ఫలితాల్లో ఫెడరల్ అదుర్స్
ప్రైవేట్ రంగంలో దిగ్గజ బ్యాంకు ఫెడరల్ బ్యాంకు లాభాల్లో మార్కెట్ విశ్లేషకులు అంచనాలను అధిగమించింది. శుక్రవారం ప్రకటించిన 2016-17 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాల్లో నికర లాభాలు 18.3శాతం జంప్ అయి, రూ.167.3 కోట్లగా నమోదయ్యాయి. 2015-16 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్లో ఈ లాభాలు రూ.141.4 కోట్లగా ఉన్నాయి. అదేవిధంగా నికర వడ్డీ ఆదాయంలో(అడ్వాన్సులపై వడ్డీ పొందటానికి, డిపాజిట్ లపై వడ్డీ చెల్లించడానికి తేడా) 15 శాతం ఎగిసి, ఏడాదికి ఏడాది రూ.693 కోట్లను ఆర్జించిందని కంపెనీ ప్రకటించిన ఫలితాల్లో పేర్కొంది. అయితే ఈ బ్యాంకు కేవలం రూ.156 కోట్ల నికరలాభాలను, రూ.680 కోట్ల నికర వడ్డీ ఆదాయాన్ని ఆర్జిస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంచనావేశారు.
అన్ని బ్యాంకులకు మాదిరిగా ఫెడరల్ బ్యాంకుకి కూడా కొంత నిరర్ధక ఆస్తుల బెడద తప్పలేదు. కానీ ఆస్తుల క్వాలిటీలో బ్యాంకు పట్టు సాధించినట్టు పేర్కొంది. జూన్ త్రైమాసికంలో స్థూల నిరర్ధక ఆస్తులు 5శాతం పెరిగి రూ.1,741 కోట్లను నమోదుచేశాయి. అదేవిధంగా నికర నిరర్థక ఆస్తులు సైతం మార్చి క్వార్టర్ తో పోలిస్తే ఈ క్వార్టర్ కు 0.98 శాతం పెరిగి రూ.1.68 శాతంగా నమోదయ్యాయి. ప్రొవిజన్లు 2016 జూన్ క్వార్టర్లో రూ.168.48కోట్లగా రికార్డు అయినట్టు కంపెనీ పేర్కొంది. 2015 జూన్ క్వార్టర్లో ఇవి రూ.153.10 కోట్లగా ఉన్నాయి. ఆస్తుల క్వాలిటీపై బ్యాంకు పట్టుసాధించినట్టు ప్రకటించడంతో, ఫెడలర్ బ్యాంకు షేర్లు ఒక్కసారిగా 5శాతం మేర జంప్ అయ్యాయి. ఫలితాల ప్రకటన అనంతరం ట్రేడింగ్ ముగిసే నాటికి బ్యాంకు షేరు 4.76 శాతం ఎగిసి, రూ.63.85గా నమోదైంది.