మొటిమలకు చెక్..
బ్యూటిప్స్
ముఖంపై ఏ భాగంలో ఈ మొటిమలు ఎందుకు వస్తాయో తెలిస్తే వాటి నుంచి ఎవరైనా సత్వర ఉపశమనం పొందొచ్చు.. అదెలా అనుకుంటున్నారా..? అయితే ఇలా తెలుసుకోండి.
నుదురు మీద: టీనేజ్ వారి నుంచి వయసు పైమళ్లిన వారి వరకు చాలామందికి నుదుటి మీద మొటిమలు వస్తుంటాయి. వీటికి ముఖ్య కారణాలు అజీర్తి, డీహైడ్రేషన్. దాని కోసం రోజుకు వీలైనన్ని ఎక్కువ గ్లాసుల నీరు తీసుకుంటే సరి. అజీర్తి చేయకుండా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు టైమ్‌కు తినేయాలి.
టీ జోన్: టీనేజర్లకు ఎక్కువ మొటిమలు అయ్యేది ఈ టీ జోన్లోనే. అంటే ముక్కు, నుదురు భాగాల్లో. ఇక్కడ మొటిమలు అవుతున్నాయంటే కారణం కాలేయ సంబంధిత సమస్య ఉందని అర్థం. అందుకు కొవ్వు పదార్థాలు, జిగురు పదార్థాలు ఆహారంలో లేకుండా చూసుకోవాలి.
బుగ్గలపై: ఎంతో అందంగా ఉండే బుగ్గలపై మొటిమలు వస్తుంటాయి. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన అంశం. పొగ తాగటం, కాలుష్యపూరిత వాతావరణంలో తిరగడం మూలాన బుగ్గలపై మురికి ఏర్పడి అవి మొటిమలు ఏర్పడటానికి కారణమవుతుంది. అలాగే ఈ మధ్య స్మార్ట్ఫోన్లతో ఎక్కువగా మాట్లాడటం వల్ల వాటిపై ఉండే దుమ్ము, ధూళి ముఖ చర్మానికి తగిలి మొటిమలు అవుతున్నాయి ఎంతోమందికి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే బయటికి వెళ్లినప్పుడు ముఖానికి ప్రొటెక్టివ్ లోషన్ రాసుకోవడం, ఫోన్‌ను యాంటీ బ్యాక్టీరియల్ లోషన్‌తో రోజూ తుడవడం చేయాలి. పిల్లో కవర్లను తరచూ శుభ్రం చేసుకోవడం కూడా ముఖ్యం.
నోటి చుట్టూ: దంత సమస్యలున్నవారికి ఈ ప్రాంతాల్లో ప్రభావం చూపుతుంది. దాని కోసం షుగరీ ఫుడ్స్, సోడా లాంటివి తీసుకోవడం మానేయాలి. అలాగే రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకుంటూ కాఫీ, టీలు తాగడం తగ్గించాలి.
చెవి భాగం: ఇక్కడ మొటిమలు అవుతున్నాయంటే శరీరం డీహైడ్రేట్ అవడంతో పాటు కిడ్నీ పనితీరులో సమస్య ఉందని అర్థం. అంతే కాకుండా ఆహారంలో ఉప్పుశాతాన్ని ఎక్కువ తీసుకున్నా ఈ ఇబ్బంది వస్తుంది. దాని కోసం వీలైనన్ని గ్లాసుల నీళ్లు తాగాలి. అలాగే తలస్నానం చేసేప్పుడు కండీషనర్‌ను, నూనెను సరిగ్గా శుభ్రం చేసుకోకపోయినా చెవి భాగం దగ్గర మొటిమలు వస్తాయి.
చుబుకం(చిన్) కింది భాగం: ఈ ప్రాంతంలో మొటిమలు అవుతున్నాయంటే చిన్న ప్రేగులో ఏదో సమస్య తలెత్తిందని గుర్తించాలి. అలాగే హార్మోన్ల అస్థిరత కారణంగా కూడా మొటిమలు వస్తుంటాయి. అంతేకాకుండా బోర్ కొట్టినప్పుడు, ఏదో ఆలోచిస్తున్నప్పుడు, అలసిపోయినప్పుడు చాలా మంది చుబుకం కింద చేతులు పెట్టుకొని కూర్చుంటారు. అలా చేయడం వల్ల చేతి వేళ్లలో ఉండే ఆయిల్ చిన్భాగంలోకి వెళ్లి మొటిమలు తయారవుతాయి.