రాజీనామా చేసి చూపించండి
టీడీపీ కార్పొరేటర్లకు ఫ్లోర్‌లీడర్ షర్మిలారెడ్డి సవాల్
సాక్షి, రాజమహేంద్రవరం :
రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరికి మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తామన్న టీడీపీ కార్పొరేటర్లు.. ఆ పని చేసి చూపించాలని నగరపాలక సంస్థలో ప్రతిపక్ష నేత మేడపాటి షర్మిలారెడ్డి సవాల్ చేశారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, బాపన సుధారాణితో కలసి ఆమె మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఫ్లోర్‌లీడర్ వర్రే శ్రీనివాసరావు రాజీనామా చేస్తామని ప్రగల్భాలు పలకడం కాదని, దమ్ముంటే చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారానికి నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ కార్పొరేటర్లు, రాజమహేంద్రవరం అభివృద్ధికి విఘాతం కలిగించారని ధ్వజమెత్తారు. ప్రజలకు నష్టం జరిగిన సమయాల్లో సమావేశాలను ఎందుకు బహిష్కరించలేదని ప్రశ్నించారు. అర్హతలు లేనందున నగరాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించని సమయంలో సమావేశాలను వీరు ఎందుకు బహిష్కరించలేదని నిలదీశారు. పుష్కరాలకు కేటయించిన రూ.240 కోట్లలో రూ.117 కోట్లు మాత్రమే ఇచ్చినప్పుడు, పుష్కరాల తొక్కిసలాటలో 30 మంది భక్తులు మరణించినప్పుడు వారికి సంతాపంగా ఎందుకు సమావేశాన్ని బహిష్కరించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పుష్కరాల్లో కార్పొరేటర్ల ప్రమేయం లేకుండా నగరంలో పనులు చేస్తున్నప్పుడు కూడా ఎందుకు మాట్లాడలేదన్నారు. అమృత్ పథకం కింద నగరానికి కేవలం రూ.3 కోట్లు ఇచ్చి, పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి రూ.36 కోట్లు ఇచ్చినప్పుడు కూడా ఎందుకు నిరసన వ్యక్తం చేయలేదో ప్రజలకు వెల్లడించాలన్నారు. పాలకులు, యంత్రాంగం వల్ల పెరిగిన పన్నుల వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థలో మూడూ దఫాలుగా టీడీపీ అధికారంలో ఉందని, 2006 నుంచి చట్ట ప్రకారం పన్నులు ఎందుకు పెంచలేదో అధికారులే చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నేతలు మాసా రామజోగ్, పెంకె సురేష్, కోడికోట తదితరులు పాల్గొన్నారు.