చుక్కల్లో ‘చిక్కుడు’
భగ్గుమంటున్న కాయగూరలు
ధరాఘాతంతో జనం విలవిల
దిగుబడి లేక రెండింతలు పెరిగిన వైనం
సాక్షి, సిటీబ్యూరో: నగర మార్కెట్లో చిక్కుడు కాయల ధర చుక్కలను తాకుతోంది. పచ్చి మిర్చి ఘాటు జేబుపై పడింది. బీన్స్ బేజారెత్తిస్తోంది. ఉల్లి సైతం లొల్లి చేస్తోంది. దీంతో సామాన్యులు పచ్చడి మెతుకులే పరమాన్నంగా భావిస్తున్నాడు. గత ఐదు రోజుల దాకా అందుబాటులో ఉన్న కూరగాయల ధర ఒక్కసారిగా రెండింతలు పెరిగింది. సోమవారం రైతుబజార్లో కిలో చిక్కుడు కాయలు రూ.38 ఉండగా, బహిరంగ మార్కెట్లో రూ.50 చొప్పున విక్రయించారు.
ఇదే సరుకు కార్పొరేట్ మాల్స్‌లో నాణ్యత (బెస్ట్ క్వాలిటీ) పేరుతో కేజీ రూ.60 వసూలు చేస్తున్నారు. స్థానికంగా పంట సాగు లేకపోవడంతో చిక్కుడుతో పాటు పచ్చిమిర్చి, కాప్సికం, ఫ్రెంచ్ బీన్స్, బెండ, బీర కాయల ధరలు కూడా పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం చిక్కుడు, బెండ, గోకర కాయలను విజయవాడ నుంచి, క్యాప్సికంను బెంగళూరు, ఫ్రెంచ్ బీన్స్‌ను మహారాష్ట్ర నుంచి నగరానికి దిగుమతి చేసుకుంటున్నారు.
ఇటీవల వర్షాల కారణంగా అక్కడ పంట దెబ్బతినడంతో నగరానికి దిగుమతులు బాగా తగ్గాయి. దీంతో డిమాండ్- సరఫరాల మధ్య అంతరం పెరిగింది. ఇదే అదనుగా భావించి రిటైల్ వ్యాపారులు ధరలు పెంచేశారు.
పచ్చిమిర్చి ఘాటు:
పచ్చి మిర్చి ధర వింటేనే కళ్ల వెంట నీళ్లొస్తున్నాయి. ప్రతి ఇంటిలోనూ నిత్యం వినియోగించే పచ్చిమిర్చి హోల్‌సేల్‌గా కేజీ రూ.28 ఉండగా రిటైల్ మార్కెట్లో రూ.40కి అమ్ముతున్నారు. ఇదే సరుకు ఇంటి ముంగిటకు తెచ్చే బండ్ల వ్యాపారులు రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. ప్రధానంగా కర్నూలు, అనంతపూర్, మదనపల్లి ప్రాంతాల నుంచి నగరానికి పచ్చిమిర్చి దిగుమతి అవుతుంది. వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల అక్కడ పంట సాగు దెబ్బతినడంతో ఈ పరిస్థితి ఎదురైనట్లు మార్కెటింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానికంగా కొత్త పంట వస్తే తప్ప మిర్చి ధరలు తగ్గవని వ్యాపారులు చెబుతున్నారు. ధరల అదుపునకు మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.