నేషనల్ 'షాక్' ఎక్స్చేంజ్!
ముంబై: దేశీయంగా ప్రధాన స్టాక్ ఎక్సే్చంజీల్లో ఒకటైన ఎన్ఎస్ఈ బుధవారం ట్రేడర్లకు చెమట్లు పట్టించింది. సాంకేతిక సమస్య కారణంగా ఎన్ఎస్ఈలో దాదాపు రోజంతా ట్రేడింగ్ నిల్చిపోయింది. ఎఫ్‌అండ్‌వో ఎక్స్పైరీకి సరిగ్గా ముందు రోజు ఇలా జరగడంతో ట్రేడింగ్ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. టెక్నికల్ సమస్య పరిష్కారమయ్యాక చివర్లో అసాధారణంగా ట్రేడింగ్ వేళలు సాయంత్రం అయిదింటి దాకా పొడిగించడం కొంత ఊరటనిచ్చింది. టెలికం కనెక్టివిటీపరమైన అంశాలే సాంకేతిక సమస్యలకు కారణమంటూ ఎన్ఎస్ఈ పేర్కొనగా.. దీనిపై సమగ్రంగా వివరణ ఇవ్వాలంటూ ఎక్సే్చంజీని సెబీ ఆదేశించింది.
ఏం జరిగిందంటే...
నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) మరోసారి సాంకేతిక లోపాలతో కుదేలైంది. బుధవారం ఉదయం దాదాపు 10 గం.ల ప్రాంతంలో నిఫ్టీతో పాటు ఇతర ఎన్ఎస్ఈ సూచీల టికర్లు సరిగ్గా పనిచేయడం లేదంటూ డీలర్లు ఫిర్యాదు చేయడంతో సమస్య వెలుగులోకి వచ్చింది. చివరికి సాంకేతిక సమస్యల కారణంగా క్యాష్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగాల్లో ట్రేడింగ్ నిలిపివేస్తున్నట్లు 11.40 గం.లకు ఎన్ఎస్ఈ వెల్లడించింది. ఆ తర్వాత సాయంత్రం 3.30 గం.ల దాకా ట్రేడింగ్ నిల్చిపోయింది. గురువారంతో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉండటంతో ట్రేడర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అసాధారణంగా ట్రేడింగ్ వేళలను పొడిగించారు. సాధారణ ట్రేడింగ్ సమయం సాయంత్రం 3.30 గం.లకు ముగిసిపోయాక 3.45 గం.ల నుంచి ట్రేడింగ్ మళ్లీ ప్రారంభమై సాయంత్రం 5 దాకా సాగింది. దీనికనుగుణంగా బీఎస్ఈ, మెట్రోపాలిటన్ ఎక్సే్చంజీ ఆఫ్ ఇండియా ట్రేడింగ్ వేళలను కూడా సాయంత్రం 5 దాకా పొడిగించారు.
కనెక్టివిటీ సమస్యలే కారణం..
టెలికం కనెక్టివిటీపరమైన అంశాలే సాంకేతిక సమస్యకు కారణమని ఎన్ఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఎన్ఎస్ఈకి రెండు సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అనేక టెలికం లింకులు ఉన్నాయి. తమ టెలికం లింకుల్లో సమస్యలు ఉన్నాయంటూ అవి మాకు సమాచారం ఇచ్చాయి. ఇది ఎన్ఎస్ఈ సిస్టమ్‌పై ప్రతికూల ప్రభావం చూపింది‘ అని వివరించింది.
వివరణ కోసం సెబీ ఆదేశం..
ఎన్ఎస్ఈలో సాంకేతిక లోపాల వ్యవహారాన్ని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తీవ్రంగా పరిగణించింది. కనెక్టివిటీ సమస్యలు తలెత్తుతున్నప్పుడు ట్రేడింగ్‌ను డిజాస్టర్ రికవరీ సైట్‌కు ఎందుకు మళ్లించలేదని ప్రశ్నించింది. సత్వరం దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. అలాగే, ’ట్రేడింగ్ హాల్ట్’కి మూలకారణాలపై కూలంకషంగా అధ్యయనం చేయాలని సూచించింది. అనూహ్య సమస్యలు తలెత్తినప్పుడు కార్యకలాపాలపై ప్రభావం పడకుండా ప్రత్యామ్నాయంగా డిజాస్టర్ రికవరీ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఇక ఎన్ఎస్ఈ వర్గాలతో కలిసి పరిస్థితిని సమీక్షించిన ట్లు సెబీ అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిణామాలను మార్కెట్ వర్గాలకు తెలియజేయాలంటూ ఎన్ఎస్ఈకి సూచించినట్లు పేర్కొన్నారు.
ఇదే మొదటిసారి కాదు..
ఎన్ఎస్ఈ ఇలా సాంకేతిక సమస్యలు ఎదుర్కొనడం ఇదే తొలిసారి కాదు. 2020 జూన్‌లో బ్యాంక్ ఆప్షన్ సెగ్మెంట్ ధరలు ఎక్సే్చంజీలోని టెర్మినల్‌లో ప్రతిఫలించలేదు. 2019 సెప్టెంబర్‌లో.. ట్రేడింగ్ చివర్లో సిస్టమ్ పనిచేయలేదు. 2017లోనూ ఇలాంటి సమస్యే వచ్చి దాదాపు 5 గంటల పాటు ట్రేడింగ్ ఆగిపోయింది. దీంతో ప్రత్యామ్నాయ ప్రణాళికలను పటిష్టం చేసుకోవాలంటూ అప్పట్లోనే ఎన్ఎస్ఈకి సెబీ గట్టిగా ఆదేశాలు ఇచ్చింది. కానీ నాలుగేళ్లు తిరగకుండానే ఎన్ఎస్ఈ మళ్లీ అలాంటి సమస్యలోనే చిక్కుకుంది.
బీఎస్ఈలో యథావిధిగా ట్రేడింగ్..
ఎన్ఎస్ఈ డౌన్ అయినప్పటికీ బీఎస్ఈలో యథావిధిగానే పనిచేసింది. అయితే, బ్రోకర్లంతా పొలోమంటూ బీఎస్ఈకి మళ్లడంతో ట్రేడింగ్ వాల్యూమ్ .. రోజువారీ సాధారణ స్థాయికన్నా తొమ్మిది రెట్లు పైగా పెరిగింది. ట్రేడర్లు తమ పొజిషన్లను స్క్వేర్ ఆఫ్ చేసుకునేందుకు హడావుడి పడటంతో సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. కొన్ని స్టాక్స్ హఠాత్తుగా లోయర్ సర్క్యూట్లకు కూడా పడిపోయాయంటూ పలువురు ట్రేడర్లు తెలిపారు. తాము తీసుకున్న పొజిషన్ల పరిస్థితి ఏమిటన్నది తెలియక వారిలో గందరగోళం నెలకొంది.
మిగతా దేశాల్లోనూ...
ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోని ఎక్సే్చంజీల్లోనూ గతంలో ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
ఆస్ట్రేలియా సెక్యూరిటీస్ ఎక్సే్చంజ్ (2020)
ట్రేడింగ్ సిస్టమ్‌ను అప్డేట్ చేసిన తర్వాత ఒక్కసారిగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో స్థానిక సమయం ప్రకారం ఉదయం 10.24 గం.లకు ట్రేడింగ్ ఆగిపోయింది. సమస్య పరిష్కారం కాకపోవడంతో మిగతా రోజంతా కూడా నిలిపివేశారు.
టోక్యో స్టాక్ ఎక్సే్చంజ్ (2020)
మార్కెట్ వివరాలను రిలే చేసే హార్డ్‌వేర్‌లో సమస్యలు తలెత్తడంతో స్థానిక సమయం ప్రకారం ఉదయం 9 గం.లకు ట్రేడింగ్ నిల్చిపోయింది. బ్యాకప్ వ్యవస్థ కూడా విఫలం కావడంతో మిగతా రోజంతా కూడా ట్రేడింగ్ సాగలేదు.
న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్ (2018)
సాంకేతిక సమస్యల కారణంగా అమెజాన్, ఆల్ఫాబెట్ సహా అయిదు దిగ్గజ కంపెనీల షేర్లలో పూర్తి రోజంతా ట్రేడింగ్ నిలిపివేశారు.
న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్ (2015)
చాలా భారీ సాంకేతిక లోపం తలెత్తడంతో అన్ని షేర్లలో ట్రేడింగ్ నిల్చిపోయింది. దాదాపు నాలుగు గంటల పాటు ఈ పరిస్థితి కొనసాగింది. అంతర్గతంగా సాంకేతిక సమస్య ఇందుకు కారణమంటూ ఎన్వైఎస్ఈ తెలిపింది.
లండన్ స్టాక్ ఎక్సే్చంజ్ (2008)
సాంకేతిక సమస్య కారణంగా దాదాపు రోజంతా ట్రేడింగ్ నిల్చిపోయింది. మార్కెట్ ప్రారంభమైన అరగంట తర్వాత అమ్మడానికి, కొనడానికి షేర్ల ధరలు కనిపించడం లేదంటూ ట్రేడర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ట్రేడింగ్ నిలిపివేశారు. దాదాపు 7 గంటల తర్వాత ముగింపు సమయానికి అరగంట ముందు తిరిగి ప్రారంభమైంది.
మళ్లీ 52 వేల పైకి సెన్సెక్స్
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీలో నెలకొన్న సాంకేతిక అంతరాయం దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయలేకపోయింది. ఆర్థిక రంగ షేర్లు రాణించడంతో బుధవారం మార్కెట్ భారీ లాభాలను మూటగట్టుకుంటుంది. సెన్సెక్స్ 1,030 పాయింట్లు పెరిగి తిరిగి 50 వేల పైన 50,782 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 15 వేల స్థాయిని అందుకున్నప్పటికీ.., ఈ స్థాయిని నిలుపుకోవడంలో విఫలమైంది. చివరకు 274 పాయింట్లు లాభంతో 14,982 వద్ద నిలిచింది. మొదటి సెషన్లో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. సాంకేతిక అంతరాయం తొలగి మార్కెట్ తిరిగి ప్రారంభమైన తర్వాత ఒక్క ఐటీ తప్ప అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు దూసుకెళ్లాయి. నేడు (గురువారం) ఎఫ్అండ్ఓ ముగింపు నేప«థ్యంలో ట్రేడర్లు షార్ట్ కవరింగ్‌తో పాటు తమ పోజిషన్లను రోలోవర్ చేసుకోవడంతో సూచీలు ర్యాలీ చేసినట్లు నిపుణులు తెలిపారు. ప్రభుత్వ అధికారిక లావాదేవీలు, పన్నుల వసూళ్లకు సంబంధించి ప్రభుత్వ బ్యాంకులతో పాటు ఇకపై అన్ని ప్రైవేటు బ్యాంకులనూ అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి.
సంపద రూ.2.60 లక్షల కోట్లు అప్
మార్కెట్ 2% లాభంతో ఇన్వెస్టర్లు రూ.2.60 కోట్లు ఆర్జించారు. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.203 లక్షల కోట్లకు చేరింది.