మహిళా పోలీసులు 3 శాతమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగంలో మహిళల శాతం అంతంత మాత్రంగానే ఉంది. మొత్తం 63వేల మంది పోలీసు సిబ్బందిలో మహిళలు కేవలం 1,973 మందే ఉన్నారు. అంటే మూడు శాతం మాత్రమే. ఉన్న కొద్ది మందిలో కానిస్టేబుళ్లే అధికం. వీరిలో చాలా మంది ఫిట్‌నెస్ లోపంతో పూర్తి స్థాయిలో సేవలు అందించలేకపోతున్నారు. మహిళా పోలీసు అధికారులు తగిన విధంగా లేకపోవడంతో మహిళా పోలీసు స్టేషన్లకు కూడా ఎస్‌హెచ్‌వో (స్టేషన్ హెడ్ ఆఫీసర్)గా పురుషులే ఉండాల్సి వస్తోంది. దీంతో మహిళలు తమ సమస్యలను పూర్తిగా చెప్పుకోలేకపోతున్నారు.
అంతేకాదు ధర్నాలు, రాస్తారోకోలు జరిగినప్పుడు మహిళలను అదుపు చేయాల్సిన సమయంలో తగిన సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం అధీనంలోని బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బీపీఆర్‌డీ) రాష్ట్రంలో మహిళా సిబ్బంది నియామక చర్యలను తప్పుపట్టింది. పోలీసు రిక్రూట్‌మెంట్‌లో కచ్చితంగా 33శాతం రిజర్వేషన్లు పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఫలితంగా పోలీసు విభాగంలో మహిళా ఫోర్స్‌ను పెంచడం కోసం ప్రస్తుత సివిల్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో 33శాతం రిజర్వేషన్లను పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసి అందుకు అనుగుణంగా నియామకాల ప్రక్రియ చేపట్టారు.
ఇన్‌స్పెక్టర్లు 32 మందే!
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 80 సబ్ డివిజన్లు, 898 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మహిళా ఇన్‌స్పెక్టర్లు మాత్రం 32 మంది మాత్రమే ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలను మినహాయిస్తే మిగతా అన్ని జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మాత్రమే ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. ఇక ఎస్సైలు కూడా అంతే. జంట కమిషనరేట్లను మినహాయిస్తే అన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
ప్రత్యేక బెటాలియన్‌కు కృషి
ప్రస్తుతం ఉన్న మహిళా సిబ్బందినీ ఫిట్‌నెస్ సమస్య వెంటాడుతోంది. స్థూలకాయం, నిత్య వ్యాయామం లేకపోవడంతో కార్యాలయాలకు పరిమితం కావడంతో ఆందోళనకారులను అదుపు చేసే పరిస్థితి ఉండటంలేదు. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు తమిళనాడు తరహాలో మహిళా ప్రత్యేక విభాగం ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. తమిళనాడులో ప్రత్యేకంగా ఒక మహిళా బెటాలియన్‌తో కమాండ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.