Fatullah Oneday Match
-
శ్రీలంక లక్ష్యం 265.. భారత్‌తో పోరు
ఫతుల్లా: ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్నమ్యాచ్‌లో శిఖర్ ధవన్ (94), విరాట్ కోహ్లీ (48) రాణించడంతో టీమిండియా సముచిత స్కోరు చేసింది. లంకేయులకు 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా ఆరంభంలో నిలకడగా ఆడిన భారత్.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 264 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ (13) నిరాశ పరిచినా.. మరో ఓపెనర్ శిఖర్ ధవన్ జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (48) మరోసారి రాణించాడు. కోహ్లీ, ధవన్ రెండో వికెట్‌కు 97 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. భారత ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోతున్న దశలో ఈ జోడీని లంక బౌలర్ అజంతా మెండిస్ బౌల్డ్ చేయడంతో కష్టాలు మొదలయ్యాయి. విరాట్ రెండు పరుగులతో హాఫ్ సెంచరీని, ధవన్ ఆరు పరుగులతో సెంచరీని చేజార్చుకున్నారు. ఆ తర్వాత రహానె (22), అంబటి రాయుడు (18), దినేశ్ కార్తీక్ (4), స్టువర్ట్ బిన్నీ (0) పరుగుల వేటలో చతికిలపడ్డారు. చివర్లో జడేజా 22 (నాటౌట్) , అశ్విన్ 18, మహమ్మద్ షమీ 14 (నాటౌట్) పరుగులు చేశారు. ఏడు బంతులాడిన షమీ రెండు సిక్సర్లు బాదడంతో స్కోరు 250 మార్క్ దాటింది. లంక బౌలర్లు మెండిస్ నాలుగు, సేననాయకె మూడు వికెట్లు పడగొట్టారు. -
ఆసియా కప్‌లో భారత్ శుభారంభం.. బంగ్లాదేశ్‌పై విజయం
ఫతుల్లా: ఆసియా కప్‌లో టీమిండియా శుభారంభం చేసింది. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్లతో అలవోక విజయం సాధించింది. 280 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగు వికెట్ల నష్టానికి మరో ఆరు బంతులు మిగిలుండగా విజయతీరాలకు చేరింది. విరాట్ కోహ్లీ (122 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 136) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును విజయానికి చేరువ చేశాడు. వన్డేల్లో అతడికిది 19వ సెంచరీ కావడం విశేషం. 131 వన్డేల్లోనే అతడీ ఘనత సాధించాడు. రహానె (73) హాఫ్ సెంచరీ చేశాడు. అంతకుముందు టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేసింది. బంగ్లా కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ అద్భుతంగా ఆడి సెంచరీ సాధించాడు. 112 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 117 పరుగులు చేసి చివరి ఓవర్లో అవుటయ్యాడు. ఓపెనర్ అనాముల్ హక్(77) అర్థ సెంచరీ కొట్టాడు. మోమినల్ హక్ 23, నయీమ్ ఇస్లాం 14, జియావుర్ రెహమాన్ 18, షంసూర్ రెహమాన్ 7 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 4 వికెట్లు పడగొట్టాడు. ఆరోన్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
వన్డేల్లో 19వ సెంచరీ చేసిన కోహ్లి
ఫతుల్లా: ఛేజింగ్ హీరో విరాట్ కోహ్లి మరోసారి శతకం బాదాడు. లక్ష్య ఛేదనలో చెలరేగి ఆడే అలవాటును కొనసాగించాడు. ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డేలో టీమిండియా కెప్టెన్ కోహ్లి సెంచరీ సాధించాడు. 95 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 19వ సెంచరీ కావడం విశేషం. 131 వన్డేల్లోనే అతడీ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ కూడా సెంచరీ సాధించాడు. రహీమ్ 117 పరుగులు చేశాడు. కోహ్లి విజృంభణతో భారత్ విజయం దిశగా దూసుకెళుతోంది. కోహ్లికి అంజిక్య రహానే చక్కటి సహకారం అందించాడు. రహానే అర్థ సెంచరీ పూర్తి చేశాడు.