The fire department
-
నిరుపయోగంగా పీపీఈలు
- వృథాగా అగ్నిమాపక శాఖ జవాన్ల పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ - కొనుగోలు చేసినవి 2,320.. - ఉపయోగిస్తున్నవి 620 - శరీర ఆకృతికి తగ్గట్టు - లేకపోవడం వల్లే ధరించడం లేదన్న సిబ్బంది సాక్షి, ముంబై: అగ్నిమాపక శాఖ జవాన్ల రక్షణ కోసం కొనుగోలు చేసిన ‘పర్సనల్ ప్రొటెక్టివ్ ఇక్విప్మెంట్’ (పీపీఈ) లు కేవలం అలంకార ప్రాయంగా మిగిలిపోతున్నాయి. మంటలు ఆర్పివేసే ప్రయత్నంలో గాయపడకుండా ఉండేందుకు కొనుగోలు చేసిన మొత్తం 2,320 పీపీఈలలో 620 మాత్రం ప్రస్తుతం వినియోగిస్తున్నారు. మిగతావన్నీ ఆయా అగ్నిమాపక కేంద్రాలలో పనికిరాకుండా పడున్నాయి. సదరు యూనిఫాంలు జవాన్ల శరీర ఆకృతికి తగ్గట్టుగా లేకపోవడంతో వాటిని ధరించడం లేదని తెలుస్తోంది. అయితే బాధ్యులైన సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోకుండా మహానగర పాలక సంస్థ (బీఎంసీ) అధికారులు వారిని వెనకేసుకొస్తున్నారు. వృథాగా యూనిఫాంలు..రూ. 20.67 కోట్ల నష్టం అగ్నిప్రమాదాలు జరిగినపుడు మంటలను ఆర్పే ప్రయత్నంలో జవాన్లకు హాని జరగకుండా 2009లో బీఎంసీ పరిపాలనా విభాగం జాకెట్లు, ప్యాంట్లు, టీ షర్టులు, షూస్, హెల్మెట్లు, టార్చ్లైట్లు ఇలా ఒక్కో సెట్లో 15 వస్తువులు ఉండే 2,320 పీపీఈలు కొనుగోలు చేసింది. వీటిని మెసర్స్ టెక్నోట్రేడ్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ద్వారా చైనా నుంచి కొనుగోలు చేసింది. ఇందుకోసం బీఎంసీ పరిపాలన విభాగం రూ.29.34 కోట్లు చెల్లించింది. కానీ జవాన్ల శరీర కొలతల ప్రకారం వాటిని తయారు చేయకపోవడంతో ఫిర్యాదు చేశారు. సరిపోయిన 620 పీపీఈలు వినియోగిస్తున్నారు. మిగతావన్నీ వృథాగా పడి ఉండడంతో బీఎంసీకి వాటి ద్వారా రూ.20.67 కోట్ల నష్టం వాటిల్లింది. నిరూపయోగంగా ఉన్న యూనిఫాంలను మార్చి ఇచ్చేందుకు కాంట్రాక్టర్ నిరాకరించారు. మరోవైపు ఇచ్చిన గడువుకంటే రెండు నెలలు ఆలస్యంగా సామాగ్రి డెలివరీ చేశారు. జాప్యం జరిగినందుకు నష్టపరిహారంగా రూ.1.12 కోట్లు జరిమాన వసూలు చే యాల్సి ఉంది. అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బుధవారం స్థాయి సమితిలో ఈ అంశాన్ని చర్చించారు. దీనిపై ఆడిట్ సిబ్బంది నిలదీశారు. కొలతల ప్రకారం యూనిఫాంలు తయారుచేసి ఇచ్చే బాధ్యత కాంట్రాక్టర్‌దేనని, అయినప్పటికి ఎందుకు నిర్లక్ష్యం చేశార ని ఆడిటర్లు అగ్నిమాపక శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాప్యం జరిగినందుకు నష్టపరిహారంగా 10 శాతం జరిమానా వసూలు చేయాలని సూచించారు. -
ఇక రంగంలోకి మొబైల్ యూనిట్లు
సాక్షి, ముంబై: అత్యవసర సమయంలో ‘రెస్పాన్స్ టైం’ తగ్గించేందుకు నగరంలో 10 మొబైల్ యూనిట్లు ఏర్పాటుచేయాలని అగ్నిమాపక శాఖ నిర్ణయం తీసుకుంది. ఏదైన ప్రమాదం సంభవించినప్పుడు సమీపంలో ఉన్న ఈ మొబైల్ యూనిట్లు కేవలం ఏడు నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుంటాయి. అక్కడ జరిగే ప్రాణ, ఆస్తి నష్టం నుంచి కాపాడతాయి. దూరం నుంచి అగ్నిమాపక యంత్రాలు వచ్చి సహకరించనున్నాయి. అయితే సమీపంలో ఉండడంవల్ల ముందుగా ఈ యూనిట్లు చేరుకుని మంటలను ఆర్పివేసే ప్రయత్నాలు చేస్తాయని బీఎంసీ అదనపు కమిషనర్ మోహన్ అడ్తాని చెప్పారు. ఒక్కో మొబైల్ యూనిట్లో ఒక సహాయక కేంద్ర అధికారి, ఒక డ్రైవర్, ఇద్దరు అగ్నిమాపక జవాన్లు శాశ్వతంగా విధులు నిర్వహిస్తారన్నారు. కాగా, నగరంలో ట్రాఫిక్ జాం సమస్య విపరీతంగా పెరిగిపోయింది. అత్యవసర సమయంలో అంబులెన్స్‌లు, పోలీసు వ్యాన్లు, అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకోవాలంటే భారీ కసరత్తు చేయాలి. అయితే ఎలాంటి