వచ్చే ఏడాది వేతనాల వృద్ధి అంతంతే..!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది వేతన వృద్ధి సగటున 10 శాతంగా ఉండొచ్చని ఉద్యోగులు అంచనా వేస్తున్నారు. ఇక ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ వృద్ధి 4.8 శాతంగా ఉంటుంది. కార్న్ ఫెర్రీ హే గ్రూప్ తన ‘వేతన అంచనాలు-2017’ అనే నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ‘భారత్‌లో జీతాల పెంపు ఇతర దేశాల కన్నా ఎక్కువ స్థారుులోనే ఉంది. వచ్చే రెండేళ్లలో వేతన వృద్ధి 9.5-10.5 శాతం మధ్యలో ఉండొచ్చు’ అని కెర్న్ ఫెరీ హే గ్రూప్ కంట్రీ మేనేజర్ (ప్రొడక్ట్ సర్వీసెస్) అమీర్ హలీమ్ తెలిపారు.
2017లో ఆసియా ప్రాంతంలో జీతాల పెంపు 6.1 శాతంగా ఉండొచ్చని, ఇది గతేడాదితో పోలిస్తే 0.3 శాతం తక్కువని తెలిపారు. అదే ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే వేతన పెరుగుదల 4.3 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకొని వచ్చే ఏడాది అంతర్జాతీయంగా జీతాల పెంపు ఏ విధంగా ఉందో పరిశీలిస్తే.. వియత్నంలో 7.2 శాతంగా, థాయ్‌లాండ్‌లో 5.6 శాతంగా, ఇండోనేసియాలో 4.9 శాతంగా, యూకేలో 1.9 శాతంగా ఉంటుందని వివరించారు.