పెద్దవాగుకు వరద పోటెత్తడంతో చిక్కుకుపోయిన 28 మంది.. హెలికాప్టర్లలో సురక్షిత ప్రాంతానికి..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/అశ్వారావుపేటరూరల్: ఒక్కసారిగా పెద్దవాగుకు వరద పోటెత్తింది. దీంతో ఆ వరద ఉధృతిలో 28 మంది చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు రెండు హెలికాప్టర్లు రంగంలోకి 25 మందిని సురక్షిత ప్రాంతానికి చేర్చగా, మరో ముగ్గురిని స్థానికులు కాపాడారు.
వాన తగ్గిందని...
భద్రాద్రి కొత్తగూడెంజిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవెల్లి దగ్గర పెద్దవాగుపై మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉంది. ప్రాజెక్టులోకి వరద వచ్చే క్యాచ్‌మెంట్ ఏరియాలో కొంత ఏపీలోని బుట్టాయిగూడెం మండల పరిధిలో ఉంది. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులో ప్రవాహం పెరిగింది. మరోవైపు అశ్వారావుపేట మండలంలో గురువారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. మధ్యాహ్నం 12:30 గంటలకు వాన కొంత తగ్గుముఖం పట్టడంతో స్థానికులు పొలాలకు వెళ్లారు.
మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో పెద్దవాగుకు అకస్మాత్తుగా వరద పెరిగి ముందుగా ఒడ్డు వెంట ఉన్న పొలాలను చుట్టుముట్టింది. దీంతో వరదలో చిక్కుకున్న వారు ప్రాణాలు కాపాడుకునేందుకు చెరువుకట్టకు దగ్గరలో ఉన్న ఎత్తయిన ప్రదేశం వైపు వెళ్లారు. ఆ తర్వాత క్రమంగా వరద నీటిమట్టం పెరుగుతూ మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి బాధితుల మోకాళ్లలోతు వరకు వచ్చాయి. క్రమంగా గట్టు దాటుకొని పొలాలను ముంచెత్తింది.
ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యానికి మించి వరద రావడంతో ముందుగా ప్రాజెక్టు ఎగువ భాగం ముంపునకు గురైంది. దీంతో వెంటనే ప్రాజెక్టుకు ఉన్న మూడు గేట్లు తెరిచేందుకు ప్రయత్నించగా అందులో ఒకటి తెరుచుకోలేదు. బాధితులు ఫోన్‌లో సమాచారం ఇవ్వగా, వరద పరిస్థితిని తెలుసుకున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని సహాయ కార్యక్రమాల కోసం అప్రమత్తం చేశారు.
అటు అనుకుంటే ఇటు..: ఏపీలోని వేలేరు పాడు మండలం అల్లూరినగర్ దగ్గర వరద నీటిలో ఒక కారు కొట్టుకుపోయింది. అందులో ఉన్న ఐదుగురిని కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగి నేవీ హెలికాప్టర్‌ను పంపింది. అయితే హెలికాప్టర్ రావడం ఆలస్యం కావడంతో గ్రామస్తులు ఆ కారులో ఉన్న ఐదుగురిని కాపాడారు. దీంతో నేవీ హెలికాప్టర్ సంఘటనా స్థలానికి రాకుండా ఏలూరులో ఆగిపోయింది. అయితే అదే సమయంలో పెద్దవాగు ప్రాజెక్టు ఎగువన నారాయణపురంలో 28 మంది వరదలో చిక్కుకుపోయిన విషయం వెలుగుచూసింది. దీంతో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అక్కడి అధికారులతో మాట్లాడి హెలికాప్టర్‌ను ఇటు పంపించారు.
జాయింట్ ఆపరేషన్: ఏలూరు నుంచి హెలికాప్టర్ ఘటనా స్థలికి 6:15 గంటలకు వచ్చింది. వెలుతురు సరిగ్గా లేదు. సహా య కార్యక్రమాలు ఏమేరకు జరుగుతాయో అనే సందేహం నెలకొంది. నేవీ హెలికాప్టర్ ముందుగా ప్రభావిత ప్రాంతంలో చక్కర్లు కొట్టి బాధితులు ఉన్న లొకేషన్‌ను గుర్తించింది. ఆ తర్వాత 20 నిమిషాలకు తెలంగాణకు చెందిన హెలికాప్టర్ ఘటనా స్థలికి చేరుకుంది.
6:45 గంటలకు అసలైన రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. నేవీ హెలికాప్టర్ దారి చూపిస్తూ లొకేషన్ దగ్గరికి తీసుకెళ్లి బాధితులు ఉన్న చోటుపై లైట్ వేసింది. రెండో హెలికాప్టర్ ఆ స్థలానికి చేరుకుని బాధితులకు రోప్ అందించింది. విడతల వారీగా బాధితులను బయటకు తీసుకురా వడంతో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది.
వైకుంఠధామంలో ల్యాండింగ్..
బాధితులు మధ్యాహ్నం 3 గంటలకు వరద నీటిలో చిక్కుకున్నారు. గంటగంటకూ వరద నీరు పెరుగుతూ మోకాళ్ల లోతుకు వచ్చింది. బాధితుల్లో మహేశ్ అనే యువకుడి దగ్గరే ఫోన్ ఉంది. దీంతో ప్రాణభయంతో అందరూ ఆ ఫోన్ నుంచే కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తమ ప్రాణాలు దక్కవేమోనంటూ బోరున విలపించారు.
మూడు గంటలు గడిచినా రెస్క్యూఆపరేషన్ మొదలు కాకపోవడం, మరోవైపు చీకటి పడుతుండటంతో పైప్రాణాలు పైనే పోయాయని భావించారు. అయితే ఏడు గంటల సమయంలో వరద నీటి నుంచి వారిని కాపాడిన హెలికాప్టర్ ల్యాండింగ్‌కు సరైన స్థలం లేక నారాయణపురం గ్రామంలో ఉన్న వైకుంఠధామం (స్మశానం)లో వారిని దించింది. ప్రాణాపాయం నుంచి బయటపడిన వారికి వైకుంఠధామం తొలి ఆశ్రయం ఇచ్చింది.
పెద్దవాగుకు గండి
రైట్ కెనాల్ తూము దగ్గర 40 మీటర్ల వద్ద....
తెలంగాణలో రెండు, ఏపీలో ఏడు గ్రామాలు మునక!
ముందుగానే గ్రామాలు ఖాళీ చేసిన ప్రజలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఏపీ, తెలంగాణవాసులను గడగడలాడించిన పెద్దవాగుకు ప్రాజెక్టుకు గండిపడింది. రెండు రాష్ట్రాల పరిధి పెద్దవాగు క్యాచ్‌మెంట్ ఏరియాలో సుమారు 16 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో గురు వారం ఉదయం నుంచి వాగుకు వరద పోటెత్తింది. ఈ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 40,500 క్యూసెక్కులు కాగా మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 70 వేల క్యూసెక్కులు, సాయంత్రం 5గంటలకల్లా 90 వేల క్యూసెక్కుల వరద చేరింది. దీంతో మధ్యాహ్నం నుంచే ప్రాజెక్టుకు ఎగపోటు మొదలైంది.
సాయంత్రం 5–30 గంటలకు గేట్లు, మట్టికట్ట మీద నుంచి నీరు ప్రవహించడం మొద లైంది. రాత్రి 7.30గంటల సమయంలో 32 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. అయితే ఉధృతి తగ్గకపోవడంతో రాత్రి 8 గంటల సమయంలో రైట్ కెనాల్ తూము దగ్గర 40 మీటర్ల మేరకు గండి పడగా, అక్కడి నుంచి కొంత దూరంలో మరో 20 మీటర్ల మేరకు గండి పడింది. మొత్తంగా 150 మీటర్ల మేరకు మట్టి కట్ట బలహీనపడిందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
నీట మునిగిన గ్రామాలు: పెద్దవాగు దిగువన తెలంగాణలో గుమ్మడవెల్లి, కొత్తూ రు గ్రామాలు ఉన్నాయి. గురువారం సాయంత్రం వరద ఉధృతి పెరిగిన వెంటనే ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలు అధికారులు హుటా హుటిన ఖాళీ చేయించారు. గండి పడిన తర్వాత వచ్చిన వరద నలభై ఇళ్లను ముంచెత్తింది. పశువులు ఇతర ఆస్తి నష్టం వివ రాలు తెల్లవారితే కానీ తెలిసే అవకాశం లేదు. ఏపీలోని వేలేరుపాడు మండలం మేడిపల్లి, రామవరం, గుండ్లవాయి, రెడ్డిగూడెంకాలనీ, మద్దిగట్ల, పూచిరాల గ్రామాల్లోనూ వరద ప్రభావానికి లోనయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment