‘నకిలీ’ మాట వినపడకూడదు
కలెక్టర్ కోన శశిధర్ హెచ్చరిక
అనంతపురం సెంట్రల్ : జిల్లాలో ఎక్కడైనా అనుమతి లేకుండా పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేసినా, రుణాలు ఇచ్చినా కఠిన చర్యలు ఉంటాయని, నకిలీ పుస్తకాల మాట జిల్లాలో వినపడకూడదని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ హెచ్చరించారు. మంగళవారం డ్వామా హాల్లో జిల్లా సలహా మండలి సమావేశం(డీసీసీ) నిర్వహించారు. ఈ సందర్భం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి లేకుండా కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసినట్లు సమాచారం వస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు.
కొంతమంది పాత్రికేయులు తన దృష్టికి తెస్తున్నా ఖచ్చితమైన వివరాలు ఇవ్వడం లేదన్నారు. పక్కా సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేశామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రెవెన్యూ రికార్డుల నవీకరణ చేశామన్నారు. దీన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వం మీ ఇంటికి - మీ భూమి కార్యక్రమాన్ని రూపొందించినట్లు వివరించారు.
ఇప్పటి వరకూ 24 వేల రికార్డులను సరిదిద్దినట్లు తెలిపారు. 7529 నకిలీ పాసు పుస్తకాలను గుర్తించి రూ.7.64 కోట్లు ప్రభుత్వానికి మిగిలించినట్లు వివరించారు. నకిలీ పాసు పుస్తకాల విచారణలో బాగంగా 23 అంశాలతో కూడిన నివేదికను బ్యాంకర్లకు పంపామని, అయితే తిరిగి అందజేయడంలో బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. భవిష్యత్‌లో నకిలీ పుస్తకాలను అరికట్టేందుకు ప్రస్తుతమున్న పట్టాదారు పాసుపుస్తకాల స్థానంలో ఈ-పాసు పుస్తకాలను మంజూరు చేస్తున్నట్లు వివరించారు. రూ.135ను బ్యాంకర్లే భరించి రైతులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అర్హులైన లబ్ధిదారులకు జాప్యం లేకుండా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు.
స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పెట్టుబడి నిధితో ఆదాయాన్ని ఉత్పన్నం చేసే కార్యక్రమాలు చేయించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే మహిళలకు రూడ్‌సెట్ ద్వారా శిక్షణ కల్పించాలని సూచించారు. మహిళా సంఘాల పురోభివృద్ధిలో జిల్లాను 11వ స్థానం నుంచి 1వ స్థానానికి తీసుకువచ్చేందుకు కృషి చేసిన ఇన్‌చార్జ్ పీడీ వెంకటేశ్వర్లును అభినందించారు. వ్యవసాయశాఖ జేడీ శ్రీరామమూర్తి, పట్టుపరిశ్రమశాఖ జేడీ అరుణకుమారి, ఎల్‌డీఎం జయశంకర్; సిండికేట్ బ్యాంకు డీజీఎం ఆశీర్వాదం, ఏజీఎం జగదీష్, నాబార్డు ఏజీఎం రవీంద్రప్రసాద్ పాల్గొన్నారు.