కునుకు లేని ‘రాచకొండ’!
క్షిపణి పేరు చెబితే ఉలిక్కిపడుతున్న ప్రాంతం
ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ పేరుతో దండయాత్రలు చేస్తున్న బీడీఎల్
వణుకుతున్న ఐదు దోనెల తండా వాసులు
ఒకప్పుడు తూటా చప్పుళ్లతో దద్దరిల్లింది ఇదే తండా
సాక్షి, హైదరాబాద్: నిన్నమొన్నటి వరకు.. ఆ ప్రాంతానికి తుపాకులు, తూటాలు, దండయాత్రలు, ఎన్కౌంటర్లు కొత్త కాదు. రాజులు, రజాకార్లు, పోలీసులు, మావోయిస్టులు పేల్చిన తూటాల చప్పుళ్లు ఇప్పటికీ ఈ ప్రాంతవాసుల చెవుల్లో మార్మోగుతుంటాయి. ప్రకృతి సోయగాలు.. నిరంతరం పారే జలపాతాలు.. ఎత్తై గుట్టలు, కొండలతో అలరారే నల్లగొండ జిల్లాలోని ఈ ‘రాచకొండ’ చారిత్రక ఆనవాళ్లకు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చిపడింది. తిరుగుబాట్లు, విప్లవ రాజకీయాలకు నెలవైన అక్కడి ప్రజలు ఇప్పుడు క్షిపణి పేరు చెబితే ఉలిక్కిపడుతున్నారు. ‘ఫైర్’ సీన్లు పాతవే అయినా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ అంటేనే వారు వణుకుతున్నారు. ఈ ప్రాంతంలోని అద్భుతమైన అందాలను, చారిత్రక సంపదను సరి‘హద్దు’ల మధ్య బంధించి వేల ఎకరాల్లో నిక్షిప్తమై ఉన్న నాటి ఆంధ్రదేశ రాజధాని ఆనవాళ్లకు శాశ్వతంగా సంకెళ్లు వేసేందుకు రక్షణ శాఖ ఉవ్విళ్లూరుతోంది. అమాయక గిరిజనులను, వారి సంస్కృతిని తమ ప్రయోగశాలగా మార్చుకుని బాంబుల మోతతో కకావికలం చేసేందుకు సిద్ధమైంది.
నగరానికి సమీపంలో.. నయా దండయాత్ర
హైదరాబాద్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం, రంగారెడ్డి జిల్లా మంచాల ప్రాంతాల మధ్య ఉన్న రాచకొండపై రక్షణ శాఖ కన్నుపడింది. క్షిపణి పరీక్షలు చేస్తామని ఓసారి, ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేస్తామని మరోసారి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) అధికారులు ఈ ప్రాంతంపై నయా దండయాత్రలు చేస్తున్నారు. మొదట 25 ఎకరాలు సరిపోతాయని చెప్పిన బీడీఎల్ యాజమాన్యం ఆ తర్వాత 125 ఎకరాలు.. మళ్లీ 17,430 ఎకరాలకు పైగా ఎసరు పెట్టింది. ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేసి సైనికులకు శిక్షణ ఇస్తామని, యుద్ధంలో శత్రుసైన్యాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే క్షిపణులను ప్రయోగిస్తామని అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. మూడు దశాబ్దాల నాటి ఈ ప్రతిపాదనలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఐదు దోనెలకు ఎంత కష్టం..
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో 300 అడుగుల ఎత్తున ఉంది ఐదు దోనెల తండా. బీడీఎల్ చేసే క్షిపణి ప్రయోగాలు ఈ తండానే లక్ష్యంగా చేసుకోనున్నాయి. వారు చేసిన మార్కింగ్ ప్రకారం రాచకొండ గుట్టల్లోని సరళ మైసమ్మ దే వాలయం సమీపంలోని గుట్టల నుంచి క్షిపణులను ప్రయోగిస్తారు. అవి 2, 4, 6 కిలోమీటర్లలోని లక్ష్యాలను ఛేదించాల్సి ఉంటుంది. 2, 4 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలు జనావాసాలకు దూరంగా ఉంటే 6 కిలోమీటర్ల లక్ష్యం మాత్రం ఈ తండాకు కూతవేటు దూరంలో ఉంది. ఇక్కడ 70 ఇళ్ల వరకు ఉన్నాయి. సింగభూపాలుని కాలంలో ఈ తండాకు సమీపంలో ఐదు నీటి దోనెలను తవ్వారు. ఈ దోనెల వద్దకు క్రూర జంతువులు నీటి కోసం వచ్చినప్పుడు రాజులు వాటిని వేటాడేవారు. దాదాపు వందేళ్ల క్రితమే ఈ తండాకు అంకురార్పణ జరిగింది. సమీపంలోని అటవీప్రాంతంలో ఉన్న తండాల ప్రజలు ఒక్కొక్కరుగా అక్కడ నివాసమేర్పరచుకున్నారు. బీడీఎల్ అధికారుల ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే నెలకోసారి వీరంతా తండాను ఖాళీ చేయాలి. అక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలో పునరావాసం కింద ఏర్పాటు చేసిన షెడ్లలోకి గొడ్డు గోదాలతో వెళ్లిపోవాలి. క్షిపణి పరీక్షలు పూర్తయిన తర్వాత మళ్లీ తమ తమ నివాసాలకు రావాలి. దీనికి అంగీకరిస్తే తండాకు సకల సౌకర్యాలు కల్పిస్తామని, రోడ్లు వేస్తామని, మరుగుదొడ్లు కట్టిస్తామని బీడీఎల్ ప్రలోభపెడుతోంది. కానీ ఈ ప్రతిపాదనలను అంగీకరించేందుకు స్థానిక గిరిజనులు ససేమిరా అంటున్నారు.
రజాకార్లనే తరిమికొట్టాం..
‘మమ్మల్ని వెళ్లిపొమ్మంటే సహించేది లేదు. మీకు నచ్చింది చేయాలనుకుంటే మరో ప్రాంతాన్ని చూసుకోండి. భూమిపుత్రులను వెళ్లిపోమ్మనే ధైర్యం ఎవరికి ఉందో చూస్తాం. ఇక్కడకు ఎలా వస్తారో.. క్షిపణులు ఎలా ప్రయోగిస్తారో చూస్తాం. రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర మాది. నిజాం గుండెల్లో నిద్దురపోయిన తెగువ మాది. ఈ పోరాటం ఎక్కడి వరకు వెళ్లినా మేం వెనక్కు తగ్గేది లేదు’.
- సపావట్ సోమ్లా, ఐదు దోనెల తండా వాసి