fare price
-
మార్కెట్లు ధ్వంసం చేస్తాం: తమ్మినేని
-
మార్కెట్లు ధ్వంసం చేస్తాం: తమ్మినేని
వరంగల్ అర్బన్: మిర్చికి మద్దతు ధర ప్రకటించాలని, లేకుంటే మార్కెట్ యార్డులను ధ్వంసం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన గురువారం వరంగల్ ఏనుమాముల మార్కెట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మిర్చి రైతులతో మాట్లాడారు. మరో నాలుగు రోజుల్లోగా క్వింటాలుకు మద్దతు ధర రూ.13వేలుగా ప్రకటించకుంటే మార్కెట్లు ధ్వంసమవుతాయని హెచ్చరించారు. అవసరమైతే కోల్డ్ స్టోరేజీలను రైతులు ఆక్రమిస్తారని తెలిపారు. కోల్డ్ స్టోరేజీలు వ్యాపారులు బుక్ చేసుకున్నారని, ఎవరు బుక్ చేశారో ఆన్ లైన్ లో పేర్లు సహా వివరాలు పెట్టాలని డిమాండ్ చేశారు. రూ.1లక్ష 49 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం రూ.250 కోట్ల రైతుల కోసం కేటాయించలేరా అని ప్రశ్నించారు. వేములవాడ, యాదాద్రి ఆలయాల అభివృద్ధి కోసం లక్షల కోట్లు వెచ్చించే సర్కారు రైతుల కోసం ఈ మాత్రం చేయలేదా అని నిలదీశారు. జార్ఖండ్‌లో మిర్చి క్వింటాలుకు ధర రూ.14 వేల వరకు పలుకుతోందని చెప్పారు. -
మిర్చికి మద్దతు ధర ఇవ్వండి
ఒంగోలు టౌన్: మిర్చి క్వింటా 10వేల రూపాయలకు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని నాలుగు వామపక్ష రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం స్థానిక ఎల్బీజీ భవన్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించాయి. రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి. హనుమారెడ్డి మాట్లాడుతూ మిర్చి రైతులు ఈ ఏడాది పంట పండించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 70వేల రూపాయల వరకు ఖర్చు చేశారన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు మాట్లాడుతూ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించినా మిర్చి పంటను ఇంతవరకు నమోదు చేయకపోవడం దారుణమని తెలిపారు. ఎండిపోయిన మిర్చి పంటను వెంటనే నమోదుచేసి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడు రామారావు మాట్లాడుతూ సాగు విస్తీర్ణం పెరగడం వల్ల ధరలు తగ్గాయని అధికారులు చెప్పడం సరికాదన్నారు. ఈ ఏడాది విస్తీర్ణం పెరిగినా దిగుబడి తగ్గిన విషయాన్ని గుర్తెరగాలన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకుడు ఆర్. మోహన్ మాట్లాడుతూ మిర్చి ధరలు రోజురోజుకు పతనం అవుతున్నా ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తోందని విమర్శించారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెంట్యాల హనుమంతరావు మాట్లాడుతూ ఐక్య ఉద్యమాల ద్వారా గతంలో అనేక ఫలితాలు సాధించుకోవచ్చని చెప్పారు. మిర్చి రైతుల సమస్యలపై ఐక్య పోరాటాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రైతు కూలీ సంఘం జిల్లా నాయకురాలు ఎస్. లలితకుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు పరిటాల నాగేశ్వరరావు, నాంచార్లు, కె. హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.