సూక్ష్మంగా వాడుకుంటేనే మన్నిక
అనంతపురం అగ్రికల్చర్: బిందు (డ్రిప్), తుంపర (స్ప్రింక్లర్లు)లాంటి సూక్ష్మసేద్య పరికరాలు చాలా కాలంపాటు పనిచేయాలంటే వాటిని ఎలా వాడాలో ముందుగా తెలుసుకోవాలని ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఏపీడీలు ఆర్.విజయశంకరరెడ్డి, జి.చంద్రశేఖర్ తెలిపారు. వర్షాభావం కారణంగా ‘అనంత’ లాంటి జిల్లాలో రోజురోజుకూ భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని.. నీటి విలువ తెలుసుకొని, డ్రిప్ యూనిట్ల ద్వారా క్రమ పద్ధతిలో పంటలు సాగు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
డ్రిప్ వాడకం ఇలా :
డ్రిప్ యూనిట్లు అమర్చుకున్న రైతులు ఆటో స్టార్ట్ పెట్టుకోకూడదు. 1.5 రేంజ్లో డ్రిప్ ప్రెషర్ మెయింటెయిన్ చేయాలి. వాల్వులు ఒకేసారి ఓపెన్ చేయరాదు. ప్రెషర్ మెయింటెయిన్ చేయడం వల్ల లవణాలు, మలినాలు క్లీన్ అవుతాయి. ఫ్లష్వాల్వులను వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. లేదంటే లవణాలు పేరుకుపోయి రంధ్రాలు పూడిపోతాయి. లాటరల్‌లు నెలకోసారి క్లీన్ చేసుకోవాలి. లేదంటే మలినాలు డ్రిప్పర్ల దగ్గర పేరుకుపోతాయి. ఫిల్టర్ లోపల ఉండే జల్లెడను వారానికి ఒకసారి క్లీన్ చేయాలి. కొన్ని ప్రాంతాల్లో బోర్ల నుంచి ఇసుక రావడం జరుగుతుంది. అలాంటి ప్రాంతాల్లో రైతులు హైడ్రో సైక్లోన్ ఫిల్టర్ వాడాలి. డ్రిప్ ద్వారా ఎరువులు (ఫర్టిగేషన్) వాడే సమయంలో మోటార్ ఆఫ్ చేసే 15 నిమిషాల ముందు ఎరువులు వదలాలి. ముందుగా ఎరువులు వదిలితే పోషకాలు మొక్కల వేరు వ్యవస్థ కన్నా కిందకు వెళ్లిపోతాయి.
యాసిడ్ ట్రీట్మెంట్ :
ఉప్పులవణాలతో కూడిన నీరు పైపుల ద్వారా ప్రవహించడం వల్ల లేటరల్, డ్రిప్పర్లు మూసుకొని పోతాయి. ఇందుకు హైడ్రోక్లోరిక్ ఆమ్లం (హెచ్‌సీఎల్)తో యాసిడ్ ట్రీట్మెంట్ æ(ఆమ్లచికిత్స) మూడు లేదా ఆరు నెలలకోసారి చేసుకోవాలి. యాసిడ్ ట్రీట్మెంట్ చేసేముందు మొదటగా ఫిల్టర్లను, పీవీసీ పైపులను, లేటరల్ పైపులను శుభ్రం చేసుకోవాలి. నిర్ణయించిన ఆమ్ల పరిమాణమును సరైన మోతాదులో నీటిని కలుపుకొని ఆమ్లద్రావణాన్ని తయారు చేసుకుని ఫర్టిలైజర్ ట్యాంకు లేదా ప్లాస్టిక్ బకెట్లో పోసుకొని వెంచురీ ద్వారా డ్రిప్ యూనిట్లోకి పంపించాలి. లేటరల్ చివర ఆమ్ల ద్రావణాన్ని నీటితో పాటు సబ్‌మెయిన్ లేదా లేటరల్, డ్రిప్పర్లలోకి చేరిన నీటిని పీ.హెచ్ పే పరుతో ముంచి పీ.హెచ్‌ను 4 రీడింగ్ ఉండేటట్లు చూసుకోవాలి.
టోల్‌ఫ్రీ:
డ్రిప్, స్ప్రింక్లర్లకు సంబంధించి రైతులు ఏవైనా సమస్యలున్నా, ఫర్టిగేషన్, మన్నిక, యాసిడ్ ట్రీట్మెంట్, విడిభాగాలు కావాలన్నా, ఇతరత్రా ఎలాంటి సమాచారం అవసరం ఉన్నా టోల్‌ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలి. 1800 425 2960 నంబర్‌కు (ఉచితంగా) ఫోన్ చేసి సమాచారం, సమస్య, సలహాలు పొందవచ్చు. డ్రిప్ యూనిట్ల సరఫరా చేసే కంపెనీలు రైతుల పొలాల్లో అమర్చిన తరువాత తమ పని అయిపోయిందనుకోకూడదు. కనీసం ఐదేళ్ల పాటు ఉచితంగా సర్వీసు ఇవ్వాలి. పెద్ద పెద్ద కంపెనీలు నెలకు 8, చిన్న కంపెనీలు ఐదు చొప్పున రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, డ్రిప్ యూనిట్ల మన్నిక, ఫర్టిగేషన్, యాసిడ్ ట్రీట్మెంట్, డ్రిప్ నిర్వహణ గురించి రైతులకు తెలియజేయాలి. ప్రతి కంపెనీ తప్పనిసరిగా సర్వీసు సెంటరు, అక్కడ అన్ని రకాల విడిభాగాలు, అగ్రానమిస్టు ఉండేలా చర్యలు తీసుకోవాలి.