'ఆ సవరణ వల్ల పారదర్శకత లోపిస్తుంది'
న్యూఢిల్లీ : ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్ సభలో ఆమోదం పొందిన 40 సవరణలతో కూడిన ఆర్థిక బిల్లు-2017పై రాజ్యసభలో వాడివేడిగా చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా రాజ్యసభలో మాట్లాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి, పలు ముఖ్యమైన ప్రశ్నలను కేంద్రానికి సంధించారు. రాజకీయ పార్టీలకు కంపెనీలు అందించే విరాళాలపై మాట్లాడిన ఆయన, ప్రస్తుత బిల్లు ప్రకారం కంపెనీలు ఏ రాజకీయ పార్టీకి విరాళాలు అందించాయో తమ లాభ, నష్టాల అకౌంట్లో చూపించాల్సినవసరం లేకుండా కంపెనీల చట్టం 182(3) సెక్షన్ కు సవరణలు చేశారని చెప్పారు. అయితే దానివల్ల ఎలక్ట్రోరల్ ఫండింగ్ లో పారదర్శకత లోపిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు.
ప్రస్తుతం ఆయా కంపెనీలు తమ నికరలాభాల్లో సగటున 7.5 శాతం రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తున్నాయి. కానీ ఆ పరిమితిని కంపెనీల చట్టం 2013 సెక్షన్ 182కు సవరణ చేసి ఎత్తివేశారు. ఎగ్జిక్యూటివ్ ప్రమేయంతో అపాయింట్మెంట్లను, రీపాయింట్మెంట్లను, సభ్యులను తొలగించడం చేపడితే, అది ట్రిబ్యునల్ స్వతంత్రతపై ప్రభావం చూపుతుందన్నారు. కొత్త బిల్లు క్లాస్ 184 ప్రకారం కేంద్రప్రభుత్వమే ట్రిబ్యునల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను, స్పెసిఫైడ్ ట్రిబ్యునల్ సభ్యుల నియమ, నిబంధనల నియమావళిని రూపొందించనుంది. ఈ బిల్లులోనే నగదు లావాదేవీలను రూ.3 లక్షల నుంచి రూ.2 లక్షలకు కుదించాలనే కీలక నిబంధనను కూడా చేర్చారు.