జ్ఞాపకాల గని
ఆ తరం ఈ తరం అనే తేడా లేకుండా అన్ని తరాలకు స్ఫూర్తినిచ్చే పేరు... రాజేశ్వరి ఛటర్జీ(Rajeshwari Chatterjee). కర్నాటక తొలి తరం మహిళా ఇంజినీర్(woman engineer)గా చరిత్రలో నిలిచిన రాజేశ్వరి ఆనాటి కుటుంబ పరిమితులు, కాలపరిమితులు అధిగమించి పెద్ద చదువులు చదువుకుంది. ఆమె చరిత్ర అంటే... మన దేశంలో కంప్యూటర్ సాంకేతికత తొలి తరం చరిత్ర. అనేకానేక పరిమితులు అధిగమించి విద్యాఉద్యోగాల్లో రాణిస్తూ తమను తాము నిరూపించుకున్న మహిళల చరిత్ర.ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఐఐఎస్సీ, బెంగళూరు) చైర్‌పర్సన్‌గా పదవీ విరమణ చేసిన తరువాత రాజేశ్వరి ఎప్పుడూ ఖాళీగా కూర్చోలేదు. విశ్రాంత జీవితంలోనూ విలువైన పనులెన్నో చేసింది. ఆర్కైవ్లకు ఉపయోగపడే పనులెన్నో చేసింది.‘ఆర్కైవ్ తొలినాళ్లలో ఆమె స్వచ్ఛందంగా సహాయం చేసింది. తన సహోద్యోగులు, విద్యార్థుల గురించి తెలుసుకోవడానికి మాకు సహాయపడింది. ఎన్నో వ్యక్తిగత ఫోటోలు సేకరించి ఆర్కైవ్కు బహుమతిగా ఇచ్చింది’ అని గుర్తు చేసుకున్నారు ఐఐఎస్సీ ఆర్కైవ్ అండ్ పబ్లికేషన్స్ సెల్ మాజీ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ శరత్ అహుజా.బెంగళూరులోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్’లో మొదటి మహిళా ఇంజినీర్‌గా చరిత్రలో నిలిచిన రాజేశ్వరి ఛటర్జీ అత్యంత క్లిష్టమైన పనిని చేపట్టింది. ఐఐఎస్సీ శతాబ్దపు సుదీర్ఘ ప్రయాణానికి గుర్తుగా ఆర్కైవల్ కలెక్షన్‌తోపాటు పూర్వవిద్యార్థుల పుస్తకాన్ని సంకలనం చేసింది.కంప్యూటర్ల హవా, ఇంటర్నెట్ ఊసులేని కాలంలోనే ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి తెలుసుకోవడం ద్వారా తన కాలానికి సంబంధించిన పరిమితులు అధిగమించింది.‘1949లో సెలవుల్లో ఎంఐటీకి వెళ్లినప్పుడు విశాలమైన గదుల్లో ఉంచిన తొలితరం కంప్యూటర్లలో ఒకదాన్ని చూశాను. మీ అరచేతిలో పట్టుకోగలిగే ఆధునిక లాప్టాప్లుప్రారంభరోజుల్లోని ఆ భారీ కంప్యూటర్ల కంటే ఎక్కువ పని చేయగలవని ఊహించగలరా?’ అని ఐఐఎస్సీ పూర్వ విద్యార్థుల పుస్తకంలో రాసింది. పీహెచ్డీ చేయాలనే రాజేశ్వరి కల రెండోప్రపంచ యుద్ధంతో భగ్నం అయింది. అయినప్పటికీ ఆమె తన ఆకాంక్షను వదులుకోలేదు. పరిశోధనను కొనసాగించడానికి ప్రత్యామ్నాయాలను అన్వేషించింది. భౌతిక, వాతావరణ శాస్త్రవేత్త అన్నామణి, రసాయన శాస్త్రవేత్త రోషన్ ఇరానీల తర్వాత ఐఐఎస్సీ నుంచి స్కాలర్షిప్ పొందిన మూడో మహిళగా ఛటర్జీ గుర్తింపు పొందింది.