Fake books
-
నకిలీ పుస్తకాలతో రిజిస్ట్రేషన్లు
విజయనగరం కంటోన్మెంట్: భూముల విలువ పెరిగిన తరువాత జిల్లాలో భూ తగాదాలు ఎక్కువవుతున్నాయి. నిత్యం సాగు చేసుకుంటున్న తమ భూములను కొందరు అక్రమార్కులు నకిలీ పత్రాలతో రెండు సార్లు క్రయ విక్రయాలు చేశారనీ ఇప్పుడు వాటిని వదిలేయాలని బెదిరిస్తున్నారని కలెక్టరేట్లో బాధితులు ఫిర్యాదు చేశారు. గరివిడి మండలం కాపు శంభాం గ్రామానికి చెందిన ఏనూ తల అప్పమ్మ అనే వృద్ధురాలి పేరున ఉన్న భూమిని పలువురు ఆక్రమణ దారులు బోగస్ పాస్ పుస్తకాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఈ అన్యాయంపై కోర్టుకు వెళ్లినా పోలీసులు తమ ఇంటికి వచ్చి తాము అన్యాయం చేసినట్టు జీపెక్కించి స్టేషన్‌కు తీసుకెళుతూ తమను మానసికంగా హింసిస్తున్నారని డైలీ గ్రీవెన్స్ సెల్లో బాధితులు ఫిర్యాదు చేశారు. తాత తండ్రుల నుంచి అనుభవిస్తున్న సర్వే నంబర్ 6-9లోని 2ఎకరాలు, 6-16లోని 52 సెంట్ల భూమిని చందక రమణ, లెంక సుశీల అనే ఇద్దరు వ్యక్తులు దాసరి అప్పయ్య అనే వ్యక్తి పేరుతో బినామీ రిజిస్ట్రేషన్లు చేయించారన్నారు. వారిద్దరూ గొట్టిముక్కల వెంకట రమణమూర్తి రాజు, జనపాల ప్రసాద్ బాబు తదితరులకు విక్రయించారన్నారు. ఈ విషయం తెలిసి తాము ఏడీఎం కోర్టులో కేసు వే యగా ప్రస్తుతం విచారణ సాగుతోందన్నారు. దావా నడుస్తున్నప్పటికీ ఉపసంహరించుకోవాల్సిందిగా బెదిరిస్తున్నారని బాధితురాలు ఏనూతల అప్పమ్మ, కుమారుడు అప్పలనాయుడులు వాపోయారు. కేసు వెనక్కి తీసుకోకపోతే తమను చంపేస్తామని హెచ్చరిస్తున్నారని వాపోయారు. కోర్టు కేసు ఉండగా మళ్లీ మమ్మల్ని అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారని తమకు న్యాయం చేయాలని డైలీ గ్రీవెన్స్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. -
‘నకిలీ’ మాట వినపడకూడదు
కలెక్టర్ కోన శశిధర్ హెచ్చరిక అనంతపురం సెంట్రల్ : జిల్లాలో ఎక్కడైనా అనుమతి లేకుండా పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేసినా, రుణాలు ఇచ్చినా కఠిన చర్యలు ఉంటాయని, నకిలీ పుస్తకాల మాట జిల్లాలో వినపడకూడదని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ హెచ్చరించారు. మంగళవారం డ్వామా హాల్లో జిల్లా సలహా మండలి సమావేశం(డీసీసీ) నిర్వహించారు. ఈ సందర్భం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి లేకుండా కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసినట్లు సమాచారం వస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కొంతమంది పాత్రికేయులు తన దృష్టికి తెస్తున్నా ఖచ్చితమైన వివరాలు ఇవ్వడం లేదన్నారు. పక్కా సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేశామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రెవెన్యూ రికార్డుల నవీకరణ చేశామన్నారు. దీన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వం మీ ఇంటికి - మీ భూమి కార్యక్రమాన్ని రూపొందించినట్లు వివరించారు. ఇప్పటి వరకూ 24 వేల రికార్డులను సరిదిద్దినట్లు తెలిపారు. 7529 నకిలీ పాసు పుస్తకాలను గుర్తించి రూ.7.64 కోట్లు ప్రభుత్వానికి మిగిలించినట్లు వివరించారు. నకిలీ పాసు పుస్తకాల విచారణలో బాగంగా 23 అంశాలతో కూడిన నివేదికను బ్యాంకర్లకు పంపామని, అయితే తిరిగి అందజేయడంలో బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. భవిష్యత్‌లో నకిలీ పుస్తకాలను అరికట్టేందుకు ప్రస్తుతమున్న పట్టాదారు పాసుపుస్తకాల స్థానంలో ఈ-పాసు పుస్తకాలను మంజూరు చేస్తున్నట్లు వివరించారు. రూ.135ను బ్యాంకర్లే భరించి రైతులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అర్హులైన లబ్ధిదారులకు జాప్యం లేకుండా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పెట్టుబడి నిధితో ఆదాయాన్ని ఉత్పన్నం చేసే కార్యక్రమాలు చేయించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే మహిళలకు రూడ్సెట్ ద్వారా శిక్షణ కల్పించాలని సూచించారు. మహిళా సంఘాల పురోభివృద్ధిలో జిల్లాను 11వ స్థానం నుంచి 1వ స్థానానికి తీసుకువచ్చేందుకు కృషి చేసిన ఇన్చార్జ్ పీడీ వెంకటేశ్వర్లును అభినందించారు. వ్యవసాయశాఖ జేడీ శ్రీరామమూర్తి, పట్టుపరిశ్రమశాఖ జేడీ అరుణకుమారి, ఎల్డీఎం జయశంకర్; సిండికేట్ బ్యాంకు డీజీఎం ఆశీర్వాదం, ఏజీఎం జగదీష్, నాబార్డు ఏజీఎం రవీంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
రైతులకు డిజిటల్ పాస్ పుస్తకాలు
మీ సేవ కేంద్రాల ద్వారా జారీ దరఖాస్తు చేసిన 45 రోజుల్లో మంజూరు మాన్యువల్ పుస్తకాల జారీ తాత్కాలికంగా నిలిపివేత నక్కపల్లి : రైతులకు మాన్యువల్ విధానంలో పట్టాదార్ పాస్ పుస్తకాలను జారీ చేసే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇకనుంచి మీ సేవ కేంద్రాల ద్వారా డిజిటల్ పాస్ పుస్తకాలను జారీ చేయాలని నిర్ణయించింది.పోస్టులో వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు జారీ చేస్తున్న మాన్యువల్ పాస్ పుస్తకాల జారీని తాత్కాలికంగా నిలిపి వేసినట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి. ఇకనుంచి రైతులకు జారీ చేసే నమూనా డిజిటల్ పాస్ పుస్తకాలను ఆయా మండల కేంద్రాలకు పంపించింది. అక్రమాల నిరోధానికే... రైతులకు ఇంతవరకు ప్రభుత్వం మాన్యువల్ విధానంలో తహశీల్దార్ సంతకంతో పట్టాదారు పాసుపుస్తకం, ఆర్డీవో సంతకంతో టైటిల్డీడ్లను జారీ చేసేవారు. ఈ విధానంలో నకిలీ పుస్తకాలు తయారు చేయడం, అక్రమాలు జరగడం, రెవెన్యూ సిబ్బంది మామూళ్లకు కక్కుర్తిపడి ఇష్టానుసారం నమోదు చేయడం, ఫొటోలు మార్చేయడం, కొట్టివేతలు, దిద్దుబాట్లు, సంతకాల ఫోర్జరీ లాంటివి జరిగేవి. పాస్ పుస్తకాల కోసం రెవెన్యూ సిబ్బంది వేలాది రూపాయలు గుంజుతున్నారని, మంజూరులో నెలల తరబడి జాప్యం జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే డిజిటల్ పాస్ పుస్తకాలను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాస్ పుస్తకాలు కావలసిన రైతులు వీఆర్వోల చుట్టూ, తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 45 రోజుల్లో జారీ పాస్ పుస్తకం కోరే ఆస్తి రిజిస్టర్డ్ పత్రాలు, ఫొటోలు మీసేవ కేంద్రాల నిర్వాహకులకు సమర్పించాలి. రైతులు సమర్పించిన ధ్రువపత్రాలను మీసేవ కేంద్రం నిర్వాహకులు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. వాటిని తహశీల్దార్ కార్యాలయంలో డౌన్లోడ్ చేసుకుని చెక్‌లిస్టు పరిశీలించి రైతు సమర్పించిన ధ్రువపత్రాలన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అనేది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. పాస్‌పుస్తకం జారీకి ఎలాంటి అభ్యంతరం లేకపోతే పాస్ పుస్తకం జారీ చేస్తున్నట్లు తహశీల్దార్ డిజిటల్ సిగ్నేచర్ చేసి తిరిగి అప్లోడ్ చేస్తారు. దీన్ని మీసేవ కేంద్రం నిర్వాహకులు పరిశీలించి డిజిటల్ పాస్ పుస్తకం తయారుచేసి పోస్టుద్వారా రైతులకు పంపిణీ చేస్తారు. టైటిల్డీడ్లది కూడా ఇదే పరిస్థితి. ప్రస్తుతం కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాల కోసం ఇదే విధానం కొనసాగుతోంది. పాస్ పుస్తకంలో రైతుల భూముల తాలూకు సర్వే నం బర్లు విస్తీర్ణం, మార్కెట్ విలువ, రైతుల డిజిటల్ ఫొటో, రైతు, తహశీల్దార్, ఆర్డీవో ల డిజిటల్ సంతకాలు నమోదై ఉంటాయి. దరఖాస్తు చేసుకున్న 45 రోజుల్లో జారీ చేస్తామని తహశీల్దార్ జగన్నాథరావు తెలిపారు. మార్పులు, చేర్పులు, క్రయవిక్రయాల లావాదేవీలు కూడా ఇకనుంచి మీసేవ కేంద్రాల ద్వారానే జరగాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిపారు. గురువారం మండల కార్యాలయానికి వచ్చిన నమూనా డిజిటల్ పాస్ పుస్తకాలను ఆయన చూపించారు. -
నకిలీ పుస్తకాలు ముద్రిస్తున్న ముఠా గుట్టురట్టు
ఇద్దరి అరెస్టు: రూ.30 లక్షల విలువైన సొత్తు స్వాధీనం కీలక నిందితుల కోసం ముంబైకి ప్రత్యేక బృందం సాక్షి, సిటీబ్యూరో: కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించి అంత ర్జాతీయ పుస్తకాలను ముద్రించి నగరం కేంద్రంగా దేశంలోని అన్ని పట్టణాలకు సరఫరా చేస్తున్న ఓ ముఠా గుట్టును నగర సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రూ.30 లక్షల విలువైన 6,500 పుస్తకాలతో పాటు ప్రింటింగ్ ప్రెస్‌ను సీజ్ చేశారు. సీసీఎస్ డీసీపీ జి.పాలరాజు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం... యూసుఫ్‌గూడకు చెందిన పుస్తకాల వ్యాపారి సయ్యద్ జకీర్ అలీ (42) అంతర్జాతీయ స్థాయిలో ఆయా పబ్లిషర్స్ ముద్రించిన పుస్తకాలను ఒకటి మాత్రమే ఖరీదు చేసేవాడు. ఈ బుక్‌ను కాపీ చేసి నల్లకుంటలోని సంపత్‌రెడ్డి ప్రింటింగ్ ప్రెస్‌లో వేలాది నకిలీ బుక్స్ ముద్రిస్తున్నాడు. అలా ముద్రించిన బుక్స్‌ను ముంబై తరలిస్తున్నాడు. అక్కడి నుంచి దేశంలోని వివిధ పట్టణాలకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ విషయం పసిగట్టిన కొన్ని పబ్లిషర్స్ సీసీఎస్ పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. విచారణ చేపట్టిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఆర్. సత్యనారాయణరాజు జకీర్‌ను అదుపులోకి తీసుకుని వి చారించగా అధిక మొత్తంలో డబ్బు వస్తుందనే ఆశతో కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించానని నిందితుడు అంగీకరించాడు. దీంతో జకీర్‌తో పాటు ప్రింటింగ్‌ప్రెస్ యజమాని సంపత్‌రెడ్డిని అరెస్టు చేశారు. వారి నుంచి 6.500 బుక్స్‌ను స్వాధీనం చేసుకోవడమే కాకుండా ప్రింటింగ్‌ప్రెస్‌ను సీజ్ చేశారు. ముంబైలోని గౌడాన్‌లో మరిన్ని బుక్స్ ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి ప్రత్యేక బృందాన్ని పంపించారు. ఈ కేసులో మరికొంత మంది కీలక వ్యక్తులను అరెస్టు చేసే అవకాశాలున్నాయి. విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఏసీపీ జి.సుప్రజ, ఇన్స్పెక్టర్ చక్రపాణి పాల్గొన్నారు.