కవిత్వంతో తొలి ములాఖాత్
ఒక్క కవితతో, ఒక్క పదబంధంతో, ఒక్క అభివ్యక్తితో నన్ను జీవితాంతం ప్రభావితం చేసిన వాళ్లున్నారు. వందలాది కవితలు రాసీ ప్రభావితం చేయని వాళ్లూ ఉన్నారు. ఒకానొక మానసిక స్థితిలో అత్యద్భుతం అనిపించిన కవితే మరొక మానసిక స్థితిలో ఎందుకూ కొరగానిదనిపించిన సందర్భమూ ఉంది. ఒక వయసులో, ఒక ఉద్వేగంలో అభిమాన కవులైనవాళ్లే ఇతరేతర విషయాల తెలివిడి వల్ల తమ స్థాయిని పోగొట్టుకున్నవాళ్లూ ఉన్నారు. పూర్తిగా ఇటునుంచి అటు అయిన సందర్భాలూ ఉన్నాయి.
‘‘మన కాలపు కవికి ఏకాంతమూ సమూహమూ రెండూ ప్రాథమిక విధులుగానే ఉన్నాయి’’ అని నాకు అత్యంత ఆప్తుడైన చిలీ మహాకవి పాబ్లో నెరూడా అన్న మాటలను అక్షరాలా నమ్ముతాను. ‘‘సామాజిక కవిత్వా’’నికీ, ‘‘ఆత్మాశ్రయ కవిత్వా’’నికీ విభజన రేఖ సున్నితమైనదో, ఊహాత్మకమైనదో అనుకుంటాను. సామూహికతలో భాగం కాని ఏకాంతం లేదనీ, ఏకాంతం లోకి చొచ్చుకురాని సామూహికత లేదనీ కూడా నా విశ్వాసం. కనుక ఆ రెండు ముద్రలు పడిన కవిత్వమూ నాకు నచ్చుతుంది.
పన్నెండు సంవత్సరాల కింద వెలువడిన నా కవితా సంపుటం ‘పావురం’కు నేను రాసుకున్న ముందుమాట లోంచి...
‘‘కవిత్వం నా కన్నతల్లి. కవిత్వం నా తొలి పావురం. కవిత్వం అంటే భావప్రకటనో, ఆగ్రహ వ్యక్తీకరణో, పద విన్యాసమో, పశ్చాత్తాపమో, ఉద్వేగ ఉధృతో, ప్రశాంత పునరావలోకనమో, ఒత్తిడి నుంచి ఉపశమనమో, ఆనందోత్సాహమో, వెళ్లగక్కడమో... ఎన్ని నిర్వచనాలున్నాయో, అవి ఎప్పుడెప్పుడు ఎంతెంత నిజమో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా నా పావురాన్నో, పావురం కొరతనో మననం చేసుకున్నప్పుడల్లా అది ఇట్లా వెలువడిందని మాత్రమే... లోకానికీ నాకూ పావురం ఉన్నప్పుడూ లేనప్పుడూ కూడ కవిత్వానికీ నాకూ పావురం కుదిరింది...’’
మనిషికి మొట్టమొదటి పావురం తల్లి అయితే బహుశా ఆ తర్వాతి పావురం శబ్దం మీద కావచ్చు. తనను ఆడించేవాళ్లు శబ్దం చేస్తారు. తన చుట్టూ ఉన్నవాళ్లు వాళ్లలో వాళ్లు శబ్దాలు చేసుకుంటారు. తనతో శబ్దాలు చేయడానికి ప్రయత్నిస్తారు. తాను శబ్దం చేస్తే తనవైపు చూస్తారు. కవిత్వమూ శబ్దమయ ప్రపంచమే గనుక కవిత్వం బాల్య సహజమైన, మానవ సహజమైన, సహజాతమైన ప్రవృత్తి కావచ్చు. కవిత్వంతో నా తొలి ములాఖాత్ శబ్దమే.
మా బాపు గొంతెత్తి మంత్రాలు చదివేవాడు. నాకు ఊహ తెలిసేటప్పటికే ‘నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే’ అని ఆయన చదువుతుండిన విష్ణు సహస్ర నామాల శ్లోకంలోని సహస్ర పాదాక్షి శిరోరు బాహవే అనే మాటల లయ మీద ఆసక్తి కలిగింది. ఆ తర్వాత బహుశా ఐదారేళ్ల వయసులో మేం బమ్మెర పోతన వంశీకులమని చెపుతూ, వంశవృక్షం చూపుతూ పోతన పద్యాల మీద ఆసక్తి కలిగించి, ఆ పద్యాలు చదువుతుంటే, ముఖ్యంగా మమ్మల్ని నిద్ర పుచ్చడానికి ‘నారాయణ కవచం’ చదువుతుంటే ఆ లయకు, ప్రతి పద్యం చివరా ‘గాచు గావుతన్’ లాంటి పునరుక్తికీ ఒక వింతలోకంలోకి ప్రవేశిస్తున్నట్టుండేది. అర్థం తెలియకుండానే కేవలం శబ్దం వల్ల కవిత్వంతో కలిసిన మైత్రి అది. ఇప్పటికీ లయబద్ధమైన కవిత్వం మీద ప్రేమ ఉండడం అందుకే కావచ్చు. వచన కవిత్వంలో కూడా యూఫనీ అవసరమని, చదవడంలో కూడా లయబద్ధమైన తూగు పాటించాలని అనుకోవడం అందుకే కావచ్చు.
కవిత్వంలో శబ్దశక్తికి ఒక గీటురాయి ఉంది. పద సంయోజనం సరిగ్గా కుదిరిందా లేదా పైకి గొంతెత్తి చదువుకుంటే తెలుస్తుంది. అది మాత్రాఛందస్సు కూడ కానక్కరలేదు. పూర్తిగా వచన కవిత- వర్స్ లిబర్- స్వచ్ఛంద కవిత కావచ్చు. కాని విభిన్న పర్యాయపదాల నుంచి, వేరు వేరు తూకాల సమానార్థక పదాల నుంచి కవి ఏ పదం ఎందుకు ఎంచుకుంటున్నారు, ఆ పదానికీ ముందు వెనుకల పదాలకూ సంయోజనం సరిగా కుదిరిందా లేదా అనేది గొంతెత్తి చదివినప్పుడు, చదువుకున్నప్పుడు తెలుస్తుంది. శ్లోకాలలోని, గణబద్ధ పద్యాలలోని శబ్దంతో ప్రారంభమైన నా ములాఖాత్ ఆ తర్వాత ‘సృజన’ సాహితీ మిత్రులలో కవిత్వం పైకి చదివి వినిపించే బాధ్యతవల్ల మరింత గాఢమైంది. ప్రతినెలా కనీసం వంద కవితలు చదవవలసి ఉండేది. చాల కవితలు లోపల ఒక్కసారి కూడ గున్గునాయించుకోకుండానే మొదటిసారే పైకి చదవవలసి వచ్చేది. అది ఎంత గొప్ప భావమైనా శబ్ద సంయోజనం సరిగ్గా లేకపోతే ఆ భావం పలుకుతున్నట్టు అనిపించేది కాదు.
(వ్యాసకర్త : ఎన్.వేణుగోపాల్)