ట్రైకార్ నిధులేవి?
ఉట్నూర్ : జిల్లాలో ఆదివాసీ గిరిజనుల సంపూర్ణ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐటీడీఏ గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందించడంలో విఫలమైంది. 2013-14 ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు అవుతున్నా ప్రభుత్వం అడవి బిడ్డలకు ఆర్థిక పథకాల ద్వారా చేయూత నిచ్చే ట్రైకార్ నిధులు విడుదల చేయలేదు. ఐటీడీఏలో పూర్తిస్థాయి పీవో లేకపోవడం ఒక కారణమైతే.. రాష్ట్ర విభజన కూడా మరో కారణం. కాగా, ప్రభుత్వం నిధులు విడుదల చేసి గిరిజనుల అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉంది.
రూ.23.46 కోట్లతో ప్రణాళికలు
జిల్లా వ్యాప్తంగా 44 మండలాల్లో 4,95,794 మంది గిరిజన జనాభా ఉంది. వీరంతా ఐటీడీఏ అమలు చేసే ఆర్థిక అభివృద్ధి పథకాల పరిధిలోకి వస్తారు. వీరి అభివృద్ధి కోసం 2013-14 ఆర్థిక సంవత్సరంలో ట్రైకార్ యాక్షన్ ప్లాన్ ద్వారా ఐటీడీఏ వ్యవసాయం, చిన్ననీటి పారుదల, స్వయం ఉపాధి, నూతన కల్పన, రవాణా, భూమి కొనుగోలు వంటి పథకాలు, ఐఎస్బీ, పశుసంవర్థకం, మత్స్య, నైపుణ్య శిక్షణలు ఇలా ఆర్థిక సహాయ పథకాలకు రూప కల్పన చేసింది.
ఈ పథకాల కింద గిరిజనులకు 3,570 యూనిట్ల ద్వారా గిరిజనులకు మేలు చేయాలని భావించింది. ఇందుకోసం కేంద్ర ప్రత్యేక సహాయనిధి, టీఎస్పీ ద్వారా రూ.5,33,85,000, గ్రాంట్ ఇన్ ఎయిడ్ (వోజీఐఏ) ద్వారా రూ.5,04,55,000, బ్యాంక్, ఎంఎంఎస్, ఇతర రకాలుగా రూ.13,08,35,000 కలిపి రూ.23,46,75,000లతో గిరిజనులకు ఐటీడీఏ ద్వారా ఆర్థిక సహాయ పథకాలు అందించాలని ఐటీడీఏ ప్రణాళికలు రూపొందించింది.
లక్ష్య సాధనలో విఫలం
ట్రైకార్ యాక్షన్ ప్లాన్ ద్వారా గిరిజనులకు ఆర్థిక చేకూర్పు అందించాలని ప్రభుత్వం భావించినా అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ఐటీడీఏ విఫలమైంది. 2013-2014 ఆర్థిక సంవత్సరానికి గాను 893 యూనిట్లను 900 మంది గిరిజనులకు అందించింది. ఇందుకోసం రూ.10.51 కోట్లు రావాల్సి ఉంది. ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు.
ఐటీడీఏ నిర్లక్ష్యం వల్ల మరో 2,677 యునిట్లు గిరిజనులకు అందకుండా పోయాయి. వీటికి రావాల్సిన రూ.12,95,22,000 నిధులు వచ్చే అవకాశం లేదు. కాగా, ఐటీడీఏ పూర్తిస్థాయి పీవో జనార్దన్ నివాస్ దీర్ఘకాలిక సెలవులో వెళ్లడం, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ ఇన్చార్జి పీవోగా వ్యవహరిస్తున్నాడు. లబ్ధికోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని గిరిజనులు వాపోతున్నారు. ప్రభుత్వం ట్రైకార్ నిధులు విడుదల చేసి తమ అభివృద్ధికి బాటలు వేయాలని ఆదివాసీ గిరిజనులు కోరుతున్నారు.
ప్లాన్ : ట్రైకార్
సంవత్సరం : 201314
ప్రణాళిక : రూ.23.46 కోట్లు
మొత్తం యూనిట్లు : 3,570
మంజూరైన యూనిట్లు : 893
లబ్ధిపొందిన గిరిజనులు : 900
మంజూరుకాని యూనిట్లు : 2,677
విడుదల కావాల్సిన నిధులు : రూ.10.51 కోట్లు
వచ్చే అవకాశం లేని నిధులు : రూ.12.95 కోట్లు