మహిళా సంరక్షణ కార్యదర్శులపై అసెంబ్లీ చర్చలో హోం మంత్రి అనిత వ్యాఖ్యలు
ఎంటీఎస్ టీచర్లకు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఉండవన్న మంత్రి లోకేశ్
సాక్షి, అమరావతి: పోలీస్ శాఖలోకి మహిళలు రావడానికి వారి కుటుంబాలు అంగీకరించడం లేదని హోం మంత్రి వంగలపూడి అనిత గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అనిత సమాధానమిస్తూ.. గత ప్రభుత్వంలో మహిళా సంరక్షణ కార్యదర్శులతో పోలీస్ డ్రెస్ కూడా వేయించాలని చూశారన్నారు. దానిపై కొందరు న్యాయస్థానాల్ని ఆశ్రయించారని చెప్పారు. వారిని ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై చర్చిస్తున్నామన్నారు.
మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీస్ శాఖలో కొనసాగిస్తారా, మహిళా, శిశు సంక్షేమ శాఖలో కొసాగిస్తారా అనేది ప్రభుత్వం చెప్పాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. ఈ అంశంపై ప్రభుత్వానికే అవగాహన లేకపోవడం వల్ల వారంతా మానసిక క్షోభకు గురవుతున్నారని చెప్పారు.
విశాఖ మెట్రో ఎప్పుడు
చింతలపూడి ఎత్తిపోతల సాగునీటి పథకం పనులు 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. త్వరగా పూర్తిచేయండని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు.
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారని ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, వెలగపూడి రామకృష్ణ, గణబాబు, విష్ణుకుమార్‌రాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో ఎర్రకాలువ వరద వల్ల రైతులకు ఏటా నష్టం వాటిల్లుతోందని.. మరమ్మతులకు కనీసం రూ.50 కోట్లు కేటాయించమని అడిగితే ఇవ్వలేదని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు అన్నారు.
ఎంటీఎస్ టీచర్లకు రిటైర్‌మెంట్ ప్రయోజనాలు వర్తించవు
మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) ప్రాతిపదికన గత ప్రభుత్వం 3,939 టీచర్ పోస్టులను భర్తీ చేసిందని విద్యా శాఖ మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. మిగిలిన 600 పోస్టుల భర్తీకి చర్చిస్తామన్నారు. ఎంటీఎస్ టీచర్లకు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఉండవన్నారు.
వచ్చే రెండేళ్లలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని పూర్తి చేస్తామని బుచ్చయ్య చౌదరి ప్రశ్నకు సమాధానంగా మంత్రి లోకేశ్ తెలిపారు. గత ప్రభుత్వంలో హజ్ యాత్రికుల ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఇచ్చేవారని.. అదేవిధంగా ఈ ప్రభుత్వంలోనూ ఇవ్వాలని ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ అహ్మర్ కోరారు.
‘సాక్షి’పై అక్కసు
అసెంబ్లీ వేదికగా మరోసారి సాక్షి పత్రికపై జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నోరుపారేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ కరపత్రిక, అవినీతి పత్రిక అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సిగరెట్ ప్యాకెట్ మీద పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని రాస్తున్నట్టు.. సాక్షి పత్రిక చదవడం ఆరోగ్యానికి హానికరం అని మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment