నరసరావుపేటలో రహస్యంగా వ్యాపారాలు
పేటను కల్తీల కోటగా మారుస్తున్న అత్యాశాపరులు
నేమ్ బోర్డులు ఏర్పాటు చేయకున్నా పట్టించుకోని అధికారులు
రూపాయి రూపాయి నువ్వేమి చేస్తావంటే..మనుషుల మధ్య సంబంధాలు చెడగొడతాను..మనుషుల మధ్య ఆంతర్యాలు పెంచుతాను..మనుషుల మనసుల్లో అత్యాశను పెంచి..అదే మనుషుల ప్రాణాలను గాలిలో దీపంలా మారుస్తానని చెప్పిందట..ఇప్పుడ నరసరావుపేట ఆయిల్ వ్యాపారులూ ఈ రూపాయి పేరాశలో మునిగిపోయారు..పసిపిల్లలు తాగే పాల నుంచి వంటిట్లో నూనెల వరకు కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో నిత్యం చెలగాటమాడుతున్నారు..అసలు వీరు ఏమి చేస్తున్నారో కూడా తెలియనంత రహస్యంగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.
నరసరావుపేట: పట్టణంలో వ్యాపారం మొత్తం రహస్యమే. అంతా కల్తీనే..తాము చేసేది పది మందికీ తెలియకుండా అంతా రహస్యంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారు ఇక్కడి ఆయిల్ వ్యాపారులు. వారు ఏ వ్యాపారం చేస్తున్నారో...ఏ పేరుతో వ్యాపారం చేస్తున్నారో అనేది తెలియనే తెలియదు. వీరి దురాశ పుణ్యమాని నరసరావుపేట..కల్తీల కోటగా మారిపోయింది. ఏడాది కాలంలో అధికారులు ఇక్కడ 16 సార్లు పాలు, శనగనూనె మిల్లులు, వాటర్ ప్లాంట్లపై దాడులు నిర్వహించారు.
శనగనూనె, పామాయిల్, తవుడు నుంచి తీసిన రైస్ బ్రౌన్ ఆయిల్‌ను పీపాలు, ట్యాంకర్లతో టోకు మొత్తంగా దూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీనిని తమ సొంత బ్రాండ్లపై తక్కువ రేటు ఉన్న ఆయిల్‌ను ఎక్కువ రేటు ఉన్న ఆయిల్‌తో కలిపి ప్యాకెట్లలో నింపుతున్నారు. రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇలా కోట్ల రూపాయల కల్తీ వ్యాపారం చేస్తున్నారు. కోటప్పకొండ, వినుకొండ, సత్తెనపల్లి రోడ్లు, బరంపేట ప్రాంతాల్లో ఇటువంటి ఆయిల్ మిల్లులు ఉన్నాయి.
పట్టణంలో కొబ్బరి, శనగగుండ్లతో ఆయిల్ తయారు చేసే మిల్లులు చాలా ఉన్నా వాటికి నేమ్ బోర్డులు ఏర్పాటు చేయలేదు. దాల్, రైస్ మిల్లుల్లో చాలా వాటికీ పేర్లు లేవు. బయటి నుంచి చూస్తే లోపల ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కొత్త వ్యక్తులకు పలానా పేరు గల మిల్లు అని చెప్పినా త్వరగా తెలుసుకోలేని పరిస్థితి ఉంది.
పరిశ్రమ పెట్టేందుకు పరిశ్రమల శాఖ, వ్యాపారం చేసేందుకు వాణిజ్య పన్నుల శాఖ, కార్మిక శాఖ నుంచి తగిన లెసైన్స్‌లు పొంది వీరు వ్యాపారం చేయాలి. ప్రభుత్వ నిబంధన ప్రకారం ప్రతి ఒక్కరూ తాము చేస్తున్న వ్యాపారానికి తగిన బోర్డు ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేయాలి. నరసరావుపేటలో ఇవేమీ అమలు కావడం లేదు.
నేమ్ బోర్డులు తప్పకుండా ఏర్పాటు చేయాలి
లెసైన్స్‌లు తీసుకున్న వ్యక్తులు తప్పకుండా నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలి. బోర్డులు లేని వ్యాపారాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం
- మంజులారాణి, వాణిజ్యపన్నుల శాఖాధికారి, నరసరావుపేట
అంతా రహస్యమే..
Published Fri, Jul 8 2016 8:31 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 AM
Advertisement