వరంగల్, న్యూస్‌లైన్: బీడు భూములు సాగులోకి రానున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద జిల్లాలో మరో 9వేల హెక్టార్లలో సాగు పెరగనుంది. కొన్నేళ్లుగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న ఫైల్‌కు ఇటీవలే మోక్షం లభించింది. దీంతో పిల్ల కాల్వల(ఫీడర్ ఛానల్స్) నిర్మాణానికి అనుమతి వచ్చింది. ప్రధానంగా డోర్నకల్ సెగ్మెంట్‌లోని కరువుతో ఉన్న మండలాలకు ఎస్సారెస్పీ నీటిని అందించేందుకు పిల్లకాల్వల నిర్మాణానికి చాలా ఏళ్ల క్రితమే ప్రతిపాదనలు తయారు చేశారు. డీబీఎం-38 కింది నుంచి ఈ ప్రాంతానికి కాల్వలు తవ్వాలనే డిమాండ్ ఉంది. ఎట్టకేలకు డీబీఎం-38 పరిధిలో పిల్లకాల్వల నిర్మాణానికి నీటిపారుదల శాఖ ఒకే చెప్పింది. అయితే 9వేల హెక్టార్లకు ఎస్సారెస్పీ నీటిని అందించే విధంగా కాల్వల నిర్మాణానికి డిజైన్ చేశారు. దీంతో మరిపెడ, నర్సింహులపేట, డోర్నకల్, కురవి ప్రాంతాల్లోని బీడు భూములు సాగులోకి రానున్నాయి.
దీనికి సంబంధించి ఇప్పటికే రూ.4కోట్లతో ఎస్సారెస్పీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇవి ప్రస్తుతం నీటిపారుదల శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ముందుగా డీబీఎం-38 పరిధిలోని 26(ఆర్) పరిధిలో మూడు కాల్వలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాదాపు 21 కిలోమీటర్ల పరిధి మేరకు మూడు కాల్వలను నిర్మించాలని, ఒక్కో దానికి రూ.30లక్షల చొప్పున వెచ్చించేందుకు అనుమతి వచ్చిందని, వెంటనే పనులు ప్రారంభించి వచ్చే ఏడాది వరకు పిల్వకాల్వల ద్వారా నీటిని అందించాలని వరంగల్ సర్కిల్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పిల్ల కాల్వల నిర్మాణం, టెండర్లు, భూ సేకరణ తదితర అంశాలపై సోమవారం రాజధానిలో నీటిపారుదల శాఖ తెలంగాణ ప్రాంత కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులోనే మూడు కాల్వలకు అనుమతి జారీ చేశారు.
అంతేకాక మరికొంత ఆయకట్టుకు నీరందించేందుకు మరిన్ని కాల్వల నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని, వాటి కోసం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, త్వరలో వాటికి కూడా నిధులు కేటాయించి అనుమతిస్తామని సమావేశంలో స్పష్టం చేశారు. అనుకున్న సమయంలో పిల్లకాల్వల నిర్మాణాలు పూర్తి చేస్తే.. ఎస్సారెస్పీ ఆయకట్టులో మరో 9వేల హెక్టార్లు చేరనున్నాయి. ఇన్ని రోజులు నీళ్లు లేక బీడుగా ఉన్న భూములు పంట పొలాలతో కళకళలాడనున్నాయి.
‘పిల్ల కాల్వల’కు అనుమతి
Published Tue, Dec 31 2013 4:48 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
Advertisement
Advertisement