సాగునీటి పథకాల అమల్లో నిర్లక్ష్యం తగదు
హొస్పేట : చెరుకు రైతులకు మద్దతు ధర కల్పించాలని, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, ఉత్తర కర్ణాటకలోని రైతులకు నీటిపారుదల పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వ హించిందని రాష్ట్ర రైతు సంఘం హసిరు సేన సంయుక్త ఆధ్వర్యంలో వందలాది మంది రైతులు శనివారం జాతీయ రహదారిపై బైఠాయించారు. కొప్పళ తాలూకాలోని హిట్నాళ్-హొసళ్లి క్రాస్ వద్ద వాహనాలను అడ్డుకుని రాస్తారోకో చేశారు.
ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ మాట్లాడుతూ ఉత్తర కర్ణాటకలో రైతులు తీవ్ర కష్టాలకు గురవుతున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదన్నారు. ఈ భాగంలో బృహత్ నీటి పథకాలు ఎత్తిపోతల నీటి పథకాలతోపాటు చెరువుల అభివృద్ధి కూడా ఏ మాత్రం జరగలేదన్నారు. రైతులు అప్పులు చేసుకుని సొంతంగా పొలాల్లో బోర్లు వేసుకున్నారన్నారు.
నిరంతరం విద్యుత్ కోత విధించడం వల్ల బోరువెల్ పంప్సెట్లపై ఆధారపడిన రైతుల పంటలకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గంటల పాటు విద్యుత్ అందిస్తే రైతులకు ఏమాత్రం సరిపోదన్నారు. ప్రభుత్వం చెరుకుకు మద్దతు ధర టన్నుకు రూ.2650 నిర్ణయించి ఆదేశాలు జారీ చేసినా చక్కెర కర్మాగార యజమానులు ఇంత వరకు మద్దతు ధర కల్పించలేదన్నారు.
తుంగభద్ర డ్యాం నుంచి బృహత్ కర్మాగారాలకు సరఫరా చేస్తున్న నీటిని నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. సింగటలూరు, చిమ్మలగి, ములువాడ, హులిగుడ్డ, నందవాడగితోపాటు ఇతర ఎత్తిపోతల నీటి పథకాల పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కొప్పళ జిల్లాధికారి కేబీ.మోహన్రాజ్కు వినతి పత్రం అందజేశారు. సుమారు రెండున్నర గంటల పాటు రైతులు రస్తారోకో చేయడంతో వాహనాలు స్తంభించి పోయాయి.
ఈ కార్యక్రమంలో రైతు నేతలు గంగాధర, నాగేంద్ర, కళ్యాణ్రావు, బీసీపాటిల్, చుక్కినంజుండస్వామి, రామస్వామి, వీరసంగయ్య, రాము, పుట్టుస్వామి, శ్యాంతస్వామి మఠ, గోవిందరాజ, రామకృష్ణప్ప, మంజునాథగౌడ, ముద్దానయ్యహిరేమఠ్ తదితరులు పాల్గొన్నారు.