ficky
-
దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేయాలి
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేయాలని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ప్రతిపాదించింది. ఎకానమీని మళ్లీ పట్టాలెక్కించే దిశగా.. ముందుగా 22–39 ఏళ్ల మధ్య ఆరోగ్యంగా ఉన్నవారు విధులకు హాజరయ్యేలా అనుమతించాలని సూచించింది. అలాగే, చిన్న.. మధ్య స్థాయి సంస్థలకు తోడ్పాటునివ్వాలని, వైరస్ పరీక్షా కేంద్రాలను మరింతగా పెంచాలని పేర్కొంది. లాక్డౌన్ నుంచి బైటపడాల్సిన వ్యూహానికి సంబంధించి రూపొందించిన నోట్లో ఫిక్కీ ఈ అంశాలు ప్రస్తావించింది. అటు లాక్డౌన్ ఉపసంహరణపై కర్ణాటక ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ కూడా దాదాపు ఇటువంటి సూచనలే చేసింది. దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేయాలని సూచించింది. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మరో 2 వారాలు లాక్డౌన్ కొనసాగించాలని పేర్కొంది. సంఘటితరంగ పరిశ్రమలను 50% సామర్థ్యంతో పనిచేయించి, వారం మార్చి వారం ఉపా«ధి కల్పిస్తే కార్మికులందరికీ పూర్తి వేతనాలు చెల్లించవచ్చని తెలిపింది. ఏప్రిల్ 30 దాకా దేశీవిదేశీ విమానాలు, రైళ్ళు, ఇంటర్సిటీ బస్సులు, మెట్రోరైళ్ళు నడపకూడదని, 50% సామర్థ్యంతో ప్రజారవాణా కోసం బస్సులను అనుమతించవచ్చని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కమిటీ సూచించింది. -
దివాలా అంచున ఎయిర్‌లైన్స్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బకు విమానయాన రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. ఫ్లయిట్ సర్వీసులు నిల్చిపోయి.. అటు టికెట్ల క్యాన్సిలేషన్లతో ఎయిర్‌లైన్స్ నిధుల కొరతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దీంతో పలు విమానయాన సంస్థలు దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్నాయని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణం తగు సహాయక చర్యలు ప్రకటించి పరిశ్రమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురికి ఫిక్కీ ఏవియేషన్ కమిటీ చైర్మన్ ఆనంద్ స్టాన్లీ లేఖ రాశారు. దేశీ ఎయిర్‌లైన్స్ ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీలు రుణదాతలు జప్తు చేసుకోకుండా 90 రోజుల వెసులుబాటు కల్పించాలని కోరారు. అలాగే, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు విధించే వడ్డీలు,పెనాల్టీలు, ఇతర చార్జీల నుంచి కూడా మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘గడిచిన కొద్ది రోజులుగా విమాన సేవలు నిల్చిపోవడంతో ఏవియేషన్ పరిశ్రమ దగ్గరున్న నిధుల నిల్వలు గణనీయంగా పడిపోతున్నాయి. ఎయిర్‌లైన్స్ ఎదుర్కొంటున్న పెను సవాళ్లలో ఇదీ ఒకటి’ అన్నారు. -
ఇన్కమ్ డిక్లరేషన్‌పై అవగాహన అవసరం
ఇన్కమ్ సర్టిఫికెట్, ఫిక్కీ, బినామీలు బీచ్‌రోడ్ : బినామీ పేర్లు మీద ఆస్తులపై తమ పేరు ఉండాలి అంటే... ప్రతి ఒక్కరూ ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్‌లో భాగం కావాలని ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ బి.జి.రెడ్డి కోరారు. ఒక ప్రైవేట్ హోటల్లో సోమవారం ఫిక్కీ ఆధ్వర్యంలో ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్‌పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్‌లో ఇది వరకే తమ పూర్తి ఆదాయంపై పన్ను చెలించని వారు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా తమ అప్రకటిత ఆదాయన్ని లేదా ఆస్తులను తెలియపరచి పన్ను చెల్లించే అవకాశం ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ పథకం 30–09–2016 వరకు అందుబాటులో ఉంటుందని అప్పటికీ ఇంకా ఎవరైనా పన్ను చెల్లించకపోతే వారికి కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. తమ వద్ద కేవలం విశాఖ నగరానికి చెందిన లక్ష అప్రకటిత లావాదేవీలు వివరాలు ఉన్నాయన్నారు. ఈ ప«థకం ద్వారా పన్ను చెల్లించే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంటాయని, అలాగే మిగిలిన శాఖల నుండి ఎటువంటి ఇబ్బందులు వారికి రాకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ శాఖలకు జీఓను జారీ చేసిందని వివరించారు. ఈ సదస్సులో సీహెచ్. ఓంకారాశ్వర్ మాట్లాడుతూ తమ వద్ద ఆరేళ్లుగా జరిగిన అప్రకటిత లావాదేవీలు వున్నాయి కాబట్టి ఎవరూ పన్ను చెల్లించకుండా తప్పించుకోలేరని హెచ్చరించారు. అందువల్ల ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకుని సక్రమంగా పన్ను చెల్లించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా సదస్సులో పలువురు వెలిబుచ్చిన సందేహాలకు బదులిచ్చారు.