డిసెంబర్ 15కు ఏపీలో ఎయిర్టెల్ 4జీ సేవలు
న్యూఢిల్లీ: డిసెంబర్ 15 నాటికి టెలీకాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్టెల్ ఏపీలో తొలిసారిగా ఎఫ్డీడీ-ఎల్టీఈ టెక్నాలజీ 4జీ సేవల్ని ప్రారంభించనుంది. ఏపీతోసహా 11 రాష్ట్రాల్లో ఆరు లేదా అంతకన్నా ఎక్కువ సర్కిళ్లలో ఈ 4జీ సేవల్ని విస్తరించనుంది. దీనికోసం నోకియా నెట్వర్క్స్తో మంగళవారం ఒప్పందాన్ని కుదిర్చుకుంది. ఏపీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ ఏడాది డిసెంబర్ 15 నాటికి 4జీ సేవల్ని అందుబాటులోకి తేవాలని భావిస్తోంది.
అలాగే ఈ సేవల్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కర్ణాటకలో, ఏప్రిల్ నాటికి రాజస్థాన్లో ప్రారంభించాలని చూస్తోంది. ‘దేశంలో ఇప్పటికే నాలుగు సర్కిళ్లలో 4జీ సేవల్ని ప్రారంభించాం. ఇప్పుడు ఈ సేవల్ని మరికొన్ని సర్కిళ్లలో ప్రారంభించాలని అనుకుంటున్నాం’ అని ఎయిర్టెల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అభయ్ సవర్గాంకర్ చెప్పారు. భారతీ ఎయిర్టెల్తో కలిసి భారత్లో తొలిసారి ఎఫ్డీడీ-ఎల్టీఈ టెక్నాలజీ 4జీ సేవల్ని ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందని నోకియా నెట్వర్క్స్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ గిరోత్రా అన్నారు.