Film Editor
-
టాలీవుడ్లో విషాదం.. సీనియర్ ఎడిటర్ వెంకటేశ్వరరావు మృతి
సీనియర్ ఎడిటర్ పి. వెంకటేశ్వరరావు (72) చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆరు నెలలుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు రెండొందల చిత్రాలకు పైగా వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా వర్క్ చేశారు. ‘యుగంధర్’, ‘మొండిమొగుడు పెంకి పెళ్ళాం’, ‘కెప్టెన్ కృష్ణ’, ‘ఇద్దర అసాధ్యులే’ వంటి పలు హిట్ చిత్రాలకు ఎడిటర్‌గా చేశారు వెంకటేశ్వరరావు. ఆయన భార్య కొన్నేళ్ల క్రితం మరణించారు. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా వెంకటేశ్వరరావు మృతికి పలువురు సినీ ప్రముఖులు, తెలుగు ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోటగిరి వెంకటేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి మార్తాండ్ కె. వెంకటేష్ సంతాపం వ్యక్తం చేశారు. వెంకటేశ్వరరావు అంత్యక్రియలు ఈ నెల 22న చెన్నైలో జరుగుతాయి. -
ప్రముఖ ఎడిటర్ జీజీ కృష్ణారావు కన్నుమూత
ప్రముఖ ఎడిటర్ జీజీ కృష్ణారావు (87) మంగళవారం ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుడివాడకు చెందిన జీజీ కృష్ణారావు చెన్నై నుంచి సినీ ప్రయాణాన్నిప్రారంభించారు. ఎడిటర్‌గానే కాదు.. అసోసియేట్ డైరెక్టర్,ప్రొడక్షన్ డిజైనర్‌గానూ పని చేశారాయన. బాపు, ఆదుర్తి సుబ్బారావు, కె. విశ్వనాథ్, దాసరి నారాయణరావు, జంధ్యాల వంటి ఎందరో ప్రముఖ దర్శకుల చిత్రాలకు ఎడిటర్‌గా చేశారాయన. ‘శంకరాభరణం, వేటగాడు, బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు, సాగర సంగమం, స్వాతిముత్యం, శుభలేఖ’ వంటి దాదాపు 300 సినిమాలకు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు కృష్ణారావు. డైరెక్టర్ కె. విశ్వనాథ్‌తో కృష్ణారావుకు మంచి అనుబంధం ఉండేది. అందుకే ఆయన తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలకు కృష్ణారావు పని చేశారు. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘సప్తపది’కి కృష్ణారావు తొలిసారి నంది అవార్డు అందుకున్నారు. ఈ సినిమా నుంచే ఎడిటింగ్ విభాగంలో నంది అవార్డు ఇవ్వడంప్రారంభమైంది. అనంతరం ‘సాగర సంగమం, శుభ సంకల్పం’ చిత్రాలకు కూడా నంది అవార్డులు సొంతం చేసుకున్నారాయన. కృష్ణారావుకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బెంగళూరులోని తన కుమార్తె వద్ద ఉంటున్న ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. జీజీ కృష్ణారావు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ‘‘ఎడిటింగ్ శాఖకు గౌరవాన్ని తెచ్చిన వారిలో కృష్ణారావుగారు ఒకరు. ఆయన మరణంతో తెలుగు ఫిలిం ఎడిటర్స్ ఒక పెద్ద దిక్కును కోల్పోయారు’’ అని తెలుగు ఫిలిం ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మార్తాండ్ కె. వెంకటేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. -
ఎడిటర్ గౌతమ్ రాజు కుటుంబానికి చిరు తక్షణ సాయం
