క్లీన్ స్వీప్ పై భారత్ దృష్టి
♦ నేడు ఆసీస్‌తో ఆఖరి టి20
♦ జోరుమీదున్న ధోనిసేన
♦ ఒత్తిడిలో కంగారూలు
2014 నవంబర్ 9 తర్వాత ఆస్ట్రేలియా ఒక్క టి20 మ్యాచ్ కూడా గెలవకపోవడం విశేషం.
ఆస్ట్రేలియాకు టి20ల్లో 9వ కెప్టెన్ వాట్సన్.
సిడ్నీ: వన్డేల్లో ఎదురైనా పరాభవానికి టి20 సిరీస్ గెలుపుతో గట్టి సమాధానం చెప్పిన భారత జట్టు ఇప్పుడు క్లీన్‌స్వీప్‌పై దృష్టిపెట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి ఆస్ట్రేలియాకు షాకిచ్చిన టీమిండియా ఆఖరి టి20లోనూ గెలిచి పర్యటనకు ఘనమైన ముగింపు ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) సిడ్నీలో ఇరుజట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.
టి20 ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్‌లో భారత్ ఏమైనా ప్రయోగాలు చేస్తుందా? లేదా? అన్నది ప్రస్తుతం తేలాల్సిన అంశం. అయితే గెలిచే జట్టును మార్చడానికి ఇష్టపడని ధోని గత రెండు మ్యాచ్‌ల్లో ఆడిన టీమ్‌నే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇదే జరిగితే టి20ల కోసమే ఎంపిక చేసిన యువరాజ్, హార్దిక్ పాండ్యాలకు ఇప్పటి వరకు బ్యాటింగ్ అవకాశం రాలేదు. కాబట్టి మిడిలార్డర్లో వీళ్లకు అవకాశం కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. ఇక టాప్ ఆర్డర్లో రోహిత్, ధావన్, కోహ్లి సూపర్ ఫామ్‌లో ఉం డటం భారత్‌కు కలిసొచ్చే అంశం. రైనాకు పెద్దగా అవకాశం రాకపోయినా...
స్లాగ్ ఓవర్లలో ధోని ఫినిషిం గ్‌తో టీమిండియా భారీ స్కోరు చేయగలుగుతుంది. బౌలింగ్‌లో నెహ్రా, ఉమేశ్‌లు పరుగులు నిరోధించాల్సిన అవసరం ఉంది. బుమ్రా, హార్దిక్ పాండ్యా, యువరాజ్ అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్నారు. వీళ్లకు తోడు ప్రధాన స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు కీలక సమయంలో వికెట్లు తీస్తుండటం బలంగా మారింది. అయితే రాబోయే సీజన్ మొత్తం ఉపఖండంలో ఆడాల్సి ఉంది కాబట్టి రిజర్వ్ బెంచ్‌లో ఉన్న హర్భజన్‌ను మూడో స్పిన్నర్‌గా పరీక్షిస్తే బాగుంటుంది.
ఆసీస్ సారథిగా వాట్సన్
మరోవైపు ఇప్పటికే సిరీస్ చేజారడంతో ఆసీస్ పూర్తి ఒత్తిడిలో పడింది. దీనికి తోడు కెప్టెన్ ఫించ్ మోకాలి కండర గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఉస్మాన్ ఖాజా బరిలోకి దిగుతున్నాడు. సీనియర్ ఆటగాడు వాట్సన్‌కు కెప్టెన్సీ అప్పగించారు. కీలక ఆటగాళ్లు వార్నర్, స్మిత్ లేకపోవడం కూడా లోటుగా కనిపిస్తోంది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంచి భాగస్వామ్యాలు ఏర్పర్చలేకపోవడం ఆందోళన కలిగించే అంశం. డేంజర్ మ్యాన్ మ్యాక్స్‌వెల్, ఆల్‌రౌండర్ ఫాల్క్‌నర్, వాట్సన్, మార్ష్‌లపైనే ఈ మ్యాచ్ విజయం ఆధారపడి ఉంది.
జట్లు (అంచనా)
భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, హార్దిక్ పాండ్యా, జడేజా, అశ్విన్, బుమ్రా, నెహ్రా.
ఆస్ట్రేలియా: వాట్సన్ (కెప్టెన్), మార్ష్, లిన్, మ్యాక్స్‌వెల్, ఉస్మాన్ ఖాజా / హెడ్, బ్యాంక్రాఫ్ట్, ఫాల్క్‌నర్, టై, లయోన్ / బాయ్సీ, బోలాండ్, టెయిట్.
పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు అనుకూలం. మరోసారి భారీ స్కోర్లు నమోదు కావొచ్చు. ఆకాశం మేఘావృతమైనా వర్షం పడే అవకాశాల్లేవు.
మ. గం. 2.08 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
మహిళలదీ అదే లక్ష్యం
ఆసీస్ గడ్డపై తొలిసారి టి20 సిరీస్ గెలిచి మహిళల జట్టు కూడా వైట్‌వాష్‌పై దృష్టిపెట్టింది. ఇదే మైదానంలో నేడు జరగనున్న ఆఖరి మ్యాచ్‌ల్లో ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తోంది. జట్టు మొత్తం ఫామ్‌లో ఉండటం భారత్‌కు అనుకూలాంశమైతే... ఆసీస్ ఇందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. అయితే కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి, పోయిన పరువును తెచ్చుకోవాలని కంగారూలు భావిస్తున్నారు.
ఉ. గం. 9 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం