FIH World Cup
-
Hockey World Cup 2023: భారత్ 9వ స్థానంతో ముగింపు
భువనేశ్వర్: సొంతగడ్డపై జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రపంచకప్ హాకీలో క్వార్టర్ ఫైనల్ కూడా చేరలేక నిరాశపరిచిన భారత జట్టు చివరకు విజయంతో మెగా టోర్నీని ముగించింది. శనివారం 9 నుంచి 12వ స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 5–2తో దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. అయితే మరో మ్యాచ్‌లో అర్జెంటీనా 6–0 స్కోరు తేడాతో వేల్స్‌ను చిత్తు చేయడంతో భారత్, అర్జెంటీనాలు సంయుక్తంగా 9వ స్థానంలో నిలిచాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున అభిషేక్ (4వ ని.), హర్మన్‌ప్రీత్ సింగ్ (11వ ని.), షంషేర్ సింగ్ (44వ ని.), ఆకాశ్‌దీప్ సింగ్ (48వ ని.), సుఖ్జీత్ సింగ్ (58వ ని.) తలా ఒక గోల్ చేశారు. సఫారీ జట్టులో సంకెలొ ఎంవింబి (48వ ని.), ముస్తఫా కాసిమ్ (59వ ని.) చెరో గోల్ చేశారు. ఆట ఆరంభమైన నాలుగో నిమిషంలోనే అభిషేక్ ఫీల్డ్‌గోల్‌తో భారత్‌కు శుభారంభమిచ్చాడు. ఈ క్వార్టర్‌లోనే హర్మన్‌ప్రీత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి 2–0తో ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. ఇదే స్కోరుతో తొలి అర్ధభాగాన్ని (రెండు క్వార్టర్లు) ముగించిన భారత్ ఆఖరి క్వార్టర్లో మరో రెండు ఫీల్డ్ గోల్స్‌ను ఆకాశ్‌దీప్, సుఖ్జీత్ సాధించడంతో విజయం సులువైంది. ► నేడు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల ఫైనల్ ► జొకోవిచ్ ( సెర్బియా) X సిట్సిపాస్ ( గ్రీస్) ► మ.గం. 2 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం -
FIH Nations Cup final: ఫైనల్లో భారత మహిళల హాకీ జట్టు
వాలెన్సియా: ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల ‘నేషన్స్ కప్’ టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. కెప్టెన్ సవిత పూనియా గోల్‌పోస్ట్ ముందు అడ్డుగోడలా నిలువడంతో భారత్ షూటౌట్లో 2–1తో ఐర్లాండ్‌పై గెలుపొందింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. తొలిక్వార్టర్లో ఐర్లాండ్ స్ట్రయికర్ నవొమి క్యారొల్ (13వ ని.) గోల్ చేయడంతో ఐర్లాండ్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో క్వార్టర్లోనూ ఈ ఆధిక్యాన్ని కొనసాగించింది. అయితే మూడో క్వార్టర్ ముగిసే దశలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను ఉదిత (45వ ని.) గోల్‌గా మలచి స్కోరును సమం చేసింది. షూటౌట్లో భారత బృందంలో లాల్రేమ్సియామి, సోనిక గోల్స్ సాధించగా, ఐర్లాండ్ జట్టులో హన్నా మెక్‌లాలిన్ గోల్ చేసింది. ఎలెన్ కరన్ షాట్‌ను సవిత సమర్థంగా ఆడ్డుకుంది. అప్పటికి భారత్ 5 ప్రయత్నాలు ముగియగా... ఐర్లాండ్‌కు ఆఖరి షాట్ మిగిలుంది. కత్రిన్ ములన్ షాట్‌ను వైడ్‌గా కొట్టడంతో భారత్ 2–1తో విజయం సాధించింది. ఫైనల్ చేరిన భారత్... స్పెయిన్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. -
భారత్ శుభారంభం
ఎఫ్ఐహెచ్ ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్ న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు... యూరోప్ పర్యటనను విజయంతో మొదలుపెట్టింది. ఎఫ్ఐహెచ్ పురుషుల ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 7-0తో లీడెన్ హాకీ క్లబ్ (డచ్ నేషనల్ క్లబ్)పై విజయం సాధించింది. అక్షదీప్ (18వ ని.), నికిన్ తిమ్మయ్య (21వ ని.), రూపిందర్ పాల్ సింగ్ (38, 39వ ని.), రమన్‌దీప్ సింగ్ (43వ ని.), రఘునాథ్ (45వ ని.), యువరాజ్ వాల్మీకి (53వ ని.)లు భారత్‌కు గోల్స్ అందించారు. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరుజట్లు మెరుగైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్నాయి. ఫార్వర్డ్స్ అటాకింగ్ మొదలుపెట్టడంతో తొలి అర్ధభాగంలో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. లీడెన్ క్లబ్ ఆటగాళ్లు స్కోరును సమం చేసేందుకు చేసిన ప్రయత్నాలను గోల్‌కీపర్ శ్రీజేష్ సమర్థంగా అడ్డుకున్నాడు. రెండో అర్ధభాగంలోనూ భారత ప్లేయర్ల హవా కొనసాగింది. లీడెన్ క్లబ్‌కు లభించిన ఒకటి, రెండు అవకాశాలనూ సబ్‌స్టిట్యూట్ గోల్‌కీపర్ హర్జ్యోత్ సింగ్ అడ్డుకోవడంతో మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. నెదర్లాండ్స్‌లో మే నెల 31 నుంచి జూన్ 15 వరకు ప్రపంచకప్ జరగనుంది.