fake death
-
రెండు సార్లు ‘మరణం’!! రూ.1.1 కోట్ల కోసం మహిళ మోసం
ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు తమ కుటుంబానికి ఆదరవుగా ఉంటుందని బీమా చేయిస్తుంటారు. కానీ బీమా సొమ్ము కోసమే చనిపోయినట్లు అదికూడా రెండు సార్లు మరణించినట్లు మోసగించిన ఉదంతం ముంబైలో బయటపడింది.ముంబై ప్రాంతంలోని భయాందర్‌కు చెందిన 45 ఏళ్ల మహిళ కంచన్ పాయ్ అలియాస్ పవిత్ర రూ.1.1 కోట్ల ఇన్సూరెన్స్ రెండేళ్లలో రెండుసార్లు తన మరణాన్ని ఫేక్ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే రూ.70 లక్షలను నిందితురాలి కుటుంబం అందుకుంది.కంచన్ పాయ్ భర్త, కుమారుడు 2021-2023 మధ్య ఐదు ప్రైవేట్ రంగ బీమా కంపెనీల నుంచి రూ .1.1 కోట్లు క్లెయిమ్ చేశారు. వారికి ఇప్పటికే డెత్ క్లెయిమ్ రూపంలో దాదాపు రూ.70 లక్షలు వచ్చాయి. మిగిలిన మొత్తం కోసం ఎదురు చూస్తుండగా మోసం బయటపడింది. ముగ్గురూ పరారీలో ఉన్నారు.అశుతోష్ యాదవ్ అనే వైద్యుడి సాయంతో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు, దహన సంస్కారాల రశీదులు పొంది ఈ మోసానికి పాల్పడ్డారు. ఈ డాక్టర్ కూడా పరారీలో ఉన్నాడు. కంచన్ అలియాస్ పవిత్ర రెండు వేర్వేరు ఆధార్ కార్డు, పాన్ కార్డులను ఉపయోగించి మొత్తం ఐదు ప్రైవేటు సంస్థల నుంచి బీమా పాలసీలు తీసుకున్నట్లు విచారణలో తేలింది. -
చనిపోయినట్లు ప్రాంక్.. హెలికాప్టర్లో ఎంట్రీ ఇచ్చి షాకిచ్చాడు
-
చనిపోయినట్లు ప్రాంక్.. హెలికాప్టర్లో ఎంట్రీ ఇచ్చి షాకిచ్చాడు
వర్చువల్ మాయాలోకంలో మనుషుల మధ్య అనుబంధాలు కరువైపోతున్నాయి. ఆప్యాయత, అనురాగాలను ఆన్లైన్లోనే చూపిస్తున్నారు. పైకి సంతోషంగా కనిపిస్తున్నా లోలోపల ఒంటరితనంతో బాధపడుతున్నారు. బెల్జియన్‌కు చెందిన డేవిడ్ బేర్టెన్ అనే వ్యక్తి బంధువులు తనను తక్కువ చేసి చూస్తున్నారని, వారికి బుద్ధి చెప్పేందుకు ఓ పథకం వేశాడు. తాను మరణించినట్లు కట్టుకథ అల్లాడు. తీరా కుటుంబసభ్యులు, బంధువులంతా అంత్యక్రియలకు తరలిరాగా సినిమా స్టైల్లో హెలికాప్టర్ నుంచి దిగా అందిరికి షాక్ ఇచ్చాడు.ఇంతకీ డేవిడ్ డెత్ ప్రాంక్ ఎందుకు చేశాడు? ఆ తర్వాత ఏమైంది? వివరాల్లోకి వెళ్తే.. బెల్జియన్‌కు చెందిన డేవిడ్ బేర్టెన్ తన కుటుంబ సభ్యులు తనని లోకువగా చూస్తున్నారని తెగ ఫీలైపోయేవాడు. సొంత బంధువులే తనను పట్టించుకోవడం లేదని బాగా హర్ట్ అయ్యాడు. సొంతవారే తనను చిన్నచూపు చూడడంతో వారికి బుద్దిచెప్పేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు.ఒక మనిషి లేకపోతే ఆ బాధ ఎంతగా ఉంటుందో, వారి విలువ ఏంటన్నది తెలియజేయాలని తాను మరణించినట్లు కట్టుకథ అల్లాడు. బతికుండగానే తన అంత్యక్రియలను దగ్గరుండి ఏర్పాడు చేశాడు. టిక్‌టాక్‌లో బాగా పాపులర్ అయిన డేవిడ్ బేర్టెన్(రాగ్నార్ లే ఫౌ) డెత్ ప్రాంక్ చేయడానికి ఆయన కూతుళ్లు కూడా సహాయం చేయడం మరో విశేషం. వాళ్లు ఎంతలా యాక్టింగ్ చేశారంటే.. తండ్రి నిజంగానే చనిపోయినట్లు వాట్సాప్ సందేశాల్లో పోస్ట్ చేశారు. రెస్ట్ ఇన్ పీస్ డాడ్, మీరు ఎప్పటికీ మా ఙ్ఞాపకాల్లో బతికే ఉంటారు అని ఓ కూతురు సోషల్ మీడియాలో షేర్ చేయగా, త్వరలోనే మీరు తాత కాబోతున్నారు. మీరు మాతో ఉండాల్సింది డాడీ..దేవుడు ఇంత అన్యాయం ఎందుకు చేశారు? మీరే ఎందుకు చనిపోవాలి? మిస్ యూ సో మచ్ అంటూ మరో కూతురు ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆన్లైన్లో ఈ పోస్ట్ చూసి అయ్యో పాపం అనుకున్నారంతా. డేవిడ్ లేడనే వార్తతో శోకసంద్రంలో మునిగితేలారు. వారందరూ డేవిడ్‌ను తలుచుకుంటూ వెక్కివెక్కి ఏడుస్తున్నారు. అంత్యక్రియలు మరికాసేపట్లో జరుగుతాయనగా అక్కడికి ఓ హెలికాప్టర్ వచ్చింది. అది ల్యాండ్ కాగానే దాని నుంచి డేవిడ్ కిందకు దిగాడు. అంతే ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. తర్వాత డేవిడ్ "నా అంత్యక్రియలకు వచ్చిన మీకందరికీ స్వాగతం" అంటూ నవ్వుతూ పలకరిస్తున్నాడు. ఒక్కక్షణం అక్కడేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాక ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తర్వాత తేరుకొని బంధువులు అతన్ని చుట్టుముట్టి హగ్ చేసుకుని ఏడ్చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ను షూట్ చేసిన ఓ బృందం దీన్ని నెట్టింట షేర్ చేయగా క్షణాల్లో వీడియో వైరల్‌గా మారింది. బతికుండానే అంత్యక్రియలకు ఎందుకు ప్లాన్ చేశారని ఆయన్ను అడగ్గా.. కుటుంబసభ్యులంతా ఎప్పుడో విడిపోయామని, తనని దేనికీ ఆహ్వానించరని, ఎవరూ చూడటానికి కూడా రారు అని అందుకే ఇలా డెత్ ప్రాంక్ చేసినట్లు డేవిడ్ చెప్పుకొచ్చాడు. వారికి గుణపాఠం నేర్పించాలని, మనుషుల మధ్య బంధాలు ఉండాలని, వారిని కలవాలంటే చనిపోయేవరకు వేచి ఉండకూడదని చూపించాలని ఇలా చేశానని తెలిపాడు. ఇప్పుడు కుటుంబం అందరం కలిపోయామని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. -
బీమా డబ్బుల కోసం డ్రామా
మెదక్‌జోన్: కారుతోసహా వ్యక్తి సజీవదహనమైన కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. చనిపోయాడనుకున్న వ్యక్తి బతికే ఉన్నట్లు తేలింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నాటకం ఆడి అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన వివరాలు.. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బీమ్లా తండాకు చెందిన ధర్మానాయక్ సెక్రెటేరియేట్‌లోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల 5న స్వగ్రామానికి వచ్చా డు. 6న మిత్రులతో కలిసి బాసరకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. 7న రాత్రి ఇంటికొస్తున్నానని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. 8వ తేదీ రాత్రి వెంకటాపూర్ గ్రామ శివారులో ధర్మా కారుతో సహా కాలిపోయాడనే సమాచారం అందింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పక్కనే ఖాళీ పెట్రోల్ బాటిల్ గుర్తించారు. దీంతో ధర్మా ప్రమాదంలో చనిపోయాడా? ఎవరైనా హత్య చేశారా.. అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మెస్సేజ్ ఆధారంగా గుర్తింపు.. విచారణ ప్రారంభించిన పోలీసులు ధర్మా భార్య నీల ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ధర్మా పుణెకు వెళ్లి తన భార్య ఫోన్‌కు తన డెత్ సర్టి ఫికెట్ తీసి ఇన్సూరెన్స్ డబ్బులకు దరఖాస్తు చేయాలని మెస్సేజ్ పంపాడు. దీని ఆధారంగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు పుణెలో ధర్మాను అరెస్ట్‌చేశారు. భార్యభర్తలిద్దరూ కలిసే ఈ స్కెచ్ వేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ నెల 4న ధర్మా హైదరాబాద్‌లోని అడ్డాపై ఉన్న బిహార్‌కు చెందిన ఓ వ్యక్తిని కారు డ్రైవర్‌గా పనిలో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. తెలిసిన వ్యక్తిని కారు డ్రైవర్‌గా పెట్టుకుంటే చంపడం కుదరదనుకుని ఇలా ప్లాన్ చేశాడు. ధర్మా 8వ తేదీన డ్రైవర్‌కు ఫుల్‌గా మద్యం తాగించిన తర్వాత గొడ్డలితో నరికిచంపి, ఆపై కారులో మృతదేహాన్ని ఉంచి పెట్రోల్ పోసి తగులబెట్టినట్టు అనుమానిస్తున్నారు. దీనిపై ధర్మాను పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నట్టు తెలిసింది. బెట్టింగ్‌లు ఆడి... ధర్మా కొంతకాలంగా ఆన్లైన్ గేమ్స్‌తోపాటు బెట్టింగ్‌లు ఆడి సుమారు రూ.2 కోట్ల వరకు పోగొట్టుకున్నట్లు తెలిసింది. దీంతో తెచ్చిన అప్పులను తీర్చే మార్గం కానరాక భారీ స్కెచ్ వేశాడు. తన పేరుపై ఉన్న 4 ఎల్ఐసీ పాలసీల క్లెయిమ్ విలువ రూ.7 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రమాదంలో చనిపోయింది ధర్మానే అనేవిధంగా నమ్మించి బీమా డబ్బులు పొందాలని చూశాడు. కాగా, ధర్మానాయక్ తమ అదుపులోనే ఉన్నాడని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని చెప్పారు. కారు దహన ఘటనపై విచారిస్తున్నామని, బుధవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
నకిలీ కోవిడ్ డెత్ సర్టిఫికెట్లపై సుప్రీం ఆందోళన
న్యూఢిల్లీ: దేశంలో కొందరు డాక్టర్లు నకిలీ కోవిడ్–19 డెత్ సర్టిఫికెట్లు జారీ చేస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా కారణంగా మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న నష్ట పరిహారాన్ని కాజేయడానికి నకిలీ డెత్ సర్టిఫికెట్లు పుట్టుకొస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన ధర్మాసనం పేర్కొంది. నష్టపరిహారం కోరుతూ వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి నిర్ధిష్ట కాల వ్యవధి ఉండాలని సూచించింది. ఏకంగా డాక్టర్లే నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు ఇస్తుండడం తీవ్రమైన విషయమని ధర్మాసనం తెలిపింది. దీనివల్ల అసలైన బాధితులకు అన్యాయం జరుగుతుందని వెల్లడించింది. గౌరవ్ బన్సల్‌తోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. -
ఈ రియల్ క్రైమ్ స్టోరీతో.. ఎన్నో సినిమాలు
త్రివేండ్రం: సినిమా కథను మించిన రియల్ క్రైమ్ స్టోరీ కేరళలో జరిగింది. జీవిత బీమాను క్లయిమ్ చేసుకోవాలని పథకం వేసిన సుకుమార కురుప్ అనే వ్యక్తి.. తనలాగే ఉన్న ఓ వ్యక్తిని చంపేసి, తాను చనిపోయినట్టుగా సమాజాన్ని, అధికారులను నమ్మించాలని చూశాడు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో అజ్ఞాతంలోకి వెళ్లాడు. 1984లో ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి పోలీసులు కురుప్ కోసం గాలిస్తూనే ఉన్నారు.. కానీ 33 ఏళ్లు గడిచినా అతని ఆచూకీ కనుగొనలేకపోయారు. కోర్టు కురుప్పై అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తూనే ఉంది కానీ నేటికీ మిస్టరీ వీడలేదు. కేరళ న్యాయచరిత్రలో సుధీర్ఘకాలం నడుస్తున్న కేసు ఇదే. ఈ కథ ఆధారంగా ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. 1984 నాటికి కురుప్ వయసు 38 ఏళ్లు. అప్పట్లో అబుదాబిలో పనిచేసేవాడు. 8 లక్షల రూపాయలకు బీమా చేయించాడు. జర్మనీలో జరిగిన ఓ ఘటనను స్ఫూర్తిగా తీసుకున్న కురుప్.. తాను మరణించినట్టుగా ఆధారాలు సృష్టించి బీమా క్లయిమ్ చేసుకోవాలని పథకం పన్నాడు. ఇందుకు సోదరుడు భాస్కర పిళ్లై, డ్రైవర్ పొన్నప్పన్ సహకరించారు. మొదట కురుప్ లాగే ఉండే మనిషి డెడ్ బాడీ కోసం వీరు గాలించారు. దొరకపోవడంతో అతనిలాగే ఉండే వ్యక్తిని చంపి, కురుప్ మరణించినట్టు అందర్నీ నమ్మించాలని ప్లాన్ మార్చారు. కురుప్ లాగే ఎత్తు, బరువు ఉండే చాకో అనే వ్యక్తి వీరికి తారసపడ్డాడు. లిఫ్ట్ ఇస్తామని నమ్మించి వారు చాకోను కారులో ఎక్కించుకున్నారు. మత్తుపదార్థాలు కలిపిన డ్రింక్ చాకోకు ఇచ్చి, అపస్మారక స్థితిలోకి వెళ్లాక పిళ్లై అతన్ని చంపేశాడు. చాకో ముఖాన్ని గుర్తుపట్టకుండా ఉండేలా కాల్చారు. 1984 జనవరి 22 ఆయన డెడ్‌బాడీని కారులో ఉంచి మవెలిక్కర సమీపంలోని కున్నం దగ్గర కారును తగలబెట్టారు. పోలీసులు మొదట కురుప్ చనిపోయినట్టు భావించారు. కాగా విచారణలో అది కురుప్ మృతదేహం కాదని తేలింది. విషపదార్థం ఇచ్చి చంపారని, మృతదేహాన్ని డ్రైవర్ సీటులో ఉంచి కారును కాల్చివేసినట్టు తేలింది. కురుపే ఈ హత్యకు పథకం వేసి ఉంటాడని పోలీసులు భావించారు. చాకో అదృశ్యమయ్యాక ఆయన భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు కురుప్పై కేసు నమోదు చేసి అతని కోసం గాలించారు. ఈ కేసును కేరళ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. కురుప్ కోసం దేశమంతా గాలించినా ఆచూకీ దొరకలేదు. మహారాష్ట్ర, బిహార్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో అతను ఉన్నట్టు సమాచారం వచ్చింది కానీ దొరకలేదు. ఈ కేసులో పిళ్లైకు జీవిత కారాగార శిక్ష పడింది. స్థానికులు కురుప్ భార్య, పిల్లలను ఊరి నుంచి వెళ్లగొట్టారు. ఆమె అబుదాబి వెళ్లి నర్సుగా పనిచేసింది. 2010లో కురుప్ కొడుకు వివాహం జరిగింది. ఈ వేడుకకు కురుప్ వస్తాడని భావించి పోలీసులు నిఘా వేశారు. ఈ పెళ్లికి అతను రాలేదు. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. కురుప్ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో ఎవరికీ తెలియదు. మవెలికర ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఇటీవల కురుప్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 1990లో ముంబై ఎయిర్‌పోర్టులో చివరిసారి కురుప్ కనిపించినట్టు సమాచారం. అతని బంధువులకు లేఖ రాసినట్టు తెలుసుకున్నారు. అప్పటి నుంచి కురుప్ ఆచూకీ మిస్టరీగా మారింది.