తొలి మహాసభలను జయప్రదం చేద్దాం
సీపీఐ(ఎం) నేత తమ్మినేని వీరభద్రం పిలుపు
హైదరాబాద్: భారత కమ్యూనిస్టుపార్టీ(మార్కిస్టు) తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభలు మార్చి 1 నుంచి 4 వరకు హైదరాబాద్ నగరంలో జరగనున్నాయని, వాటిని అంతా కలసి జయప్రదం చేద్దామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యద ర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఆ మహాసభల్లో వామపక్షాల ఐక్యతకు అత్యంత ప్రాధాన్యమివ్వనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు సీపీఐ, సీపీఐ(ఎం) మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభల నేపథ్యంలో జనవరి 20 నుంచి ఫిబ్రవరి 10 వరకు ప్రారంభించిన మెగా క్యాంపెయిన్ ముగింపు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ ఎక్కడైనా విప్లవానికి ముందు ఒక మహత్తరమైన సాంస్కృతిక విప్లవం రావాలని చెప్పారు. అందుకోసం ఈ నెల 14న వీరబైరాన్‌పల్లిలో ఓ సాంస్కృతిక సైన్యం ఏర్పాటవుతుందన్నారు. దీనికి ప్రజా గాయకులు విమలక్క, గద్దర్‌లాంటి అతిరథ మహారథులు వస్తారన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మెగా క్యాంపెయిన్ స్ఫూర్తితో ప్రతిఒక్కరూ తొలి రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలన్నారు.
తెలంగాణ సాయిధ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ మెగా క్యాంపెయిన్, ఇంటింటికి సీపీఎం కార్యక్రమం విజయవంత చేసినందుకు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ కమ్యూనిస్టులు మానవతావాదులన్నారు. భద్రాచలం ఎంఎల్ఎ సున్నం రాజయ్య మాట్లాడుతూ 23 రోజుల మెగా క్యాంపెయిన్‌కు హైదరాబాద్‌లో విశేష ఆదరణ వచ్చిందన్నారు. సభ ప్రారంభంలో ప్రజానాట్యమండలి కళాకారులు నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకొన్నాయి. తెలంగాణ సాయిధ పోరాట డాక్యుమెంటరీ ఫిల్మ్ సీడీ ఆవిష్కరించి, ప్రద ర్శించారు. ఈ కార్యక్రమంలో మహాసభల సమన్వయ కమిటీ సభ్యుడు బి.వెంకట్, సీపీఎం నేతలు చెరుపల్లి సీతారాములు, ఎస్ మల్లారెడ్డి, జి. నాగయ్య, చుక్క రాములు, నంద్యాల నర్సింహారెడ్డితో పాటు అన్ని జిల్లాల కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.