Female police officers
-
ఫస్ట్ ఉమన్.. డేరింగ్ అండ్ కేరింగ్ ఆఫీసర్
అస్సాం తొలి మహిళా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలిస్ (ఐజీ) గా వయొలెట్ బారువాకు ప్రభుత్వం పదోన్నతి కల్పించిన తరువాత ఆమె ట్విట్టర్ పేజీలో అభినందనలు వెల్లువెత్తాయి. వాటిలో కొన్ని... ‘ఈ పదవికి మీకంటే అర్హులైన వారు లేరు’ ‘మీ విజయం ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇస్తుంది’ ‘అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు’ ‘ఐపీయస్ చేయాలనేది నా కోరిక. మీ ఆశీర్వాదం, సలహాలు కావాలి. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను’ అస్సాంలో వరదలు ఎంత సహజమో, అల్లర్లు అంతే సహజం. వరదలకైనా టైమ్ ఉంటుందేమోగానీ, అల్లర్లు మాత్రం... అన్ని కాలాల్లోనూ ఉంటాయి. అలాంటి చోట పోలిసు ఉద్యోగం చేయడం అనేది కత్తులవంతెన మీద ప్రయాణం చేయడమంత కష్టం. అయితే డియస్పీ, ఎస్పీ, డిఐజీగా రకరకాల హోదాల్లో పనిచేసిన బారువా మాత్రం తాను రిస్క్ జాబ్ చేస్తున్నానని ఎప్పుడూ అనుకోలేదు. ఒకవేళ అలా అనుకోని ఆగిపోయి ఉంటే చారిత్రక గుర్తింపుకు నోచుకొని ఉండేవారు కాదమో! వయొలెట్ బారువా....‘బ్యూటిఫుల్ నేమ్’ అంటారు ఆమె సన్నిహితులు. వర్ణశాస్త్రం ప్రకారం వయొలెట్ కలర్‌ను జ్ఞానానికి, సున్నితత్వానికి ప్రతీకగా చెబుతారు. ‘సాహసం’ అనే మరో ప్రతీకను కూడా చేర్చారు బారువా. గౌహతి యూనివర్శిటీ నుంచి బాచ్లర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ తీసుకున్నారు బారువా. యూనివర్శిటీ రోజుల్లో కూడా చదువు ఎంత ముఖ్యమో, సమాజం కూడా అంతే ముఖ్యం అనుకునేవారు. తాను వెళ్లే దారిలో ఎక్కడైనా గొడవ జరిగితే సర్దిచెప్పడం, ఆకతాయిల పని పట్టడం జరిగేది. గౌలపర, మోరిగన్, కచర్,బర్పెట జిల్లాల్లో ఎస్పీగా విధులు నిర్వహించడమంటే మాటలు కాదు. కేవలం తూటాలు, లాఠీలను నమ్ముకుంటే మాత్రమే సరిపోదు. తెలివి ఉపయోగించాలి. అల్లర్లకు అడ్రస్ అయిన ఆ నాలుగు జిల్లాల్లో శాంతిభద్రతలను పరిరక్షించడంలో బారువా విజయం సాధించారు. సీబిఐ విభాగంలోనూ తన సత్తా చాటారు. నేరపరిశోధనలో, నేరాలను అదుపులో పెట్టడంలో తనదైన ముద్ర వేసిన బారువా ఇలా అంటున్నారు... ‘నా కెరీర్లో ఏ పోస్టింగ్, టాస్క్‌కు ఇబ్బంది పడలేదు. నో చెప్పలేదు. గౌహతి పోలిస్ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేయడం కంటే మారుమూల ప్రాంతాలలో పనిచేయడానికే ఆసక్తి చూపాను’ బారువా ఏ ప్రాంతంలో పనిచేసినా ‘పోలిస్ ఆఫీసర్’తో పాటు ‘కేరింగ్ ఆఫీసర్’ అని అభిమానంగా పిలుచుకుంటారు ప్రజలు. అస్సాం పోలిస్‌శాఖలో మహిళల సంఖ్య చాలా తక్కువ. అయితే అస్సాం తొలి మహిళా డీఎస్పీ, తొలి మహిళా డీఐజీ, తొలి ఐజీ అయిన బారువా స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు పోలిస్‌శాఖలో పనిచేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. బారువా సాధించించిన మరో మహత్తరమైన విజయమిది! -
రక్షణ కోరిన ప్రేమజంట
నెల్లూరు(క్రైమ్) : ప్రేమించి పెళ్లిచేసుకున్నాం.. రక్షణ కల్పించండి అని ఓ ప్రేమజంట మంగళవారం రాత్రి మహిళా పోలీసులను ఆశ్రయించింది. వివరాలు.. కావలికి చెందిన మనూష ఆమె మేనమామ చంటిలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలో వారి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో ఇద్దరూ ఇంట్లో నుంచి రెండురోజుల క్రితం పారిపోయి బుజబుజనెల్లూరు తల్పగిరికాలనీలోని దేవాలయంలో వివాహం చేసుకున్నారు. మంగళవారం రాత్రి తమ తల్లిదండ్రుల నుంచి ప్రమాదం ఉందని రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఇరువర్గాల పెద్దలకు ఫోనుచేసి దంపతులకు హాని కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ప్రేమజంటను కావలి పోలీసులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. -
మహిళా పోలీసులు 3 శాతమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగంలో మహిళల శాతం అంతంత మాత్రంగానే ఉంది. మొత్తం 63వేల మంది పోలీసు సిబ్బందిలో మహిళలు కేవలం 1,973 మందే ఉన్నారు. అంటే మూడు శాతం మాత్రమే. ఉన్న కొద్ది మందిలో కానిస్టేబుళ్లే అధికం. వీరిలో చాలా మంది ఫిట్నెస్ లోపంతో పూర్తి స్థాయిలో సేవలు అందించలేకపోతున్నారు. మహిళా పోలీసు అధికారులు తగిన విధంగా లేకపోవడంతో మహిళా పోలీసు స్టేషన్లకు కూడా ఎస్‌హెచ్‌వో (స్టేషన్ హెడ్ ఆఫీసర్)గా పురుషులే ఉండాల్సి వస్తోంది. దీంతో మహిళలు తమ సమస్యలను పూర్తిగా చెప్పుకోలేకపోతున్నారు. అంతేకాదు ధర్నాలు, రాస్తారోకోలు జరిగినప్పుడు మహిళలను అదుపు చేయాల్సిన సమయంలో తగిన సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం అధీనంలోని బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్డీ) రాష్ట్రంలో మహిళా సిబ్బంది నియామక చర్యలను తప్పుపట్టింది. పోలీసు రిక్రూట్మెంట్లో కచ్చితంగా 33శాతం రిజర్వేషన్లు పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఫలితంగా పోలీసు విభాగంలో మహిళా ఫోర్స్‌ను పెంచడం కోసం ప్రస్తుత సివిల్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో 33శాతం రిజర్వేషన్లను పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసి అందుకు అనుగుణంగా నియామకాల ప్రక్రియ చేపట్టారు. ఇన్స్పెక్టర్లు 32 మందే! రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 80 సబ్ డివిజన్లు, 898 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మహిళా ఇన్స్పెక్టర్లు మాత్రం 32 మంది మాత్రమే ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలను మినహాయిస్తే మిగతా అన్ని జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మాత్రమే ఇన్స్పెక్టర్లు ఉన్నారు. ఇక ఎస్సైలు కూడా అంతే. జంట కమిషనరేట్లను మినహాయిస్తే అన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ప్రత్యేక బెటాలియన్‌కు కృషి ప్రస్తుతం ఉన్న మహిళా సిబ్బందినీ ఫిట్నెస్ సమస్య వెంటాడుతోంది. స్థూలకాయం, నిత్య వ్యాయామం లేకపోవడంతో కార్యాలయాలకు పరిమితం కావడంతో ఆందోళనకారులను అదుపు చేసే పరిస్థితి ఉండటంలేదు. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు తమిళనాడు తరహాలో మహిళా ప్రత్యేక విభాగం ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. తమిళనాడులో ప్రత్యేకంగా ఒక మహిళా బెటాలియన్‌తో కమాండ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.