feeder channels
-
చెరువుల పునరుద్ధరణ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు నీటిపారుదల వ్యవస్థను అతలాకుతలం చేశాయి. ఆయకట్టు పొలాలకు సాగునీరందించే పలు చెరువులను పెద్దఎత్తున దెబ్బతీశాయి. కొన్నిచోట్ల చెరువు కట్టలకు గండ్లు పడగా.. మరికొన్ని చోట్ల ఫీడర్ ఛానళ్లు దెబ్బతినడంతో ఆయకట్టు ప్రాంతమంతా నీటిలో మునిగిపోయింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 63 చెరువులకు గండ్లు పడడంతో వేల హెక్టార్లలో పంట నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో చెరువుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ చెరువుల బాగుకు జిల్లా నీటిపారుదల విభాగం ప్రణాళికలు రూపొందించింది. అందుబాటులో ఉన్న నిధులతో దెబ్బతిన్న చెరువులకు తాత్కాలిక, శాశ్వత మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు మొదలుపెట్టింది. శాశ్వత మరమ్మతులకు రూ.4.03 కోట్లు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు గుర్తిం చిన 63 చెరువులకు మరమ్మతులు చేపట్టేందుకు రెండు రకాల ప్రణాళిక లు తయారుచేశారు. ఇందులో తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన మరమ్మతు లు చేపట్టేలా కార్యాచరణ రూపొం దించారు. 63 చెరువులకు తాత్కాలిక మరమ్మతుల నిమిత్తం రూ.43.58 లక్షలతో ప్రణాళిక తయారు చేయగా.. శాశ్వత పద్ధతిలో రూ.4.03 కోట్లతో పనులు నిర్ధారించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులతో ఈ పనులు చేపట్టాలని భావిస్తున్న అధికారులు స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని నిర్ణయించారు. ఈ చెరువులన్నీ పశ్చిమ ప్రాంతానికి చెందినవే. తూర్పు ప్రాంతంలో భారీ వర్షాలు నమోదు కాకపోవడంతో చెరువులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. చేజారిన ఆశలు.. వరద ప్రభావం కారణంగా చెరువులు దెబ్బతినడంతో రైతాంగం భారీగా నష్టపోయింది. ఈ చెరువుల నుంచి ఆయకట్టుకు నీరుపారే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ.. నిల్వ ఉన్న నీటితో భూగర్భ జలాలపై ఆందోళన ఉండేది కాదు. ఒకవైపు వర్షాలు తగ్గుముఖం పట్టగా.. మరోవైపు భారీ వరదలతో చెరువులకు గండ్లు పడడంతో నీరంతా లోతట్టుప్రాంతాలకు చేరింది. తాజాగా చెరువుల మరమ్మతులకు యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. కానీ ఇప్పటికే వరదనీరు ఇతర ప్రాంతాల పాలుకావడంతో తాజా రబీ సీజన్లో రైతులకు ఒరిగేదేమీలేదు. వాస్తవానికి వర్షాకాలానికి ముందే మరమ్మతులు చేయాల్సి ఉండగా.. అధికారుల ఉదాసీన వైఖరితో 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.4కోట్లు వెనక్కు వెళ్లిన సంగతి తెలిసిందే. -
‘పిల్ల కాల్వల’కు అనుమతి
వరంగల్, న్యూస్‌లైన్: బీడు భూములు సాగులోకి రానున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద జిల్లాలో మరో 9వేల హెక్టార్లలో సాగు పెరగనుంది. కొన్నేళ్లుగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న ఫైల్‌కు ఇటీవలే మోక్షం లభించింది. దీంతో పిల్ల కాల్వల(ఫీడర్ ఛానల్స్) నిర్మాణానికి అనుమతి వచ్చింది. ప్రధానంగా డోర్నకల్ సెగ్మెంట్లోని కరువుతో ఉన్న మండలాలకు ఎస్సారెస్పీ నీటిని అందించేందుకు పిల్లకాల్వల నిర్మాణానికి చాలా ఏళ్ల క్రితమే ప్రతిపాదనలు తయారు చేశారు. డీబీఎం-38 కింది నుంచి ఈ ప్రాంతానికి కాల్వలు తవ్వాలనే డిమాండ్ ఉంది. ఎట్టకేలకు డీబీఎం-38 పరిధిలో పిల్లకాల్వల నిర్మాణానికి నీటిపారుదల శాఖ ఒకే చెప్పింది. అయితే 9వేల హెక్టార్లకు ఎస్సారెస్పీ నీటిని అందించే విధంగా కాల్వల నిర్మాణానికి డిజైన్ చేశారు. దీంతో మరిపెడ, నర్సింహులపేట, డోర్నకల్, కురవి ప్రాంతాల్లోని బీడు భూములు సాగులోకి రానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రూ.4కోట్లతో ఎస్సారెస్పీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇవి ప్రస్తుతం నీటిపారుదల శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ముందుగా డీబీఎం-38 పరిధిలోని 26(ఆర్) పరిధిలో మూడు కాల్వలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాదాపు 21 కిలోమీటర్ల పరిధి మేరకు మూడు కాల్వలను నిర్మించాలని, ఒక్కో దానికి రూ.30లక్షల చొప్పున వెచ్చించేందుకు అనుమతి వచ్చిందని, వెంటనే పనులు ప్రారంభించి వచ్చే ఏడాది వరకు పిల్వకాల్వల ద్వారా నీటిని అందించాలని వరంగల్ సర్కిల్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పిల్ల కాల్వల నిర్మాణం, టెండర్లు, భూ సేకరణ తదితర అంశాలపై సోమవారం రాజధానిలో నీటిపారుదల శాఖ తెలంగాణ ప్రాంత కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులోనే మూడు కాల్వలకు అనుమతి జారీ చేశారు. అంతేకాక మరికొంత ఆయకట్టుకు నీరందించేందుకు మరిన్ని కాల్వల నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని, వాటి కోసం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, త్వరలో వాటికి కూడా నిధులు కేటాయించి అనుమతిస్తామని సమావేశంలో స్పష్టం చేశారు. అనుకున్న సమయంలో పిల్లకాల్వల నిర్మాణాలు పూర్తి చేస్తే.. ఎస్సారెస్పీ ఆయకట్టులో మరో 9వేల హెక్టార్లు చేరనున్నాయి. ఇన్ని రోజులు నీళ్లు లేక బీడుగా ఉన్న భూములు పంట పొలాలతో కళకళలాడనున్నాయి.