సైకిల్‌తో వేటాడి తగిన బుద్ధి చెప్పింది
లండన్: సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. అల్లరి చేయాలని, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడాలని ప్రయత్నించిన కొంతమంది పురుషులకు ఓ యువతి తగిన బుద్ధి చెప్పింది. పట్టరాని కోపంతో వారిని ఫాలో అయ్యి మరి తన కసి తీర్చుకొని వెళ్లిపోయింది. ఈ వీడియో లండన్‌లోని గో ప్రో కెమెరాలో రికార్డు చేశారు. ఓ బైకర్ తాను రైడింగ్ చేస్తూ వెళుతుండగా తన కళ్లముందు చోటు చేసుకున్న ఈ దృశ్యాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టగా ఇప్పుడది దుమ్మురేపుతుంది. దీన్ని చూసినవారంతా అమ్మాయి అంటే ఇలా ధైర్యంగా ఉండాలి అని అనుకుంటున్నారు.
ఈ వీడియోలో రికార్డయిన ప్రకారం.. ఓ అమ్మాయి సైకిల్ పై వెళుతుండగా వ్యాన్‌లో వెళుతున్న కొంతమంది ఆమెను చూసి కామెంట్లు చేశారు. అవేవీ పట్టించుకోకుండా ముందుకెళ్లిన ఆమె ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగింది. ఆ వ్యాన్ కూడా ఆమెతోపాటు అక్కడే గ్రీన్ సిగ్నల్ కోసం ఆగిన సందర్భంలో వారు దుశ్చేష్టలు ఆపలేదు.. తమ ఫోన్ నెంబర్ తీసుకోవాలని, లేదంటే ఆమె ఫోన్ నెంబర్ ఇవ్వాలని విసిగించారు. అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించారు.
ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ పడగానే ముందుకు కదిలారు. కానీ, వారిని విడిచిపెట్టకూడదని భావించిన ఆ యువతి వ్యాన్‌తోపాటు వేగంగా సైకిల్ తొక్కి ఓ చోట ఆగిన వ్యాన్ వద్దకు వెళ్లి దాని సైడ్ మిర్రర్‌ను విరిచి నేలకేసి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి గట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియోను లక్షలమంది చూశారు.