సినీ ఎడిటర్ గౌతమ్‌రాజు (68) అనారోగ్యంతో బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న నగరంలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఒక్కసారిగా అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో 1:30 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతు గౌతమ్ రాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా గౌతమ్‌రాజు మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అంతేకాదు ఆయన కుటుంబ సభ్యులకు తక్షణ సాయం కింద తాజాగా 2 లక్షల రూపాయలను ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ద్వారా అందజేశారు. చదవండి: బాలీవుడ్ స్టార్ హీరోకు విలన్‌గా విజయ్ సేతుపతి? ఈ మేరకు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రెండు లక్షల రూపాయలను ఎడిటర్ గౌతమ్ రాజు కుటుంబ సభ్యులకు ఇచ్చారు. అనంతరం వారికి అండగా ఉంటామని, ధైర్యం కోల్పోవద్దని చిరు కుటుంబం తరపున ఆయన కుటుంబానికి ధైర్యం ఇచ్చారు. ఇది విషయాన్ని తమ్మారెడ్డి మీడియాకు వెల్లడించారు. కాగా గౌతమ్ రాజు ఎడిటర్‌గా 800లకు పైగా చిత్రాలకు పనిచేశారు. సినీ ఇండస్ట్రీలో ఆయనకు చిరంజీవితో మంచి అనుబంధం ఉంది. చిరు సినిమాలైన ‘చట్టానికి కళ్లు లేవు’ చిత్రం నుంచి ‘ఖైదీ నం.150’ వరకు తన ఎన్నో చిత్రాలకు గౌతమ్ రాజు ఎడిటర్‌గా పనిచేసినట్లు చిరు తన ట్వీట్లో పేర్కొన్నారు. -
గౌతమ్ రాజుని కోల్పోవడం దురదృష్టకరం : చిరంజీవి
ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు(68) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగా ఢ సానుభూతి తెలియజేశాడు. ‘ గౌతమ్ రాజు లాంటి గొప్ప ఎడిటర్ని కోల్పోవడం దురదృష్టకరం. ఆయన ఎంత సౌమ్యుడో.. ఆయన ఎడిటింగ్ అంత వాడి. ఆయన మితభాషి, కానీ ఆయన ఎడిటింగ్ మెళకువలు అపరిమితం. ఎంత నెమ్మదస్తుడో.. ఆయన ఎడిటింగ్ అలంత వేగం. ‘చట్టానికి కళ్లు లేవు’ చిత్రం నుంచి ‘ఖైదీ నం.150’ వరకు నా ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన గౌతమ్ రాజు గారు లేకపోవటం వ్యక్తిగతంగా నాకూ, మొత్తం సినీ పరిశ్రమకు పెద్ద లోటు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను’అని చిరంజీవి ట్వీట్ చేశారు. (చదవండి: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఎడిటర్ కన్నుమూత) కాగా, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గౌతమ్ రాజు మంగళవారం అర్థరాత్రి హైదాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దాదాపు 800కిపైగా సినిమాలకు గౌతమ్‌రాజు ఎడిటర్‌గా పనిచేశారు. ఖైదీ నెంబర్ 150, గబ్బర్‌సింగ్, కిక్, రేసుగుర్రం, గోపాల గోపాల, అదుర్స్, బలుపు, ఊసరవెల్లి, బద్రీనాథ్ సినిమాలకు గౌతమ్‌రాజు ఎడిటర్‌గా పనిచేశారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడలోనూ అనేక సినిమాలకు ఆయన పనిచేశారు. Rest In Peace Gowtham Raju garu! pic.twitter.com/kmkii0wM8K — Chiranjeevi Konidela (@KChiruTweets) July 6, 2022 -
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఎడిటర్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సినీ ఎడిటర్ గౌతమ్‌రాజు (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో భాదపడుతున్నారు. నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఒక్కసారిగా అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో 1:30 నిమిషాలకు ఆయన మరణించారు. 800కిపైగా సినిమాలకు గౌతమ్‌రాజు ఎడిటర్‌గా పనిచేశారు. ఖైదీ నెంబర్ 150, గబ్బర్‌సింగ్, కిక్, రేసుగుర్రం, గోపాల గోపాల, అదుర్స్, బలుపు, ఊసరవెల్లి, బద్రీనాథ్ సినిమాలకు గౌతమ్‌రాజు ఎడిటర్‌గా పనిచేశారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడలోనూ అనేక సినిమాలకు ఆయన పనిచేశారు. గౌతమ్‌రాజు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. చదవండి: (Mahua Moitra: మాంసం తినే మద్యం తాగే దేవత) -
నాన్న ఇంట్లో ఉండటమే మాకు పెద్ద పండుగ...
