నేడు కేబినేట్ భేటీ
7 ఆర్డినెన్సులకు చట్టరూపు
హస్తిన నుంచి రాష్ట్రానికి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రిమండలి శనివారం సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని సి బ్లాక్ లో సమావేశం జరుగుతుంది. 16వ తేదీ నుంచి అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సభలో ప్రవేశపెట్టనున్న బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ప్రధానంగా ఇటీవల ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఆర్డినెన్సులకు చట్టరూపం ఇవ్వనున్నారు. ప్రధానంగా ఏడు ఆర్డినెన్స్‌లను బిల్లులుగా ఆమోద ముద్ర వేయనున్నారు.
గతంలో ఇచ్చిన జీవో 123కు ప్రత్యామ్నాయంగా నీటిపారుదల ప్రాజెక్టులకు భూ సేకరణ కోసం చట్టం , ఆర్థిక శాఖ ద్వారా పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల మంజూరు, మున్సిపల్ శాఖ ద్వారా హైదరాబాద్ నగరానికి కృష్ణానది నీటిని తరలించేందుకు రూ.1,800 కోట్ల మంజూరుకు ఆమోదం, తెలంగాణ బీసీ కమిషన్ (సవరణ) ఆర్డినెన్స్, 2016కు బిల్లు రూపం, కరీంనగర్, నిజామాబాద్, సిద్ధిపేట, రామగుండం (మెట్రోపాలిటన్ ఏరియా) పోలీసు ఆర్డినెన్స్, 2016కు బిల్లుగా, తెలంగాణ జిల్లాల (ఏర్పాటు) (సవరణ) ఆర్డినెన్స్, 2016కు బిల్లుగా ఆమోదం, తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న కేసులను ఏపీ ట్రిబ్యునల్ నుంచి హైకోర్టుకు బదిలీపై ఆర్డినెన్స్ నుంచి చట్టరూపం ఇవ్వనున్నారు. మరోవైపు, సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం నగరానికి చేరుకున్నారు.