సాక్షి, విజయవాడ: వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల నుంచి ఆహారం, నీరు లేకపోవడంతో హెలికాప్టర్ వద్దకి ప్రజలు పరుగులు తీస్తున్నారు. వాంబే కాలనీలో ఆహార పొట్లాలను హెలికాప్టర్ ద్వారా బురదలోకి జారవిడుస్తున్నారు. దీంతో ఆహారం, వాటర్ కోసం స్థానికులు బురదలో పడి కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పక్కనే అపార్ట్‌మెంట్లు ఉన్నా బురదలో పడేయడం ఏంటి అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. బురదలో పడి ఆహారం కోసం కుక్కలా కొట్టుకొనేటట్లు ప్రభుత్వం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బురదలో ఆహార ప్యాకెట్లు పడటంతో సగం పైనే బురదమయం అవుతున్నాయని మహిళలు వాపోతున్నారు.
మరో వైపు, వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చిన వారికి కష్టాలు తప్పడం లేదు. వరద బాధితులను తరలించేందుకు అధికారులు బోట్లను రప్పించారు. తిండీ తిప్పల్లేకుండా ఆకలితో అలమటిస్తూ.. బోట్లతో మత్స్యకారులు వచ్చారు. ముస్తాబాద్ వద్ద వరద బాధితుల కోసం బోటు ఏర్పాటు చేయగా, బోటుతో పాటు మచిలీపట్నం నుంచి ముగ్గురు మత్స్యకారులు వచ్చారు.
అధికారులు తీసుకొచ్చి తమను వదిలేశారని.. ఒక్కరు కూడా తమను పట్టించుకోవడమ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితుల ప్రాణాలను రక్షిస్తున్న తమ ప్రాణాలకు గ్యారంటీ లేదని మత్స్యకారులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment