- శివసేన ప్రతిపాదనలు పక్కకు పెట్టిన బీఎమ్సీ
- వాటితో ప్రమాదం తీవ్రమవుతుందన్న పరిపాలనా విభాగం
సాక్షి, ముంబై: నగర అగ్నిమాపక శాఖ కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్లు కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను నగర పాలక సంస్థ(బీఎమ్సీ) తిరస్కరించింది. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు హెలికాప్టర్లను వినియోగించడంవల్ల మంటలు మరింత తీవ్రమవుతాయనే సాకుతో బీఎమ్సీ పరిపాలనా విభాగం వాటి కొనుగోలు ప్రతిపాదనను పక్కన బెట్టినట్టు తెలుస్తోంది. ఒక్కప్పుడు నగరం, శివారు ప్రాంతాల్లో 10-15 అంతస్తులకే పరిమితమైన భవనాలు నేడు అందనంత ఎత్తులో నిర్మిస్తున్నారు. దీనికితోడు నగరంలో విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోవడంతో ప్రమాదస్థలికి వెంటనే ఫైరింజన్లు చేరుకోవడం కష్టమవుతోంది. దీంతో అప్పటికే జరగాల్సిన ప్రాణ, ఆస్తి నష్టం జరిగిపోతుంది.
ఈ నష్టాన్ని నివారించేందుకు ముంబై అగ్నిమాపక శాఖకు హెలికాప్టర్లు కొనుగోలు చేసి ఇవ్వాలని శివసేనకు చెందిన యామిని జాధవ్ ప్రతిపాదించారు. కాని బీఎమ్సీ పరిపాలనా విభాగం దీన్ని తిరస్కరించింది. ప్రస్తుతం అగ్నిమాపక శాఖ పరిధిలో ఫైరింజన్ల వాహనాలపై 22 అంతస్తుల ఎత్తుకు సరిపడే నిచ్చెనలు ఉన్నాయి. భాయ్‌కళలోని అగ్నిమాపకశాఖ ప్రధాన కార్యాలయంలో సుమారు 28 అంతస్తులకు సరిపడే ఫైరింజన్ ఒకేఒకటి ఉంది. ఈ భారీ వాహనం ఇక్కడి నుంచి ట్రాఫిక్ జామ్‌లో సంఘటనా స్థలానికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాగా నగరంలో మూతపడిన మిల్లుల స్థలాల్లో ఎక్కడ చూసినా టవర్లు, ఆకాశహర్మ్యాలు, బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేయాలంటే అగ్నిమాపక జవాన్లకు తలప్రాణం తోకకు వస్తోంది. ఇప్పటికే నగర విస్తరణ, పెరిగిన జనాభాతో పోలిస్తే అగ్నిమాపక కేంద్రాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి.
ప్రస్తుతం నగరంలో కేవలం 33 అగ్నిమాపక కేంద్రాలున్నాయి. వీటి సంఖ్య రెట్టింపు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. కాని అది కార్యరూపం దాల్చలేకపోయింది. దీంతో హెలికాప్టర్ల ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. అయితే అగ్నిప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పివేసేందుకు వెళ్లిన హెలికాప్టర్ రెక్కల నుంచి వచ్చే వేగమైన గాలివల్ల మంటలు విస్తరించడంతోపాటు మరింత ఉగ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. అంతేగాక హెలికాప్టర్ నీటిని నిల్వ చేసుకుని గాలిలో ఎగురుతుండగా మంటలపై పిచికారి చేయడం సాధ్యమయ్యే పని కాదు. అంతేగాక వాటి నిర్వహణ, మెకానిక్‌లు, హెలిప్యాడ్‌లు అందుబాటులో ఉంచడం ఎంతో ఖర్చుతో కూడుకున్నది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పరిపాలనా విభాగం ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది.