వర్చువల్ మాయాలోకంలో మనుషుల మధ్య అనుబంధాలు కరువైపోతున్నాయి. ఆప్యాయత, అనురాగాలను ఆన్‌లైన్‌లోనే చూపిస్తున్నారు. పైకి సంతోషంగా కనిపిస్తున్నా లోలోపల ఒంటరితనంతో బాధపడుతున్నారు. బెల్జియన్‌కు చెందిన డేవిడ్ బేర్టెన్ అనే వ్యక్తి బంధువులు తనను తక్కువ చేసి చూస్తున్నారని, వారికి బుద్ధి చెప్పేందుకు ఓ పథకం వేశాడు.
తాను మరణించినట్లు కట్టుకథ అల్లాడు. తీరా కుటుంబసభ్యులు, బంధువులంతా అంత్యక్రియలకు తరలిరాగా సినిమా స్టైల్‌లో హెలికాప్టర్ నుంచి దిగా అందిరికి షాక్ ఇచ్చాడు.ఇంతకీ డేవిడ్ డెత్ ప్రాంక్ ఎందుకు చేశాడు? ఆ తర్వాత ఏమైంది?
వివరాల్లోకి వెళ్తే.. బెల్జియన్‌కు చెందిన డేవిడ్ బేర్టెన్ తన కుటుంబ సభ్యులు తనని లోకువగా చూస్తున్నారని తెగ ఫీలైపోయేవాడు. సొంత బంధువులే తనను పట్టించుకోవడం లేదని బాగా హర్ట్ అయ్యాడు. సొంతవారే తనను చిన్నచూపు చూడడంతో వారికి బుద్దిచెప్పేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు.ఒక మనిషి లేకపోతే ఆ బాధ ఎంతగా ఉంటుందో, వారి విలువ ఏంటన్నది తెలియజేయాలని తాను మరణించినట్లు కట్టుకథ అల్లాడు. బతికుండగానే తన అంత్యక్రియలను దగ్గరుండి ఏర్పాడు చేశాడు.
టిక్‌టాక్‌లో బాగా పాపులర్ అయిన డేవిడ్ బేర్టెన్(రాగ్నార్ లే ఫౌ) డెత్ ప్రాంక్ చేయడానికి ఆయన కూతుళ్లు కూడా సహాయం చేయడం మరో విశేషం. వాళ్లు ఎంతలా యాక్టింగ్ చేశారంటే.. తండ్రి నిజంగానే చనిపోయినట్లు వాట్సాప్ సందేశాల్లో పోస్ట్ చేశారు. రెస్ట్ ఇన్ పీస్ డాడ్, మీరు ఎప్పటికీ మా ఙ్ఞాపకాల్లో బతికే ఉంటారు అని ఓ కూతురు సోషల్ మీడియాలో షేర్ చేయగా, త్వరలోనే మీరు తాత కాబోతున్నారు. మీరు మాతో ఉండాల్సింది డాడీ..దేవుడు ఇంత అన్యాయం ఎందుకు చేశారు? మీరే ఎందుకు చనిపోవాలి? మిస్ యూ సో మచ్ అంటూ మరో కూతురు ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆన్‌లైన్‌లో ఈ పోస్ట్ చూసి అయ్యో పాపం అనుకున్నారంతా.
డేవిడ్ లేడనే వార్తతో శోకసంద్రంలో మునిగితేలారు. వారందరూ డేవిడ్‌ను తలుచుకుంటూ వెక్కివెక్కి ఏడుస్తున్నారు. అంత్యక్రియలు మరికాసేపట్లో జరుగుతాయనగా అక్కడికి ఓ హెలికాప్టర్ వచ్చింది. అది ల్యాండ్ కాగానే దాని నుంచి డేవిడ్ కిందకు దిగాడు. అంతే ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. తర్వాత డేవిడ్ "నా అంత్యక్రియలకు వచ్చిన మీకందరికీ స్వాగతం" అంటూ నవ్వుతూ పలకరిస్తున్నాడు. ఒక్కక్షణం అక్కడేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాక ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తర్వాత తేరుకొని బంధువులు అతన్ని చుట్టుముట్టి హగ్ చేసుకుని ఏడ్చేశారు.
ఈ మొత్తం ఎపిసోడ్‌ను షూట్ చేసిన ఓ బృందం దీన్ని నెట్టింట షేర్ చేయగా క్షణాల్లో వీడియో వైరల్‌గా మారింది. బతికుండానే అంత్యక్రియలకు ఎందుకు ప్లాన్ చేశారని ఆయన్ను అడగ్గా.. కుటుంబసభ్యులంతా ఎప్పుడో విడిపోయామని, తనని దేనికీ ఆహ్వానించరని, ఎవరూ చూడటానికి కూడా రారు అని అందుకే ఇలా డెత్ ప్రాంక్ చేసినట్లు డేవిడ్ చెప్పుకొచ్చాడు. వారికి గుణపాఠం నేర్పించాలని, మనుషుల మధ్య బంధాలు ఉండాలని, వారిని కలవాలంటే చనిపోయేవరకు వేచి ఉండకూడదని చూపించాలని ఇలా చేశానని తెలిపాడు. ఇప్పుడు కుటుంబం అందరం కలిపోయామని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment