Firhad Hakim
-
నారద కేసు: టీఎంసీ నేతలకు ఊరట
కోల్‌కతా: నారద స్టింగ్ టేప్స్ కేసులో నలుగురు టీఎంసీ నేతలకు కలకత్తా హైకోర్టు శుక్రవారం తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. రూ.2 లక్షలు చొప్పున వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన అంశాలపై ఎలాంటి న్యూస్ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని షరతు విధించింది. టీఎంసీ నేతలు ఫిర్హాద్ హకీమ్, మదన్ మిత్రా, సుబ్రత ముఖర్జీ, సోవన్ ఛటర్జీలను మే 17న సీబీఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి వీరు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా వీరికి తాత్కాలిక బెయిల్ ఇచ్చిన కోర్టు.. నిబంధనలు ఉల్లఘింస్తే బెయిల్‌ను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇక కేసుకు సంబంధించి కోర్టుకు ఏమైనా అవసరం వస్తే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా దర్యాప్తులో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అవినీతిని బయటపెట్టడం కోసం ‘నారద న్యూస్’ అనే న్యూస్ ఔట్లెట్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. దీనినే నారద స్టింగ్ ఆపరేషన్ అంటారు. నారద న్యూస్ వ్యవస్థాపకుడు మాథ్యూ శామ్యూల్ 2014-2016 మధ్య కాలంలో దాదాపు 12 మంది టీఎంసీ నేతలపైనా, ఓ ఐపీఎస్ అధికారిపైనా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇంపెక్స్ కన్సల్టెన్సీ సొల్యూషన్స్ అనే సంస్థకు వ్యాపార ప్రయోజనాలు కల్పించేందుకు వీరు నగదును తీసుకుంటున్నట్లు వీడియోలో కనిపించారు. స్టింగ్ ఆపరేషన్ చేయడం కోసమే ఈ కల్పిత సంస్థను శామ్యూల్ సృష్టించారు. 2014లో ఈ స్టింగ్ ఆపరేషన్ జరిగినప్పటికీ, 2016లో ‘తెహల్కా’ ప్రచురించింది. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలకు ముందు దీనిని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో పట్టుబడినవారిలో ముకుల్ రాయ్, సౌగత రాయ్, కకోలీ ఘోష్ దస్తిదార్, ప్రసూన్ బెనర్జీ, సువేందు అధికారి, అపరుప పొద్దార్, సుల్తాన్ అహ్మద్, మదన్ మిత్రా, సోవన్ ఛటర్జీ, సుబ్రత ముఖర్జీ, ఫిర్హాద్ హకీమ్, ఇక్బాల్ అహ్మద్, షంకు దేబ్ పాండా సహా ఐపీఎస్ అధికారి హెచ్ఎంఎస్ మీర్జా ఉన్నారు. చదవండి: నారద కేసును రాష్ట్రం వెలుపలికి బదిలీ చేయాలి: సీబీఐ నారదా స్టింగ్ ఆపరేషన్: మంత్రులకు బెయిల్ -
నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో ఇద్దరు బెంగాల్ మంత్రుల అరెస్ట్
కోల్‌కతా: నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో పశ్చిమ బెంగాల్లో అరెస్టుల పర్వం సోమవారం మొదలైంది. ఈ కేసులో టీఎంసీ నేతృత్వంలోని బెంగాల్ సర్కార్‌లో మంత్రులుగా ఉన్న ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీలను సీబీఐ అధికారులు సోమవారం అరెస్టుచేశారు. మరో టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా, రాష్ట్ర మాజీ మంత్రి సోవన్ ఛటర్జీలనూ అదుపులోకి తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగింది. రోజంతా హైడ్రామా నడిచింది. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అరెస్టుల విషయం తెల్సి మమత వెంటనే సీబీఐ ఆఫీస్‌కు వచ్చి దాదాపు ఆరుగంటలపాటు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. మరోవైపు, ఈ నలుగురికీ బెయిల్ మంజూరుచేస్తూ స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం సోమవారం రాత్రి హైకోర్టు వీరి బెయిల్‌పై స్టే ఇచ్చింది. అరెస్టులను నిరసిస్తూ టీఎంసీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ ఆంక్షలను గాలికొదిలేసి నిరసన చేపట్టారు. అరెస్టులు చట్టవిరుద్ధం: స్పీకర్ ‘ఎమ్మెల్యేలను అరెస్టు చేయాలంటే ప్రొటోకాల్ ప్రకారం అసెంబ్లీ స్పీకర్‌గా నాకు ముందే సమాచారమివ్వాలి. అలాంటి లేఖలు ఏవీ నాకు సీబీఐ నుంచి రాలేదు. ఇలా స్పీకర్ అనుమతి లేకుండా ఎమ్మెల్యేల అరెస్ట్ చట్టవిరుద్ధం’ అని బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ వ్యాఖ్యానించారు. అయితే, ఈ నలుగురు నేతల అరెస్టుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ గతంలో అనుమతులు ఇవ్వడం గమనార్హం. నన్నూ అరెస్ట్ చేయండి: మమతా బెనర్జీ అరెస్టుల విషయం తెల్సుకున్న టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ వెంటనే కోల్‌కతాలో సీబీఐ కార్యాలయం ఉన్న ‘నిజాం ప్యాలెస్’ భవంతికి వచ్చి ధర్నా చేపట్టారు. అరెస్టులపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ‘సీబీఐ ఆఫీస్ నుంచి వెళ్లేదేలేదు. కావాలంటే నన్నూ అరెస్టు చేయండి’ అని అక్కడ ఉన్న సీబీఐ సిబ్బందితో మమత ఆగ్రహంగా అన్నారు. అరెస్టు చేశాక ఆ నలుగురు నేతలను సీబీఐ అధికారులు బిల్డింగ్‌లోని 15వ అంతస్తులోని ఒక రూమ్‌కు తీసుకెళ్లారు. మమత ఆ రూమ్ బయటే నిరసన తెలిపారు. దాదాపు ఆరుగంటలపాటు ఆమె సీబీఐ కార్యాలయంలోనే ఉండి నిరసన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని జీర్ణించుకోలేకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐని అడ్డుపెట్టుకొని వేధింపులకు దిగుతోందని తృణమూల్ ఆరోపించింది. -
'నా నియోజకవర్గం ఓ మినీ పాకిస్థాన్'
పశ్చిమ బెంగాల్ కేబినెట్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత బాబీ ఫర్హాద్ హకిమ్ మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ పాకిస్థాన్ జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన 'నా నియోజకవర్గమే కోల్ కతాలో మినీ పాకిస్థాన్ లాంటిది' అని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. అయినప్పటికీ మమతా బెనర్జీ నమ్మిన బంటు అయిన ఫర్హాద్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాకిస్థాన్ కు వెళితే ఏమీ లేదు కానీ, తాను పాకిస్థాన్ గురించి ఏమైనా మాట్లాడితే వివాదం చేస్తారా? అని ఆయన ఎదురు ప్రశ్నించారు. తాను ముస్లిం కావడం వల్లే ప్రశ్నిస్తున్నారని, ఇందులో మత కలహాల కుట్ర కనిపిస్తున్నదని ఆయన ఎదురుదాడికి దిగారు. బెంగాల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫర్హాద్ హకిమ్ నియోజకవర్గంలో ఇటీవల పాక్ దినపత్రిక డాన్ కు చెందిన విలేకరి మలెహా హమిద్ సిదిఖి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ ఫర్హాద్ చేసిన మినీ పాకిస్థాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. భారత్ లోని ముస్లింల గురించి తప్పుడు సంకేతాలు ఇచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారని పలువురు మండిపడుతున్నారు.