డెంగీకి రూ. 2 లక్షలు!
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్ల క్రితం వరకు కరోనా బాధితులను పీల్చిపిప్పి చేసిన అనేక ప్రైవేట్ ఆసుపత్రులు... ఇప్పుడు డెంగీ రోగులను దోచుకుంటున్నాయి. ప్లేట్లెట్లు అవసరం లేకపోయినా ఎక్కిస్తూ డబ్బులు గుంజుతున్నాయి. ప్లేట్లెట్ సంఖ్యను కూడా తప్పుగా చూపిస్తూ బాధితులను ఏమార్చుతున్నాయి. దీంతో బాధితులు అప్పుసప్పూ చేసి అడిగినంత ఫీజులు చెల్లిస్తున్నారు. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని గతంలో వాట్సాప్ నంబర్ ఇచ్చారు. కానీ ఇప్పుడు అలాంటి చర్యలేమీ చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ కింద డెంగీ, చికున్‌గున్యా వంటి వాటికి తెల్ల రేషన్‌కార్డుదారులకు, ఆరోగ్యశ్రీ కార్డుదారులకు ఉచిత వైద్యం అందించాలి. కానీ ప్రభుత్వం దాన్ని కేవలం సర్కారు ఆసుపత్రులకే పరిమితం చేసింది. దీనివల్ల బాధితులకు ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోని డెంగీ, చికున్‌గున్యా కేసులకు ఆరోగ్యశ్రీని వర్తింపచేయకపోవడం వల్ల బాధితులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ డెంగీకి ఆరోగ్యశ్రీని వర్తింప చేయొచ్చని, అది తమ చేతుల్లో లేదని ఆరోగ్యశ్రీ వర్గాలు చెప్పాయి. హడలిపోతున్న జనం రాష్ట్రంలో సాధారణ జ్వరం వస్తేనే ప్రజలు హడలి పోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరం రాగానే డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్ పరీక్షలన్నీ చేయించుకుంటున్నారు. ఈసారి అత్యధికంగా కేసులు నమోదవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 3,357 డెంగీ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 1,276 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అధికంగా మేడ్చల్ జిల్లాలో 312, ఖమ్మం జిల్లాలో 305 డెంగీ కేసులు రికార్డు అయ్యాయి. అనేక ప్రైవేటు ఆసుపత్రులు 50 వేలకు పైగా ప్లేట్లెట్లు ఉన్నా ఐసీయూలో ఉంచి అదనంగా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. నాలు గైదు రోజులు ఉంచుకొని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు కూడా ఫీజులు వసూలు చేసిన ఉదంతాలున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా చికున్‌గున్యా కేసులు 75, మలేరియా కేసులు 175 నమోదయ్యాయి. ఆయా జిల్లాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో నమోదయ్యే డెంగీ, చికున్ గున్యా కేసుల వివరాలను సంబంధిత యాజమాన్యాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు పంపడం లేదు. మరోవైపు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆదిలాబాద్ ప్రాంతంలో జికా వైరస్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. వివిధ జిల్లాల్లో పరిస్థితి ఇలా... ⇒ హైదరాబాద్ పరిధిలోని ఆసుపత్రులపై పేషెంట్ల లోడ్ పెరిగింది. ఇన్పేòట్లలోనూ 20 శాతం పెరిగారని డాక్టర్లు చెబుతున్నారు. గాం«దీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రులకు రద్దీ ఎక్కువైంది. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో వైద్యుల కొరత పట్టిపీడిస్తోంది. ఆదిలాబాద్, ఉట్నూరు, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో వైద్యులు పని చేసేందుకు విముఖత చూపుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో 44 మంది వైద్యులకుగాను 24 మందే ఉన్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో పది మంది వైద్యులు ఉండాల్సిన చోట ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ఆ వైద్యుడు సైతం డిప్యూటేషన్‌పై ఉన్నారు. ⇒ కరీంనగర్ జిల్లాలో జూలై మొదటి వారం నుంచే ఇంటింటి జ్వర సర్వే చేస్తున్నారు. 7,24,135 మందిని సర్వే చేశారు. ఇందులో 3,711 మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ⇒ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ఏడాది 115 డెంగీ కేసులు నమోదయ్యాయి. 25 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. ⇒ ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్లు కూడా సరిపోని పరిస్థితి. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా కేసులతో ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే బాధితులను యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయి. చిన్న పిల్లలైతే రోజుకు రూ.5 వేల నుంచి 10 వేల వరకు, పెద్దలకు రోజుకు రూ.10 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. ⇒ సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెంగీ చికిత్సకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. సీరియస్ కేసుల్లోనే అధిక ఫీజుగతేడాది కంటే డెంగీ, చికున్‌గున్యా వంటి వైరల్ జ్వరాలు పెరిగాయి. దీంతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య కూడా ఆ స్థాయిలోనే ఉంటోంది. డెంగీలో ప్లేట్లెట్లు పడిపోయినప్పుడు వాటిని ఎక్కించాల్సి ఉంటుంది. అలాగే డెంగీ సీరియస్‌గా మారి ఇతర అవయవాలపై ప్రభావం చూపినప్పుడు వైద్యం చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మాత్రమే అధిక ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.. అంతే తప్ప సాధారణ డెంగీకి సాధారణ ఫీజే చెల్లిస్తే సరిపోతుంది. ప్లేట్లెట్ కౌంట్ 30 వేల కంటే తక్కువైతేనే వాటిని ఎక్కించాల్సి ఉంటుంది. – డాక్టర్ కృష్ణ ప్రభాకర్, టీఎక్స్ ఆసుపత్రి, హైదరాబాద్