ప్రతికూల పన్ను విధానాలు ఉండవు
- ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ హామీ
- పెట్టుబడుల వృద్ధిపై దృష్టి పెడతాం...
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ వృద్ధికి పెట్టుబడులు భారీగా పెరగడం అవసరమని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతికూల పన్ను విధానాలను అవలంబించబోమని పెట్టుబడిదారులకు హామీ ఇచ్చారు. దీనితోపాటు దేశంలో సమగ్ర కార్మిక చట్టాలూ అవసరమని అన్నారు.
కేసులు సత్వర పరిష్కారం,ఆయా నిర్ణయాలు తీసుకోవడంలో నిజాయితీ లక్ష్యాలుగా అవినీతి నిరోధక చట్టం పునఃపరిశీలించాల్సివుందని ఉద్ఘాటించారు.ఇక్కడ ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడుల ప్రాధాన్యతల గురించి వివరించారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ)కు దాదాపు రూ. 40,000 కోట్ల పన్ను డిమాండ్ నోటీసులు... దీంతో స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐలు భారీ అమ్మకాలకు దిగడం, వెరసి గత వారం సెన్సెక్స్ ఏకంగా 1,004 పాయింట్లు (3.53 శాతం) నష్టపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో జైట్లీ తాజా ప్రకటన చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
- పెట్టుబడిదారులపై రెట్రాస్పెక్టివ్ (గత కాలపు డీల్స్ తిరగదోడి పన్నులు విధించడం) పన్నులు విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. దేశంలో వ్యాపారం చేయడానికి తగిన సానుకూల పరిస్థితులను కల్పిస్తున్నాం.
- ఆర్థికపరమైన నిర్ణయం తీసుకోవడంలో పొరపాట్లు జరుగుతుంటాయి. అయితే తప్పు జరుగుతుందేమోనని ముందే ఊహించుకుని అసలు నిర్ణయం తీసుకోకుండా ఉండిపోవడం సరికాదు.
- అంతర్జాతీయ వ్యాపార పరిస్థితుల్లో వినియోగదారులు ‘కేవలం తమ దేశ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలన్న’ సంకుచిత ధోరణిలో ఉండరు. ఈ నేపథ్యంలో మన దేశ తయారీ రంగం ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయంగా పోటీపూర్వక స్థాయిలో ఉండాలి. ఇలాంటి పరిస్థితిని సృష్టించాలన్న మాటలు కేవలం నినాదాలకే పరిమితి కారాదు. వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి కృషి జరుగుతుంది.
- పస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 8 నుంచి 8.5 శాతం వరకూ ఉంటుందని భావిస్తున్నాం.
- ఆసియా దేశాల్లో సగటు కార్పొరేట్ పన్ను రేటు 21 నుంచి 22%గా ఉంది. దేశంలో వచ్చే నాలుగేళ్లలో ఈ పన్నును 30 శాతం నుంచి 25%కి క్రమంగా తగ్గిస్తాం. 2016 నుంచీ ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది.