రైతు సోయి లేని నేతలు!
రైతు సంఘాల నాయకులు చట్టసభల టికెట్లను ఆశిస్తూ రాజకీయ పార్టీల ఆఫీసుల దగ్గర ‘క్యూ’ కడుతున్నారు. వీరి నిర్వాకం వల్లనే రైతులు నష్టపోతున్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో, రైతులతో కలిసి ఒక ప్రబలమైన రాజకీయ శక్తిని నిర్మించడంలో వారు ఇప్పటికైనా తమ వైఫల్యాన్ని అంగీకరించాలి.
ఎన్నికలు తరుముకొస్తుంటే ముసుగు తన్నిన ప్రభుత్వం అకస్మాత్తుగా నిద్రలేస్తుంది. ప్రజలకు ఏం చేయా లో ఆలోచన చేస్తుంది. ఇపుడూ అదే తంతు. పదవీ విరమణ చేసిన రక్షణ సిబ్బందికి ‘ఒక ర్యాంకు-ఒక పెన్షన్’, ఆహార భద్రత పథకం కింద పేదలకు 5 కిలోల ఆహార దినుసులు, ప్రభుత్వ సిబ్బందికి ఏడవ వేతన సవరణ కమిషన్ ప్రకటన, జాట్లకు ఓబీసీ కోటాలో రిజర్వేషన్ వంటి తాయిలాలు ఆయా వర్గాల ప్రజలను సంతృప్తిపరచడం కోసమే. ఎంత భారీగా వరాలిస్తే ఓట్లు ఆ మేరకు పెరుగుతాయి. కానీ ఈ దేశంలో గణనీయ సంఖ్యలో రైతులు ఉన్నప్పటకీ ప్రభుత్వం వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. దేశంలో 60 కోట్ల మంది దాకా ఉన్న రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీల పట్ల ప్రభుత్వానికి కనీస సానుభూతి కూడా లేదు. ప్రస్తుతం దేశం ఎదుర్కొం టున్న వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు యూపీఏ మాత్రమే కాదు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా తగిన ఆర్థిక విధానాలు ప్రకటించకుండా మొహం చాటేశాయి.
సార్వత్రిక ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలను ఇంకా ప్రకటించనప్పటికీ, వాస్తవానికి రైతు ప్రయోజనాలు ఏ రాజకీయ పార్టీ దృక్పథం లోనూ లేవన్నది చేదు వాస్తవం. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఇటీవల మీరట్ బహిరంగ సభలో మా ట్లాడుతూ, చెరకు రైతులకు అధిక మద్దతు ధర ఇప్పిస్తామన్నారు. రూ. 5,000 కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి ని ఏర్పాటు చేస్తే రైతులు తమ ఉత్పత్తులకు తగిన మద్ద తు ధర పొందుతారని, గుజరాత్‌లోని రైతుల పద్ధతిలో వాణిజ్య పంటలు పండించి యూపీ రైతులు కూడా లబ్ధి పొందాలని ఆయన ఒక సలహా కూడా ఇచ్చారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంతవరకు చేసిన ప్రసంగాలలో రైతుల ఊసే లేదు. ఆయన ఎంతసేపూ యువతీయువకులకూ, మహిళలకూ ప్రాధాన్యమిస్తారు తప్ప రైతుల గురించి ఎక్కడా మాట్లాడరు.
రైతు నేతల వైఫల్యం
దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య దాదాపు 82 కోట్ల మందిదాకా ఉంటే దానిలో సుమారుగా సగం మంది రైతులే ఉంటారని ఒక అంచనా. ఇంత గణనీయ సంఖ్యలో రైతులు ఉన్నప్పటికీ వారు ప్రభుత్వాలపై ఎలాంటి ప్రభావమూ చూపలేకపోతున్నారు. వీరంతా ఒక ‘ఐక్య కర్షక శక్తి’గా ఓటింగ్‌లో పాల్గొనకుండా తమకిష్టం వచ్చివ వారికి రాజకీయ పార్టీల ప్రాతిపదికగా ఓట్లు వేయడం వల్ల ఎవరికి వారే యమునాతీరే అన్న చందం గా ఉంది. ఫలితంగా ఏ రాజకీయ పార్టీ రైతుల్ని సీరియస్‌గా పట్టించుకోవడం లేదు. ప్రస్తుత రైతు సంఘాల నాయకత్వమే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ రైతు సంఘాల నాయకులు లోక్‌సభ టికెట్లను ఆశిస్తూ రాజకీయ పార్టీల ఆఫీసుల దగ్గర ‘క్యూ’ కడుతున్నారు. వీరి నిర్వాకం వల్లనే రైతులు నష్టపోతున్నారు. ఈ దేశంలోని రైతుల సమస్యలను పరిష్కరించనందుకు, రైతులతో ఒక ప్రబలమైన రాజకీయ శక్తిని నిర్మించలేకపోయినందుకు వారు ఇప్పటికైనా తమ వైఫల్యాన్ని అంగీకరించాలి.
దివాలాకోరు ప్రకటనలు
ఒక రైతు నెలకు సగటున రూ.2,115 మాత్రమే ఆదా యం పొందుతున్నాడని లెక్కలు తేలినపుడు, దేశంలో ప్రతిరోజు దాదాపు 2,500 మంది రైతులు వ్యవసాయా న్ని వదిలిపెట్టేస్తున్నారని స్పష్టమైనపుడు మన రాజకీయ పార్టీలు వ్యవసాయ రంగ సంక్షోభంపై త్వరితగతిన దృష్టి పెట్టి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. దేశంలో మూడింట రెండు వంతుల మంది ప్రజలు పేదరికం, ఆకలితో అలమటిస్తుంటే వచ్చే కొన్నేళ్లలో భారత్‌ను ‘సూపర్ పవర్’ చేస్తామంటూ నాయకులు చేసే ప్రకటనలు దివాలాకోరుతనంగా కనిపిస్తాయి. మన దేశంలో 60 శాతం మంది రైతులు క్షుద్బాధతో పడుకుంటారన్న విషయాన్ని ఇటీవల కొన్ని సర్వేలు వెల్లడించాయి. దేశానికి అన్నం పెట్టే రైతు తిండి లేక పస్తులుంటున్నాడంటే... వ్యవసాయ రంగం ఎంతటి సంక్షోభంలో కూరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో అంతా అయిపోయిందని కుంగిపోనక్కర్లేదు. ఎన్నికల వేళ రైతు సంఘాల నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి ఒక సమష్టి ప్రణాళికను రూపొందించుకోవాలి. తమ ప్రధాన డిమాండ్లను తీర్చే రాజకీయ పార్టీలకే ఓటు వేస్తామని ఈ సంఘాలు కరాఖండిగా చెప్పాలి. తక్షణం దృష్టి పెట్టాల్సిన ప్రాధాన్యతా అంశాలను రాజకీయ పార్టీల ఎజెండాలో ఉంచాలి.
రైతులకు నెలవారీ ఆదాయం
రైతులకు నెలవారీగా ఎంతో కొంత ఆదాయం లభించే పద్ధతి ఉండాలి. కాబట్టి దీని కోసం ప్రభుత్వం ‘జాతీయ రైతుల ఆదాయ కమిషన్’ పేరుతో ఒక సంస్థను నెలకొల్పాలి. రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపును డబ్ల్యూటీవో సవాలు చేస్తున్న నేపథ్యంలో, అందునా ఈ ఎంఎస్పీతో 30 శాతం మంది రైతులే లబ్ధిపొందుతున్న దృష్ట్యా రైతులకు నెలకు కొంత ఆదాయం కచ్చితంగా లభించే పద్ధతిని ప్రవేశపెట్టాలి. యూపీలో ‘సఫాయీ కర్మ్చారీస్’కు మాయావతి ప్రభుత్వం రూ.18,500 కనీస వేతనం ఖరారు చేసినప్పుడు రైతులకు కూడా నెలకు కచ్చితమైన ఆదాయం ఎందుకు ఇవ్వకూడదు?
పంజాబ్‌లో రైతులకు గిట్టుబాటు ధరలు లభించేందుకు తగిన మౌలిక సౌకర్యాలు ఉన్నాయి. అక్కడిలాగే ఇతర రాష్ట్రాలలో కూడా మార్కెట్ భవనాలను, గ్రామాల నుంచి పట్టణాలకు లింక్ రహదారులను నిర్మిస్తే రైతులు తమ ఉత్పత్తులను మంచి రేటుకు అమ్ముకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో 35 లక్షలకుపైగా ఎకరాలలో రైతులు క్రిమిసంహారక మందులను వాడడం లేదు. 20 లక్షల హెక్టార్లలో రైతులు ఎరువులను వినియోగించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని రైతులను ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాల వారు కూడా ఈ పంథాను అనుసరించాలి.
వ్యవసాయానికి సంబంధం లేని పథకాలకు సాగుభూమిని కేటాయించకూడదు. అభివృద్ధి సాధిస్తామని చెపుతూ ఒక తప్పుడు సూత్రీకరణతో భారీగా భూసేకరణ జరుగుతోంది. వ్యవసాయ భూమిని సేకరించేం దుకు బడా విదేశీ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. పెరుగుతున్న జనాభాగల దేశ అవసరాలకు భవిష్యత్తులో ఇదొక విపత్తుగా పరిణమిస్తుంది. గతంలో వ్యవసాయ భూములు సేకరించి తప్పు చేసిన చైనా ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునే పనిలో ఉంది. దీర్ఘకాలికంగా వ్యవసాయ రంగం అధిక శాతం మందికి ఉపాధి కల్పించేవిధంగా, రైతులకు గిట్టుబాటు కలిగించేదిగా ఉండాలి. వ్యవసాయ రంగంలో వ్యవసాయ కూలీలకు ఉపాధి లేకుండా చేసి వారి కడుపులు కొట్టడం.... నగరాలలో మరొకరి చేతికింద దాస్యం చేసే ఉద్యోగాలు సృష్టించడం ఆర్థికాభివృద్ధికి చిహ్నం కాదని విధాన నిర్ణేతలు గుర్తుంచుకోవాలి.
(వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు)
- దేవిందర్ శర్మ