పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
టీనగర్: ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. అరియలూరు జిల్లా, ఇళయపెరుమాల్‌నల్లూరు కాళియమ్మన్ కోవిల్ వీధికి చెందిన రామానుజం కుమార్తె ప్రియాంక (21). బీఏ పూర్తిచేసింది. గంగైకొండ చోళపురానికి చెందిన సంతోష్‌కుమార్ (25) లారీ డ్రైవర్. ఇరువురూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇలావుండగా ప్రియాంక తల్లిదండ్రులు వారి ప్రేమకు వ్యతిరేకత తెలిపారు. అంతేగాకుండా వేరొక చోట వరుని చూసి గత 20వ తేదీని నిశ్చయం చేశారు.
ఆవణి నెలలో వివాహం జరగాల్సి ఉంది. ఈ వివాహం ఇష్టం లేకపోవడంతో ప్రియాంక గత 11వ తేదీ ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రియుడు సంతోష్‌కుమార్‌తో అరియలూరు ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రేమజంట బుధవారం అరియలూరు ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఎస్పీకి ప్రియాంక ఇచ్చిన పిటిషన్లో ఈ విధంగా తెలిపారు.
తాను, సంతోష్‌కుమార్ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, తమ ప్రేమకు తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో ఆలయంలో వివాహమాడినట్లు తెలిపారు. సంతోష్‌కుమార్ తనను కిడ్నాప్ చేసినట్లు మీన్సురుట్టి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపింది. తన అత్త, బంధువులను విచారణ పేరుతో తీసుకువెళ్లి హింసిస్తున్నారని పేర్కొంది. అంతేగాకుండా తాము మీన్‌సురుట్టికి వెళితే హత్య చేస్తామని బెదిరిస్తున్నట్లు తెలిపింది. తమకు ప్రాణహాని ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రక్షణ కల్పించాలని ప్రాధేయపడింది.