
మార్కెట్లు ధ్వంసం చేస్తాం: తమ్మినేని
వరంగల్ అర్బన్: మిర్చికి మద్దతు ధర ప్రకటించాలని, లేకుంటే మార్కెట్ యార్డులను ధ్వంసం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన గురువారం వరంగల్ ఏనుమాముల మార్కెట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మిర్చి రైతులతో మాట్లాడారు. మరో నాలుగు రోజుల్లోగా క్వింటాలుకు మద్దతు ధర రూ.13వేలుగా ప్రకటించకుంటే మార్కెట్లు ధ్వంసమవుతాయని హెచ్చరించారు.
అవసరమైతే కోల్డ్ స్టోరేజీలను రైతులు ఆక్రమిస్తారని తెలిపారు. కోల్డ్ స్టోరేజీలు వ్యాపారులు బుక్ చేసుకున్నారని, ఎవరు బుక్ చేశారో ఆన్ లైన్ లో పేర్లు సహా వివరాలు పెట్టాలని డిమాండ్ చేశారు. రూ.1లక్ష 49 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం రూ.250 కోట్ల రైతుల కోసం కేటాయించలేరా అని ప్రశ్నించారు. వేములవాడ, యాదాద్రి ఆలయాల అభివృద్ధి కోసం లక్షల కోట్లు వెచ్చించే సర్కారు రైతుల కోసం ఈ మాత్రం చేయలేదా అని నిలదీశారు. జార్ఖండ్‌లో మిర్చి క్వింటాలుకు ధర రూ.14 వేల వరకు పలుకుతోందని చెప్పారు.