ధర్మదాత, అక్కాచెల్లెళ్లు, నాటకాల రాయుడు... చిత్రాలకు దర్శకత్వం వహించారు... మరెన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు... ఎల్.వి.ప్రసాద్ తమ్ముడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు.. ఎ. సంజీవిగా పేరు నిలబెట్టుకున్నారు.. కుమారుడు కూడా ఎడిటర్ అయ్యారు... తండ్రి తాలూకు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ప్రముఖ ఎడిటర్ శ్రీకర్‌ప్రసాద్.. నాన్న ఇంట్లో ఉన్న రోజే మాకు పండుగ. సినిమాలలో బిజీగా ఉండటం వల్ల నాన్నతో తక్కు వ సమయం గడిపేవాళ్లం. సమయం దొరికినప్పుడు మాతో సరదగా గడిపేవారు. తెల్లటి వస్త్రాలలో, క్లీన్ షేవ్ చేసుకుని నీట్‌గా ఉండేవారు. ఎడిటింగ్ రూమ్ కూడా ఎంతో శుభ్రంగా ఉండేది. అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతులకు నాన్న ఆరో సంతానం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర పెద్దవేగిలో పుట్టారు. నాన్నకి నలుగురు అన్నయ్యలు, ఒక అక్కయ్య. బసవయ్య, ఎల్. వి. ప్రసాద్, సుబ్బమ్మ, నారాయణరావు, రామచంద్ర రావు. మా పెద్దనాన్న ఎల్వి ప్రసాద్ అందరికంటె ముందుగా సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆ తరవాత నాన్న చెన్నై వచ్చి, పెద్ద నాన్న దగ్గర సినిమా ఎడిటింగ్ నేర్చుకున్నారు. కొంతకాలం తర్వాత దర్శకత్వం కూడా చేశారు. అక్కచెల్లెళ్లు, ధర్మదాత, సిసింద్రీ చిట్టిబాబు, విశాలి, నాటకాల రాయుడు వంటి చిత్రాలు తీశారు. గారం చేసేవారు.. 1963 లో నేను పుట్టే నాటికి నాన్న బిజీగా ఉండేవారు. రాత్రి పన్నెండు గంటలకు వచ్చి, ఉదయం ఎనిమిది గంటలకు వెళ్లిపోయేవారు. నాకు ఇద్దరు అక్కలు.. గృహలక్ష్మి, పంకజ. నేనొక్కడినే అబ్బాయిని కావటం వల్ల నన్ను గారం చేస్తున్నారని అందరూ నాన్నను ఆటపట్టించేవారు. చెన్నై ప్యారిస్ కార్నర్ నుంచి దానిమ్మ కాయలు, బాసుంది వంటివి తెచ్చేవారు. నాన్న దగ్గర చేరిక.. ఇల్లు చూసుకుంటూ స్ట్రిక్ట్‌గా ఉండే అమ్మ రాధ, లిబరల్గా ఉండే నాన్న... ఇటువంటప్పుడు తండ్రి వైపు మొగ్గు చూపటం సహజమే కదా. అందువల్ల నాన్నతో అటాచ్మెంట్ ఎక్కువ. నాన్న మమ్మల్ని ఎన్నడూ కొట్టలేదు, తిట్టలేదు. ఏది చదువుకుంటా మంటే అదే చదివించారు. నేను బి.ఏ లిటరేచర్ చేశాను. ఆ తరవాత జర్నలిజం చదువుదామను కున్నాను. కాని నాన్న దగ్గర పని నేర్చుకోవటంలో ఆ విషయమే కాదు, పోటీ పరీక్షలు రాయవలసిన విషయం కూడా మర్చిపోయాను. మా బాల్యంలో... నేను చిన్నప్పుడు బాగా అల్లరిచేసేవాడిననీ, నేను చేసే అల్లరి పనులన్నీ అక్కయ్యల మీదకు తోసేవాడిన నీ నాన్న సరదాగా చెప్పేవారు. మా స్కూల్ లంచ్ టైమ్‌లో నాన్న ఇంటికి భోజనానికి వచ్చేవారు. ఇల్లు స్కూల్‌కి బాగా దగ్గర కావటం వల్ల మేం కూడా ఇంటికి వచ్చేవాళ్లం. అందరం కలిసి భోజనం చేసేవాళ్లం. అసలు నాన్న ఇంట్లో ఉండటమే పండుగ అంటారు అక్కయ్యలు. ఒక విషయం నాన్న తరచు చెప్పేవారు. మా ఇంట్లో ఒక అల్సేషియన్ డాగ్ ఉండేది. నేను పుట్టక ముందు వరకు దాన్ని చాలా గారంగా చూశారట. నేను పుట్టాక ఆ అటెన్షన్ నా మీదకు తిరిగింది. దాంతో మా డాగ్‌కి కోపం వచ్చి, నాకు ఐదేళ్లు వచ్చేలోపు నన్ను ఐదారుసార్లు కరిచేసింది. నేను ఏడుస్తుంటే, నాన్న బాధపడేవారు. ఒకరోజున నాన్నకి కోపం వచ్చి, దాన్ని కేకలేశారు. అది అలిగి మంచం కిందకు దూరి, రెండు రోజుల దాకా బయటకు రాలేదు. ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఇష్టం లేకుండానే... నాన్న తనతో పాటు నన్ను షూటింగ్‌కి తీసుకెళ్లేవారు. ఒకసారి ప్రముఖ సినిమాటో గ్రాఫర్ రవికాంత్ నగాయిచ్ ట్రిక్ ఫొటోగ్రఫీ చేస్తున్నారు. ఫిల్మ్ రోల్‌ను చుట్టలా చుట్టి, కెమెరాకు పెట్టి, ఏదో చేస్తున్నారు. అప్పుడు అందులో నుంచి బాణాలు వస్తున్న ఎఫెక్ట్ వచ్చింది. అలా నాన్నతో వెళ్లినప్పుడు అక్కడ జరుగుతున్న విషయాలు చూస్తూండేవాడిని. కాని నాకు పని నేర్చుకోవాలనే శ్రద్ధ ఉండేది కాదు. నేను సినిమా లైన్లోకి రాకూడదనుకున్నారు ఇంట్లో వాళ్లంతా. సినిమాల వల్ల ఫ్యామిలీతో గడపటానికి సమయం దొరకదు, సినిమా ప్రపంచంలో నిలకడ ఉండదు, ఎత్తుపల్లాలు ఉంటాయి... అని ఇంట్లో వాళ్లు చెప్పిన మాటలు నా మనసులో పడిపోయాయి. నన్ను నేర్చుకోమన్నారు.. నాన్న ఎన్ని ఇబ్బందులు పడుతున్నా తన ఒత్తిడిని మా వరకు రానిచ్చేవారు కాదు. అప్పట్లో బుక్స్ చదువుతుండేవాడిని. నెమ్మదిగా సినిమాలు చూడటం ప్రారంభించాను. సినిమా చూడాలనే ఆసక్తి పెరిగింది కానీ ఎడిటింగ్ మీద ఆలోచన లేదు. కాని నాన్న ఒకసారి, ‘ఎడిటింగ్ చేసేటప్పుడు చూసి ఎలా చేయాలో నేర్చుకో’ అని చెప్పారు. నెమ్మదిగా నాన్న చేస్తున్న పనిని దీక్షగా పరిశీలించటం మొదలుపెట్టాను. నాన్నగారి కమిట్మెంట్ గురించి అర్థం చేసుకున్నాను. 24 ఫ్రేమ్స్ రన్ అయితే ఒక సెకన్ సినిమా కనిపిస్తుంది, ఏ సందర్భంలో ఎలా ఎడిట్ చేయాలి.. అనే విషయాలు నాన్న దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తూ, చూసి నేర్చుకున్నాను. నాన్న పక్కన ఉంటే చాలా ప్రొటెక్టివ్‌గా అనిపించేది. నాన్న తన జీవితంలో ఎత్తుపల్లాలు చూశారు. భవిష్యత్తులో డబ్బు ఇబ్బంది వస్తుంది, దాచుకోవాలి.. అనే ఆలోచనే ఉండేది కాదు. చేతిలో ఎంత ఉంటే అంత ఖర్చు చేసేవారు. దీపావళి పండుగకి బుట్టెడు టపాసులు కొనేవారు. నాన్న ప్రోగ్రెసివ్.. నాన్న చాలా ప్రోగ్రెసివ్ అనిపిస్తారు. నాన్న నా మీద ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. ‘నేను అనుకున్నది జరగాలి’ అని కాకుండా ‘వాళ్లు అనుకున్నది జరగాలి’ అనుకునేవారు. నాన్నను చూస్తే ‘జెంటిల్మన్’ అనిపిస్తుంది. నాకు నాన్న అలాగే తెలుసు. 1989 హిందీలో తీసిన రాక్ సినిమాకు నాకు ఉత్తమ ఎడిటర్ అవార్డు వచ్చినప్పుడు నాన్న ముఖంలో ఆ ఆనందం స్పష్టంగా కనిపించింది. శ్రద్ధగా పనిచేయటం నాన్న దగ్గరే నేర్చుకున్నాను. అదే నాకు అవార్డు తెచ్చిపెట్టిందనుకుంటాను. 2002లో 74 వ ఏట నాన్న కన్నుమూశారు. అది మాకు పెద్ద షాక్. - వైజయంతి పురాణపండ -
సీనియర్ ఫిలిం ఎడిటర్ కన్నుమూత..
సాక్షి, చెన్నై: జాతీయ అవార్డు గ్రహీత, సీనియర్ ఫిలిం ఎడిటర్ కె బాబురావు అనారోగ్యంతో కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగు, తమిళం, హిందీ భాషల చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. అందులో అనేక విజయవంతమైన చిత్రాలతో పాటు చక్కటి కథాంశంతో ప్రేక్షకులను అలరించిన చిత్రాలు అధికంగా ఉన్నాయి. కళాతపస్వి కే. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందించిన పలు చిత్రాలకు బాబురావు ఎడిటర్‌గా పనిచేశారు. వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం సాగింది. బాబురావు ఎడిటర్‌గా పనిచేసిన సిరిసిరిమువ్వ సినిమాకు గానూ ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. బాబురావు మృతి పట్ల దక్షిణాది ఇండస్ట్రీ సంతాపం తెలియజేసింది. -
ప్రముఖ సినీ ఎడిటర్ కన్నుమూత
సాక్షి, చెన్నై: సీనియర్ సినీ ఎడిటర్ శేఖర్ (81) గురువారం ఉదయం తమిళనాడు తిరుచ్చి సమీపంలోని తెన్నూర్లో కన్నుమూశారు. దక్షిణాది భాషల్లో 50 ఏళ్లలో 200కు పైగా చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన శేఖర్.. దర్శకులు ఫాజిల్, సిద్ధిక్‌లకు ఆస్థాన ఎడిటర్‌గా పేరొందారు. దక్షిణాదిలో తొలి సినిమాస్కోప్ (తస్సోలి అంబు) చిత్రానికి, తొలి 70ఎంఎం (పడైయోట్టం) చిత్రానికి, అదే విధంగా తొలి భారతీయ (మైడియర్ కుట్టిసాత్తాన్) 3డీ చిత్రానికి పనిచేసిన ఎడిటర్‌గా శేఖర్ ఖ్యాతి గడించారు. వరుషం 16 చిత్రానికి గానూ శేఖర్ తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తమ ఎడిటర్ అవార్డును, ‘0 మొదల్ 1 వరై’ అనే మలయాళ చిత్రానికి కేరళ రాష్ట్రం నుంచి ఉత్తమ ఎడిటర్ అవార్డు అందుకున్నారు. ఈయన చివరి తమిళ చిత్రం సాదుమిరండా. సినిమా రంగం నుంచి తప్పుకున్న తర్వాత ఆయన తన స్వగ్రామంలో స్థిరపడ్డారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన శేఖర్ చికిత్స పొందుతూ గురువారం ఉదయం 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య సుందరి, కుమార్తెలు దీపలక్ష్మి, తిలకవతి, నిత్యా ఉన్నారు.