వారంలో ఒక్కరోజు అంతా పాఠాలు చెప్పండి: మోడీ
భారతదేశ భావికలలన్నీ మోస్తున్న పిల్లలతో మాట్లాడే అవకాశం లభించినందుకు గర్విస్తున్నానని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. గురుపూజోత్సవం సందర్భంగా ఆయన ఢిల్లీ మానెక్షా ఆడిటోరియంలో విద్యార్థులతో ముఖాముఖిలో మాట్లాడారు. ఒక్క పశ్చిమ బెంగాల్ తప్ప మిగిలిన దేశంలోని 18 లక్షల పాఠశాలల్లో ఈ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.
''ఎప్పటికప్పుడు మారుతుండాలి. ఎలా మారాలో అందరూ ఆలోచించాలి. చాలా సమర్థులైన విద్యార్థులు ఎందుకు ఉపాధ్యాయులు కావాలనుకోవడం లేదో అంతా చూడాలి. మంచి టీచర్లకు చాలా డిమాండ్ ఉంది. భారత్ యువదేశం. మన దేశం నుంచి మంచి టీచర్లను ఎగుమతి చేయగలమన్న విశ్వాసం మనం ఇవ్వలేమా? నేను కూడా మంచి ఉపాధ్యాయుడినయ్యి.. దేశానికి సేవ చేయగలనన్న భావన విద్యార్థులలో నెలకొల్పలేమా? సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి మంచి సేవ చేశారు. ఆయన తన జయంతి చేయొద్దని, ఉపాధ్యాయ దినోత్సవం చేయాలని దేశానికి చెప్పారు. గొప్పవాళ్లందరి జీవితాలను తీర్చిదిద్దడంలో తల్లి, గురువులే ప్రధానపాత్ర పోషిస్తారు. చిన్న గ్రామంలో ఎవరికైనా మంచి గౌరవం ఉందంటే.. అది కేవలం ఉపాధ్యాయుడికే. ఇంట్లో అమ్మానాన్నలకు చెప్పుకోలేని విషయాలు కూడా ఉపాధ్యాయులకు చెప్పుకోగలం. టీచర్లంటే విద్యార్థుల పాలిట హీరోలు.
మీరు ఎంత పెద్ద స్థానంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా కూడా.. వారంలో ఒక్క రోజు.. ఒక్క గంట పాటు వెళ్లి ఏదో ఒక పాఠశాలలో పాఠాలు బోధించండి. అన్ని రకాల శక్తులు కలిసి విద్యార్థులకు తమ విజ్ఞనాన్ని అందిస్తే మంచిది. మంచి లక్ష్యాలు ఉంటే.. పరిస్థితులు ఏ ఒక్కరినీ ఆపలేవు. భారతదేశంలో పిల్లలకు కావల్సినంత సామర్థ్యం ఉంది. మీలో ఎంతమందికి ప్రతిరోజూ చెమట పడుతుంది? ఒక్కళ్లకు కూడా లేదు కదూ.. ఆటపాటలు లేకపోతే జీవితం అసంపూర్ణమే. ఈ వయసులో కనీసం రోజుకు నాలుగైదు సార్లు ఒంటినిండా చెమట పట్టాలి. అస్తమాను పుస్తకాలు చదవడం, టీవీలు, కంప్యూటర్లు చూడటం.. ఇదే జీవితం కాదు.. దీనికంటే చాలా ఉంది. తరగతి పుస్తకాలు కాకుండా ఇతర పుస్తకాలు చదివేవాళ్లు ఎంతమంది ఉన్నారు? జీవిత చరిత్రలు ఎంతమంది చదువుతారు... ఇది చాలా తక్కువే. ఇప్పుడు పనులన్నీ గూగుల్ గురువే చేస్తారు. ఏ సమస్య ఉన్నా గూగుల్ గురువే చెబుతుంది. అది సరికాదు. గురుముఖతః నేర్చుకుంటే మంచిది'' అని ఆయన చెప్పారు.