ప్రమాదం జరిగిన ముందుగా అక్కడికి చేరుకునేది అగ్నిమాపక వాహనాలే కావడంతో వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. నగరంలో 33 అగ్నిమాపక కేంద్రాలున్నాయి. ఈ ట్రాఫిక్ జాంలో ఫైరింజన్లు దూరం నుంచి ఘటనాస్థలికి రావాలంటే కనీసం అరగంటకుపైనే సమయం పడుతుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీంతో నగర విస్తరణ, జనాభాను దృష్టిలో ఉంచుకుని అదనంగా 26 కేంద్రాలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నగరంలో తగినంత స్థలం దొరక్కపోవడంతో మొబైల్ యూనిట్ల ఏర్పాటు అంశం తెరమీదకు వచ్చింది. వీటిని ఫ్లైఓవర్ల కిందున్న ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేస్తారు. -
హెలికాప్టర్లు వద్దు
శివసేన ప్రతిపాదనలు పక్కకు పెట్టిన బీఎమ్సీ వాటితో ప్రమాదం తీవ్రమవుతుందన్న పరిపాలనా విభాగం సాక్షి, ముంబై: నగర అగ్నిమాపక శాఖ కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్లు కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను నగర పాలక సంస్థ(బీఎమ్సీ) తిరస్కరించింది. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు హెలికాప్టర్లను వినియోగించడంవల్ల మంటలు మరింత తీవ్రమవుతాయనే సాకుతో బీఎమ్సీ పరిపాలనా విభాగం వాటి కొనుగోలు ప్రతిపాదనను పక్కన బెట్టినట్టు తెలుస్తోంది. ఒక్కప్పుడు నగరం, శివారు ప్రాంతాల్లో 10-15 అంతస్తులకే పరిమితమైన భవనాలు నేడు అందనంత ఎత్తులో నిర్మిస్తున్నారు. దీనికితోడు నగరంలో విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోవడంతో ప్రమాదస్థలికి వెంటనే ఫైరింజన్లు చేరుకోవడం కష్టమవుతోంది. దీంతో అప్పటికే జరగాల్సిన ప్రాణ, ఆస్తి నష్టం జరిగిపోతుంది. ఈ నష్టాన్ని నివారించేందుకు ముంబై అగ్నిమాపక శాఖకు హెలికాప్టర్లు కొనుగోలు చేసి ఇవ్వాలని శివసేనకు చెందిన యామిని జాధవ్ ప్రతిపాదించారు. కాని బీఎమ్సీ పరిపాలనా విభాగం దీన్ని తిరస్కరించింది. ప్రస్తుతం అగ్నిమాపక శాఖ పరిధిలో ఫైరింజన్ల వాహనాలపై 22 అంతస్తుల ఎత్తుకు సరిపడే నిచ్చెనలు ఉన్నాయి. భాయ్కళలోని అగ్నిమాపకశాఖ ప్రధాన కార్యాలయంలో సుమారు 28 అంతస్తులకు సరిపడే ఫైరింజన్ ఒకేఒకటి ఉంది. ఈ భారీ వాహనం ఇక్కడి నుంచి ట్రాఫిక్ జామ్‌లో సంఘటనా స్థలానికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాగా నగరంలో మూతపడిన మిల్లుల స్థలాల్లో ఎక్కడ చూసినా టవర్లు, ఆకాశహర్మ్యాలు, బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేయాలంటే అగ్నిమాపక జవాన్లకు తలప్రాణం తోకకు వస్తోంది. ఇప్పటికే నగర విస్తరణ, పెరిగిన జనాభాతో పోలిస్తే అగ్నిమాపక కేంద్రాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో కేవలం 33 అగ్నిమాపక కేంద్రాలున్నాయి. వీటి సంఖ్య రెట్టింపు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. కాని అది కార్యరూపం దాల్చలేకపోయింది. దీంతో హెలికాప్టర్ల ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. అయితే అగ్నిప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పివేసేందుకు వెళ్లిన హెలికాప్టర్ రెక్కల నుంచి వచ్చే వేగమైన గాలివల్ల మంటలు విస్తరించడంతోపాటు మరింత ఉగ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. అంతేగాక హెలికాప్టర్ నీటిని నిల్వ చేసుకుని గాలిలో ఎగురుతుండగా మంటలపై పిచికారి చేయడం సాధ్యమయ్యే పని కాదు. అంతేగాక వాటి నిర్వహణ, మెకానిక్‌లు, హెలిప్యాడ్లు అందుబాటులో ఉంచడం ఎంతో ఖర్చుతో కూడుకున్నది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పరిపాలనా విభాగం ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది.