతులు మంజూరు చేసింది. హెచ్1బీ, గ్రీన్‌కార్డులకు సంబంధించి నోటీసులు అందుకున్న వారు స్పందించడానికి గడువును మరో 60 రోజులు పెంచినట్టుగా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వెల్లడించింది. వీసా పొడిగింపు విజ్ఞప్తులు (ఎన్–14), తిరస్కరణ నోటీసులు, ఉపసంహరణ నోటీసులు, ప్రాంతీయ పెట్టుబడుల ఉపసంహరణ, ముగింపు నోటీసులు, ఫారమ్ ఐ–290బీ సమర్పణలు, దరఖాస్తు నోటీసులు వంటి వాటిపై అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడానికి గడువు పెంచింది. ఇప్పటికే జారీ చేసిన నోటీసులపై ఉన్న గడువు తేదీ తర్వాత మరో రెండు నెలలపాటు వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. ఫారమ్ ఐ–290బీ నింపి పంపించడానికి ఈ ప్రకటన విడుదలైన నుంచి 60 రోజుల వరకు గడువు ఉంటుంది. అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటుకు వీలు కల్పించే గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు రెండున్నర లక్షల వరకు ఉన్నారు. -
సీఎంలతో నేడు మోదీ చర్చలు
న్యూఢిల్లీ: కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14వ తేదీ తరువాత ఎత్తివేయాలా? వద్దా? అన్న అంశంపై ప్రధాని మోదీ శనివారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరపనున్నారు. ఈ సమావేశం అనంతరమే లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రధాని ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రుల అభిప్రాయాలను, సలహా, సూచనలను తీసుకోనున్నారు. అయితే పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ పొడిగింపునకు మద్దతు తెలిపిన నేపథ్యంలో తుది నిర్ణయం కూడా ఇదే దిశగా ఉండవచ్చునని అంచనా. పార్లమెంటులో వేర్వేరు రాజకీయ పార్టీల నేతలతో మోదీ మూడు రోజుల క్రితం మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తేదీ తరువాత ఒకేసారి లాక్డౌన్ ఎత్తివేయడం సాధ్యం కాదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రతి ప్రాణాన్ని కాపాడుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కూడా ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రాలు, జిల్లా స్థాయి యంత్రాంగం, నిపుణులు కూడా లాక్‌డౌన్‌ను పొడిగించాలనే సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒడిశా ఒకడుగు ముందుకేసి ఏప్రిల్ 30వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించింది కూడా. ప్రధాని మోదీ సీఎంలతో సంప్రదింపులు జరపడం ఇది రెండోసారి. ఏప్రిల్ 2న తొలి సమావేశంలో దశలవారీ లాక్డౌన్ ఎత్తివేతకు అనుకూలంగా ప్రధాని మాట్లాడారు. సమూహ వ్యాప్తి లేదు: కేంద్రం న్యూఢిల్లీ/భువనేశ్వర్/చండీగఢ్: కరోనా వైరస్‌కు సంబంధించి భారత్‌లో ఇప్పటివరకు సమూహ వ్యాప్తి(కమ్యూనిటీ ట్రాన్స్మిషన్) దశ రాలేదని కేంద్రం ప్రకటించింది. అలాంటిదేమైనా ఉంటే, ప్రజల్లో అప్రమత్తత పెంచేందుకు ముందు మీడియాకే చెప్తామని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ శుక్రవారం వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ బారిన పడిన 104 మందిలో 40 మందికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ కానీ, పాజిటివ్‌గా తేలిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న చరిత్ర కానీ లేదని తేలిందని ఐసీఎంఆర్ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించగా, లవ్ అగర్వాల్ పై సమాధానం ఇచ్చారు. మరోవైపు, కోవిడ్–9పై సమర్ధవంతంగా పనిచేస్తుందని తేలిన హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఎగుమతి చేయాలంటూ పలు దేశాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని విదేశాంగ శాఖ పేర్కొంది. అయితే, భారత్‌కు అవసరమైన స్టాక్ ఉన్న తరువాత, మిగతా స్టాక్‌ను ఎగుమతి చేయాలని నిర్ణయించామని తెలిపింది. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కు తీసుకువచ్చే విషయంపై.. కరోనా వ్యాప్తి పరిస్థితిని సమీక్షించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి దమ్ము రవి తెలిపారు. అది ప్రమాదకరం కరోనా వైరస్‌ను పూర్తిగా కట్టడి చేయకముందే తొందరపడి ఆంక్షలను ఎత్తివేస్తే అత్యంత ప్రమాదకర పరిస్థితి నెలకొంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అలా చేస్తే.. వైరస్ వ్యాప్తి అడ్డుకోలేని దశకు చేరుకునే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. లాక్‌డౌన్‌పై మీ అభిప్రాయం ఏమిటి? దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై తమ అభిప్రాయాలు తెలపాల్సిందిగా కేంద్ర హోం శాఖ శుక్రవారం రాష్ట్రాలను కోరింది. ఏప్రిల్ 14 తరువాత మరో రెండు వారాలపాటు లాక్డౌన్ కొనసాగుతుందన్న వార్తలు వస్తున్న తరుణంలో హోంశాఖ ఈ∙సమాచారం కోరడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ రంగ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలన్న సూచనలు ఎక్కువగా రాష్ట్రాల నుంచి ఉన్నాయని తెలిసింది. లాక్డౌన్ సందర్భంగా ఆన్లైన్ ప్లాట్‌ఫాంతోపాటు అత్యవసర వస్తువుల విక్రయ కేంద్రాలు తెరిచే ఉంటాయని కేంద్రం ప్రకటించింది. వీటితోపాటు ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పోలీస్, మీడియా, బ్యాంకులు పనిచేస్తాయని చెప్పింది. మాస్కు లేకపోతే పెట్రోలుకు నో! ముఖానికి మాస్కు లేనివారికి పెట్రోలు పంపుల్లో ఇంధనం నింపేది లేదని ఒడిశా రాష్ట్రం ఉత్కళ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ శుక్రవారం ప్రకటించింది. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రం లాక్‌డౌన్‌ను మే ఒకటో తేదీ వరకూ పొడిగించింది. ఒడిశా ఇప్పటికే లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30వ తేదీ వరకూ పొడిగించిన విషయం తెలిసిందే. మతపరమైన ఊరేగింపులు వద్దు ఏప్రిల్ నెలలో వివిధ పండుగల సందర్భంగా మతపరమైన ఊరేగింపులు, గుమికూడటంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జాగరూకతతో వ్యవహరించాలని హోం శాఖ శుక్రవారం హెచ్చరించింది. అభ్యంతరకరమైన సమాచారం ఏదీ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టకుండా నిఘా ఉంచాలని, లాక్డౌన్ ఆంక్షలన్నీ కచ్చితంగా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేసింది. ఈ నెలలో ఇప్పటికే కొన్ని మతపరమైన కార్యక్రమాలు పూర్తికాగా, బైశాఖీ, రోంగలి బీహూ, విషు, పోయినా బైశాఖ్, పుతాండు, మహా విశుబా సంక్రాంతి వంటి పండుగలన్నీ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వీటన్నింటిపై ప్రభుత్వ అధికారులు, మత సంస్థలు, పౌరులు అప్రమత్తంగా ఉండాలని హోం శాఖ కోరింది. లాక్డౌన్ మార్గదర్శకాల ఉల్లంఘనలపై భారతీయ శిక్షాస్మృతి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్ల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. -
ఏపీలో వైద్య సేవలు పొందే గడువు పొడిగింపు
తెలంగాణ సర్కారు ఉత్తర్వులు హైదరాబాద్: తెలంగాణలోని ఉద్యోగులు, పింఛన్‌దారులు ఏపీలోని గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలు పొందొచ్చు. నగదు రహిత చికిత్స విధానంలో కానీ వైద్య బిల్లులు తిరిగి చెల్లించే పద్ధతిలో కానీ ఏపీలో వైద్య సేవలను పొందడానికి వెసులుబాటు కల్పిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు పొడిగింపుగా మంగళవారం తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. దీనికి సంబంధించి గత మార్చి 31 వరకు వర్తించేలా అదే నెల 26న జీవో విడుదల చేయగా, ఇప్పుడు జూన్ 30 వరకు వెసులుబాటు కల్పించింది. ఈ ఆసుపత్రుల్లో నగదు రహిత, నగదు చెల్లిం చి చికిత్స చేయించుకోవచ్చు. ఆ తర్వాత సంబంధిత వైద్య బిల్లులు పొందొచ్చు.