నగరంపై ఉగ్రవాదుల నజర్
⇒గుజరాతీయులే లక్ష్యంగా దాడులకు పథకం
⇒ట్విటర్లో బయటపడిన వాస్తవం
⇒భద్రతను కట్టుదిట్టం చేసిన ప్రభుత్వం
సాక్షి, ముంబై: ఇటీవల పాకిస్థాన్‌లో మారణకాండ సృష్టించిన ఐసిస్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ ముంబైలోని పాఠశాలలపై కన్నేసినట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థ ముఖ్యంగా నగరంలోని గుజరాత్ పాఠశాలలను లక్ష్యంగా చేసుకునే అవకాశాలున్నాయని ట్విటర్ ద్వారా బయట పడింది.
ఇటీవల పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఆర్మీ స్కూల్‌పై దాడిచేసి సుమారు 145 మంది విద్యార్థులను పొట్టనపెట్టుకున్నారు. ఇదే తరహాలో ముంబైలోని పాఠశాలపై దాడులు చేయనున్నట్లు అందులో స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రెండు నెలల కిందట కల్యాణ్‌కు చెందిన నలుగురు ముస్లిం యువకులు హజ్ యాత్రకు వెళ్లి అక్కడ ఉగ్రవాదులతో కలిసినట్లు వార్తలు వచ్చాయి. అందులో అరీబ్ మాజిద్ తిరిగి భారత్‌కు వచ్చాడు. మిగతావారు ఐసీస్‌లో చేరారు. ఆ ముగ్గురిలో ఒకడైన ఫహద్ శేఖ్ ఈ విషయాన్ని ట్వీట్ చేసినట్లు కేంద్ర గూఢచార సంస్థ తెలిపింది. దీంతో పోలీసులు ముంబైలోని గుజరాత్‌తోపాటు ఇతర పాఠశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్వీట్లో పొందుపర్చిన వివరాలిలా ఉన్నాయి...
‘2008 నవంబర్ 26న నగరంలో అక్కడక్కడ దాడులు చేయడానికి కారణం గుజరాతీయులను హతమార్చడమే ప్రధాన లక్ష్యం. దశకంన్నర కిందట గుజరాత్లో మతఘర్షణలు సృష్టించి ముస్లింలపై దాడులు చేయడానికి ముంబై నుంచి గుజరాతీలు డబ్బులు పంపించారు. ఈ ఘటనలో అనేక మంది అమాయక ముస్లింలు మరణించారు. దానికి ప్రతీకారంగానే ముంబైలోని గుజరాతీయులను లక్ష్యంగా చేసుకుంటు’న్నట్లు ట్వీట్లో స్పష్టం చేశాడు.
ఐసీస్ బెదిరింపులను సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు ములుండ్, ఘాట్కోపర్, విలేపార్లే, కాందివలి, బోరివలి, దహిసర్ తదితర గుజరాతీలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాల్లో హై అలర్ట్ జారీచేశారు. ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్), క్విక్ రెస్పాన్స్ టీంలను అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు శాఖ హెచ్చరించింది.