రైతులకు అండగా న్యాయవ్యవస్థ ఉంటుంది
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి
సాక్షి, విజయవాడ: ‘రైతుల ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరు. మనది ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో న్యాయవ్యవస్థ ఇంకా బతికే ఉంది. రైతులను ఇబ్బంది పెడితే న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదు’ అని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం విజయవాడలోని ఐఎంఏ హాలులో జనచైతన్య వేదిక నేతృత్వంలో ‘రాష్ట్ర సమగ్రాభివృద్ధి-రాజధాని నిర్మాణం’ అనే అంశంపై జరిగిన ప్రాంతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. సింగపూర్ లాంటి దేశంలో భూములు లేకపోవడం వల్ల బహుళ అంతస్థులు నిర్మించారని, మనకు భూములు పుష్కలంగా ఉండటం వల్ల సాధారణ భవనాలు నిర్మిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు.
ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సేకరించాలనుకోవడం సరికాదని, భూసేకరణ చట్టం ద్వారానే రైతుల భూములు తీసుకోవాలని, అప్పుడే రైతుకు భద్రత, భవిష్యత్తు ఉంటుందన్నారు. రైతుల భూముల లాక్కునే ప్రయత్నం మంచిది కాదని హితవు పలికారు. సీఆర్డీఏ ప్రభుత్వం సృష్టించిన సంస్థ అని, దానికి ఎలాంటి అధికారాలు ఉండవన్నారు. భూసేకరణ చట్టంలో పంట భూములు తీసుకోకూడదనే నిబంధన ఉందని, అలాంటప్పుడు చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యవస్థలు పని చేయలేవని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ నిబంధనలు కూడా తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. తాను కొద్దిరోజుల్లో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని, రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తానని చెప్పారు. ఏదైనా న్యాయసలహా కావాలంటే తన మొబైల్ నంబర్ 99892 22217లో సంప్రదించాలని సూచించారు.
రియల్ వ్యాపారం కోసమే: రాజధాని భూసేకరణ రైతు ప్రయోజనాలకు విఘాతంగా ఉందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. గతంలో 106 సెజ్‌లకు అనుమతులిచ్చి వేల ఎకరాలు భూములు అప్పగిస్తే.. ఇప్పుడు వాటిల్లో 32 మాత్రమే పనిచేస్తున్నాయన్నారు.
ప్రభుత్వం రియల్ వ్యాపారం ధోరణితోనే రైతుల నుంచి భూములు లాక్కుంటోందని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ, భూకంప ప్రాంతం పరిధిలో విజయవాడ పరిసరాలు ఉన్నాయని అనేక మంది శాస్తవేత్తలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సింగపూర్ కంపెనీలకు కాకుండా గ్లోబల్ టెండర్ల ద్వారా పనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాగార్జున వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ యార్లగడ్డ బాలగంగాధర్, మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య, లోక్‌సత్తా నేత డీవీవీఎస్ వర్మ, మాజీ ఎమ్మెల్యే భారతి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు ప్రసంగించారు. సదస్సుకు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వినయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ తదితరులు పాల్గొన్నారు.