fake oils
-
నకిలీ ఇంజిన్ ఆయిల్ గుట్టు రట్టు
అంనంతపురం సెంట్రల్: వాహనాలకు వినియోగించే 2టి ఆయిల్ నకిలీ రాకెట్ ముఠా గుట్టును విజిలెన్స్ అధికారులు రట్టు చేశారు. తాడిపత్రిలో చెన్నంపల్లిరోడ్డులో శ్రీసాయిబాబా ఎంటర్ప్రైజెస్, బుక్కరాయసముద్రం మండలంలో ఎస్ఎల్ఎన్ఎస్, అనంతపురంలో ఎంజీ పెట్రోల్ బంకు వద్ద రమేష్ ఆయిల్ ట్రేడర్స్, శ్రీనివాసనగర్‌లో శ్రీసాయిభార్గవ లూబ్రికెంట్స్ మ్యానుఫ్యాక్చర్ షాపులపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం మెరుపుదాడులు చేశారు. విజిలెన్స్ ఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో సిబ్బంది నాలుగు బృందా లుగా ఏర్పడి ఈ దాడులు జరిపారు. విజిలెన్స్ అధికారుల కథనం మేరకు... తాడిపత్రి పట్టణానికి చెందిన రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి తాడిపత్రితోపాటు ఇతర ప్రాంతాల్లో కార్లు, లారీలు, ఇతర మెకానిక్ షెడ్డుల నుంచి పనికిరాని(వేస్ట్) ఆయిల్‌ను సేకరించి తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లిలో నిల్వ చేస్తున్నాడు. ఇలా నిలువ చేసిన వేస్ట్ ఆయిల్‌లోకి అర్త్ పౌడర్ కలిపి బాగా వేడి చేస్తారు. ఆ తర్వాత వేస్ట్ ఆయిల్‌లోని మడ్డి అంతా వేరైపోతుంది. తర్వాత మూడుసార్లు ఫిల్టర్ చేస్తే రీప్రాసెస్ ఆయిల్గా బయటకు వస్తుంది. ఇలా వచ్చిన ఆయిల్‌ను డ్రమ్ములలో నిల్వ ఉంచి రంగు కలిపి కొత్త ఇంజన్ ఆయిల్గా మార్చుతున్నాడు. ఇలా చేసిన ఆయిల్‌ను 20ఎంఎల్, 50ఎంఎల్, లీటరు, 5 లీటర్లు, 10లీటర్లు క్యాన్లలో కొత్తగా ప్యాక్ చేసి అనంతపురం, కడప, హిందూపురం, చీమకుర్తి, మదనపల్లి, పత్తికొండ తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకు న్న విజిలెన్స్ అధికారులు దాడులు చేసి నిందితులను పట్టుకున్నారు. సదరు ఆయిల్ నకిలీదని గుర్తించారు. మొత్తం రూ.60 లక్షలు విలువ చేసే సరుకు, సామగ్రిని జప్తు చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించారు. తాడిపత్రికి చెందిన రామసుబ్బారెడ్డి, బుక్కరాయసముద్రం లక్ష్మినారాయణ, నగరంలో రమేష్ ఆయిల్ ట్రేడర్స్ నిర్వాహకులు రమేష్, శ్రీనివాసనగర్‌కు చెందిన మంజునాథ అనే షాపుల యజమానులపై చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాని సిఫారసు చేసినట్లు తెలిపారు. -
అంతా రహస్యమే..
నరసరావుపేటలో రహస్యంగా వ్యాపారాలు పేటను కల్తీల కోటగా మారుస్తున్న అత్యాశాపరులు నేమ్ బోర్డులు ఏర్పాటు చేయకున్నా పట్టించుకోని అధికారులు రూపాయి రూపాయి నువ్వేమి చేస్తావంటే..మనుషుల మధ్య సంబంధాలు చెడగొడతాను..మనుషుల మధ్య ఆంతర్యాలు పెంచుతాను..మనుషుల మనసుల్లో అత్యాశను పెంచి..అదే మనుషుల ప్రాణాలను గాలిలో దీపంలా మారుస్తానని చెప్పిందట..ఇప్పుడ నరసరావుపేట ఆయిల్ వ్యాపారులూ ఈ రూపాయి పేరాశలో మునిగిపోయారు..పసిపిల్లలు తాగే పాల నుంచి వంటిట్లో నూనెల వరకు కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో నిత్యం చెలగాటమాడుతున్నారు..అసలు వీరు ఏమి చేస్తున్నారో కూడా తెలియనంత రహస్యంగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. నరసరావుపేట: పట్టణంలో వ్యాపారం మొత్తం రహస్యమే. అంతా కల్తీనే..తాము చేసేది పది మందికీ తెలియకుండా అంతా రహస్యంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారు ఇక్కడి ఆయిల్ వ్యాపారులు. వారు ఏ వ్యాపారం చేస్తున్నారో...ఏ పేరుతో వ్యాపారం చేస్తున్నారో అనేది తెలియనే తెలియదు. వీరి దురాశ పుణ్యమాని నరసరావుపేట..కల్తీల కోటగా మారిపోయింది. ఏడాది కాలంలో అధికారులు ఇక్కడ 16 సార్లు పాలు, శనగనూనె మిల్లులు, వాటర్ ప్లాంట్లపై దాడులు నిర్వహించారు. శనగనూనె, పామాయిల్, తవుడు నుంచి తీసిన రైస్ బ్రౌన్ ఆయిల్‌ను పీపాలు, ట్యాంకర్లతో టోకు మొత్తంగా దూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీనిని తమ సొంత బ్రాండ్లపై తక్కువ రేటు ఉన్న ఆయిల్‌ను ఎక్కువ రేటు ఉన్న ఆయిల్‌తో కలిపి ప్యాకెట్లలో నింపుతున్నారు. రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇలా కోట్ల రూపాయల కల్తీ వ్యాపారం చేస్తున్నారు. కోటప్పకొండ, వినుకొండ, సత్తెనపల్లి రోడ్లు, బరంపేట ప్రాంతాల్లో ఇటువంటి ఆయిల్ మిల్లులు ఉన్నాయి. పట్టణంలో కొబ్బరి, శనగగుండ్లతో ఆయిల్ తయారు చేసే మిల్లులు చాలా ఉన్నా వాటికి నేమ్ బోర్డులు ఏర్పాటు చేయలేదు. దాల్, రైస్ మిల్లుల్లో చాలా వాటికీ పేర్లు లేవు. బయటి నుంచి చూస్తే లోపల ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కొత్త వ్యక్తులకు పలానా పేరు గల మిల్లు అని చెప్పినా త్వరగా తెలుసుకోలేని పరిస్థితి ఉంది. పరిశ్రమ పెట్టేందుకు పరిశ్రమల శాఖ, వ్యాపారం చేసేందుకు వాణిజ్య పన్నుల శాఖ, కార్మిక శాఖ నుంచి తగిన లెసైన్స్‌లు పొంది వీరు వ్యాపారం చేయాలి. ప్రభుత్వ నిబంధన ప్రకారం ప్రతి ఒక్కరూ తాము చేస్తున్న వ్యాపారానికి తగిన బోర్డు ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేయాలి. నరసరావుపేటలో ఇవేమీ అమలు కావడం లేదు. నేమ్ బోర్డులు తప్పకుండా ఏర్పాటు చేయాలి లెసైన్స్‌లు తీసుకున్న వ్యక్తులు తప్పకుండా నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలి. బోర్డులు లేని వ్యాపారాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం - మంజులారాణి, వాణిజ్యపన్నుల శాఖాధికారి, నరసరావుపేట